యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, INSTAGRAM/SAMANTHARUTHPRABHUOFFL
తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై సినీనటి సమంత పరువు నష్టం దావా వేసినట్లు 'సాక్షి' పేర్కొంది.
''దీనికి సంబంధించి సమంత తరఫు న్యాయవాది బాలాజీ బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అక్కినేని నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ చానళ్లలో అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రత్యర్థులు తమకు నోటీసులివ్వలేదని జవాబు ఇవ్వడంతో పిటిషన్‌ను వాపస్ ఇచ్చారు.
కోర్టు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసిన తరువాతే వాదోపవాదనలు ఉంటాయని చెబుతూ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసినట్లు'' సాక్షి ప్రచురించింది.

ఫొటో సోర్స్, HTTPS://TIRUPATIBALAJI.AP.GOV.IN/
23న ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
వచ్చే నెలకు సంబంధించిన ఈ నెల 23న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించినట్లు 'నమస్తే తెలంగాణ' కథనంలో తెలిపింది.
'' శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.. రోజుకు 12 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వర్తించనున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచన మేరకు బోర్డు సభ్యత్వానికి ప్రశాంతిరెడ్డి రాజీనామా చేశారు.
కొవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి 20 నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశామని టీటీడీ తెలిపింది. వీరికి ప్రత్యేక దర్శనాల రద్దు కొనసాగుతున్నదని టీటీడీ స్పష్టం చేసినట్లు'' కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కిస్తీ కట్టకుంటే.. బండి గుంజుడే: ప్రైవేటు ఆటో ఫైనాన్సర్ల ఆగడాలు
రాష్ట్రంలో ప్రైవేటు ఆటో ఫైనాన్సర్లు, సంస్థల ఆగడాలకు అంతులేకుండా పోతోందని.. వీటిని నియంత్రించే యంత్రాంగం లేక పోవడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందని 'ఆంధ్రజ్యోతి' వ్యాఖ్యానించింది.
'' నెలసరి వాయిదాలు కట్టని డ్రైవర్లపై భౌతిక దాడులు చేస్తూ, ఫైనాన్స్ సంస్థలు వాహనాలను గుంజుకుపోతున్నాయి. పైగా వాటిని ఇతరులకు విక్రయించడానికీ సిద్ధపడుతున్నాయి.
దీంతో ఆటో ఫైనాన్సర్లు, సంస్థల సాయంతో స్వయం ఉపాధి కింద ఆటోలు, టాక్సీలు, ట్రాలీలు, క్యాబ్‌లను కొనుగోలు చేసిన నిరుపేద డ్రైవర్లు అటు ఉపాధి కరువై, ఇటు వీటి వేధింపులు భరించలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
రాష్ట్రంలో 400లకు పైగా ఎలాంటి గుర్తింపు, రిజిస్ర్టేషన్ లేని ఆటో ఫైనాన్సర్‌లు, ఫైనాన్స్ సంస్థలు కొనసాగుతున్నట్టు సమాచారం.
కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న ఫైనాన్సర్లు రౌడీలను, గూండాలను వినియోగిస్తూ పేద ఆటో, ట్రాలీ, క్యాబ్ డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి గుర్తింపు లేని ఆటో ఫైనాన్సర్లకు రవాణా శాఖ వత్తాసు పలుకుతుండడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోందని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు 'వెలుగు' పత్రిక పేర్కొంది.
''వెంటనే హాస్పిటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో... ఫైర్ సిబ్బంది విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో వ్యాపించిన మంటలు పూర్తిగా అదుపు చేశారు.
అగ్ని ప్రమాదంతో కొంతసేపు హాస్పిటల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే షార్ట్ సర్య్కూట్ కారణంగా విద్యుత్ బోర్డు ప్యానెల్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఉదయం ఏడున్నర సమయంలో గాంధీలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షాట్ సర్క్యూట్ తో మూడో ఫ్లోర్ లో మంటలు వచ్చాయంటున్నారు సిబ్బంది.
ఆరో ఫ్లోర్ వరకు దట్టంగా పొగలు వ్యాపించాయి. ఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 40 నిమిషాల్లో మంటలు, పొగలు అదుపులోకి తెచ్చామన్నారు గాంధీ హాస్పిటల్ అధికారులు, సిబ్బంది. ప్రమాదంతో హాస్పిటల్లోని రోగులు వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీసినట్లు'' వెలుగు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- ఏపీ మూడు రాజధానుల భవనాల నిర్మాణానికి సెంట్రల్ విస్టా ఆర్కిటెక్ట్ సంస్థ
- ఆంధ్రప్రదేశ్‌లో కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
- వరద నీటిలో వంట పాత్రలో కూర్చుని పెళ్లి మండపానికి వెళ్లిన వధూవరులు
- హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ ఆపండి - ఎలక్షన్ కమిషన్
- కశ్మీర్లో 'టార్గెట్ కిల్లింగ్స్'.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రస్తావన ఎందుకొస్తోంది
- చైనా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి ఏమిటి? మొత్తం ప్రపంచానికి ఇది ప్రమాదమా
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













