BH సిరీస్: దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తిరగడానికి వీలుగా వాహనాలకు కొత్త నంబర్ సిరీస్, అర్హతలు ఏమిటంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హర్షల్ అకుర్డే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉద్యోగం లేదా వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు, వాహనాల రిజిస్ట్రేషన్ గురించి అనేక సందేహాలు తలెత్తుతుంటాయి.
మన వాహనాన్ని మనతోపాటు తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా? కొత్త రాష్ట్రంలో మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా? వాహనం నంబర్ మారుతుందా? ఇలా ఎన్నో సందేహాలు.
చాలామందికి వాహనాల బదిలీ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండదు. ఒకవేళ తెలిసినా, ఎన్నో నియమాలు, నిబంధనలు, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం.. అంతా గజిబిజిగా ఉంటుంది.
ఇదంతా చేయకుండా కొత్త ప్రదేశంలో వాహనాలు నడిపితే, పోలీసులు పట్టుకోవచ్చు.
అయితే, ఇప్పుడు వాహనదారులకు ఈ సమస్యలేవీ ఉండబోవు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ఉన్న నియమాలేమిటి?
‘మోటార్ వాహన చట్టం, 1988’ ప్రకారం, వాహనం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొన్ని నియమాలు పాటిస్తోంది.
ఈ నియమాల ప్రకారం, కొత్త ప్రదేశానికి బదిలీ అయినప్పుడు, సొంత వాహనాలను అక్కడ తిరిగి రిజిస్టర్ చేసుకోవాలి.
మనం కొత్తగా వాహనం కొనుక్కున్నప్పుడు, 15 సంవత్సరాలకు రోడ్డు పన్ను కడతాం. కానీ, మనం కొన్న ఐదేళ్లకే వేరే రాష్ట్రానికి బదిలీ అయితే, ప్రభుత్వం మిగిలిన పది సంవత్సరాల టాక్స్ రీఫండ్ చేస్తుంది. అందుకోసం సంబంధిత అధికారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకుని, చూపించాలి.
ఆ తర్వాత, కొత్తగా వెళ్లిన రాష్ట్రంలో అక్కడి రూల్స్ ప్రకారం మళ్లీ రోడ్డు టాక్స్ కట్టాలి. దీనికోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లాలి.
ఈ ప్రక్రియ అంతా ముగిశాకే మన బండికి కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు.
ఇందులో భాగంగా పలుమార్లు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఎంతో శ్రమ, సమయం పడుతుంది దీనంతటికీ.
ఈ నేపథ్యంలో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనలు ఈ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఎక్కడైనా వాహనాలకు ఒకటే నంబర్ సిరీస్
భారత ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా BH (భారత్) అనే కొత్త నంబర్ సిరీస్ మొదలుపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయ్యే అన్ని వాహనాలకూ వర్తిస్తుంది.
కాబట్టి, మనం వేరే రాష్ట్రానికి బదిలీ అయినా, మన వాహనం నంబర్ మార్చుకోనక్కర్లేదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 26న విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
రాష్ట్రాల మధ్య వాహన బదిలీ ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇందుకోసం, కేంద్ర ప్రభుత్వం, ‘మోటార్ వాహన చట్టం, 1988’లోని సెక్షన్ 64ను సవరించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఇది 20వ మార్పు.
ఈ నియమం 2021 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
BH సిరీస్‌లో నంబర్లు ఎలా ఉంటాయి?
వాహన గుర్తింపుకు రిజిస్ట్రేషన్ నంబర్ చాలా ముఖ్యం. వాహనాలకు ఈ నంబర్లు ఆర్‌టీఓ ఆఫీసుల నుంచి లభ్యమవుతాయి.
వాటికి ముందు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అయితే AP అనీ, తెలంగాణ అయితే TS, మహరాష్ట్ర అయితే MH అని, కర్నాటక అయితే KA అని మొదలవుతాయి.
అంతేకాకుండా, ఇది ఏ ఆర్‌టీఓ ఆఫీసులో రిజిస్టర్ అయ్యాయో కూడా ఈ నంబర్లు సూచిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో జిల్లాలకు TS-01, TS-02 ఇలా కనిపిస్తాయి.
కానీ, BH సిరీస్ నంబర్లు కాస్త వేరుగా ఉంటాయి.
కొత్త సిరీస్‌లో వాహనాల నంబర్లు, రిజిస్టర్ చేసుకున్న సంవత్సరాలతో మొదలవుతాయి. వాటి తరువాత BH అని వస్తుంది. ఆ తర్వాత 0001 నుంచి 9999 మధ్యలో ఏ నంబర్ అయినా రావొచ్చు. చివరిగా AA నుంచి ZZ లోపల ఏ అక్షరాలతోనైనా పూర్తవుతుంది.
ఉదాహరణకు ఒక వాహనం 2021లో రిజిస్టర్ చేసుకున్నది అయితే, దానికి AB సిరీస్ నుంచి 1234 నంబర్ ఇచ్చారనుకుందాం, అప్పుడు ఆ వాహనం నంబర్ ప్లేట్‌పై 21 BH 1234 AB అని ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
BH సిరీస్ నంబర్ పొందడానికి ఎవరు అర్హులు?
ప్రస్తుతానికి, అందరికీ ఇది అందుబాటులో లేదు.
మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ కింది కేటగిరీల్లో వాళ్లు BH సిరీస్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
- రక్షణ సిబ్బంది
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,
- కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు
ప్రయివేటు రంగంలో పనిచేసేవారు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ, వారు పని చేస్తున్న సంస్థ కార్యాలయాలు నాలుగు కన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఉండాలి.
పౌరులందరికీ ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మంత్రిత్వ శాఖ స్పష్టం చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఫీజు ఎంత?
BH సిరీస్‌లో నంబరు కావాలంటే వాహన ధరలపై ప్రభుత్వం విధించిన టాక్స్ రేట్ల అనుసారం కొంత శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 10 లక్షల కన్నా తక్కువ ఖరీదు ఉండి, పెట్రోల్‌తో నడిచే వాహనాలు 8 శాతం ఫీజు చెల్లించాలి. రూ. 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ధర ఉండే వాహనాలు 10 శాతం, రూ. 20 లక్షల కన్నా ఎక్కువ ఖరీదు ఉండేవి 12 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
డీజిల్‌తో నడిచే వాహనాలకు ప్రతి కేటగిరీలోనూ 2 శాతం ఫీజు అధికంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు శాతం తక్కువ ఫీజు ఉంటుంది.
వాహన రిజిస్ట్రేషన్ 14 ఏళ్లు పూర్తయిన తర్వాత వాహనదారులు వార్షిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ఇంతకుముందు చెల్లించినదాన్లో సగం ఉంటుంది.
ఈ అంశానికి సంబంధించిన ఇతర వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే రేప్ చేసినట్లేనా?
- ఉత్తరకొరియాలో అణు రియాక్టర్ మళ్లీ పనిచేస్తోంది - ఐరాస
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- టెండూల్కర్‌తో మాట్లాడమని కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











