కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి?

రాధికా కుమారి
ఫొటో క్యాప్షన్, రాధికా కుమారి
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాధికా కుమారి బలపాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే తనకొచ్చినవన్నీ పలక మీద చకచకా రాసేస్తుందేమో అనిపించింది. కానీ, వేళ్ల సందుల్లోంచి బలపమూ జారిపోయింది, బుర్రలోంచి అక్షరాలూ జారిపోయాయి.

నిజానికి పదేళ్ల రాధికకు అ,ఆలు రాయడం అంత కష్టం కాకూడదు. కానీ, దాదాపు 17 నెలల పాటూ బడి మొహం చూడని ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయింది. ఆన్‌లైన్ చదువులూ లేవు.

కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన దగ్గర నుంచి అనేకచోట్ల పాఠశాలలు మూతబడ్డాయి.

ప్రైవేటు స్కూళ్లు కొన్ని నెలల్లోనే ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించాయిగానీ, ప్రభుత్వ పాఠాశాలలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాపులు లేని విద్యార్థులు ఏకంగా చదువులకే దూరమయ్యారు.

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఓ దళిత గిరిజన గ్రామం డుంబిలో నివసిస్తున్న రాధిక పరిస్థితి కూడా ఇదే. గత మార్చి నుంచి రాధిక చదువుకుంటున్న బడి మూతపడింది. ఆమె చదువుకు దూరం అయింది.

డుంబి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ స్థాయిల్లో దూరదర్శన్ ద్వారా, ఇతర టీవీ కార్యక్రమాల ద్వారా విద్యాబోధన ప్రారంభించాయి. కానీ, ఆ ఊర్లో చాలామంది ఇళ్లల్లో టీవీ కూడా లేదు.

అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం ప్రారంభించారు.

డుంబీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
ఫొటో క్యాప్షన్, డుంబీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

వెనుబడిన వర్గాలపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది?

కరోనా కారణంగా చదువుకు దూరమైన పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా, ప్రముఖ ఆర్థికవేత్త జా డ్రెజ్ డుంబి గ్రామానికి చెందిన 36 మంది పిల్లలను ఇంటర్వ్యూ చేశారు. వారిపై ఒక సర్వే జరిపారు.

పిల్లల చదువు విషయమై పాఠశాలల నుంచి అందిన సహాయం, టీచర్లు పిల్లల ఇంటికి వెళ్లి చేసిన సహాయం, ఆన్‌లైన్ క్లాసులు, ప్రయివేటు ట్యూషన్లు, తల్లిదండ్రుల అక్షరాస్యత రేటు మొదలైన విషయాలన్నిటినీ ఈ సర్వేలో సేకరించారు.

ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 36 మంది పిల్లల్లో 30 మంది ఒక్క అక్షరం కూడా చదవలేకపోవడం, రాయలేకపోవడం చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని డ్రెజ్ అన్నారు.

ఎక్కువగా ప్రయిమరీ స్కూలు పిల్లల్లే చదవడం, రాయడంలో వెనుకబడి ఉన్నారని, గత ఏడాదిన్నర కాలంగా వీరికి చదువు విషయమై దాదాపు ఏ సహాయమూ అందలేదని ఆయన వివరించారు.

చదవలేదుగానీ పాస్ అయిపోయారు

"హిందీ, ఇంగ్లిష్ నాకు ఇష్టమైన సబ్జెక్టులు" అని రాధిక చెప్పింది. కానీ, ఇప్పుడు ఆమెకు వాటిలో చెప్పిన ఏ పాఠాలూ గుర్తు లేవు.

స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రాధిక రెండో తరగతి చదువుతూ ఉండగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైంది. ఇప్పుడు ఆమెను నాలుగో తరగతికి పంపించేశారు. కానీ, గత ఏడాదిన్నరగా ఆమె చదువు ఏ రకంగానూ కొనసాగలేదు.

భారత విద్యాహక్కు చట్టం ప్రకారం ఐదవ తరగతి వరకు పిల్లలను ఫెయిల్ చేయకూడదు. పిల్లలపై పరీక్షల భారం మోపకుండా ఉండడానికీ, ఏ ఒత్తిడీ లేకుండా హాయిగా చదువుకోవడానికీ వీలు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా పాఠశాలలు ఈ నియమాన్ని పాటించాయి. కానీ, పిల్లలు ఏమీ చదువుకోకుండానే, ఏమీ నేర్చుకోకుండానే పై తరగతులకు వెళిపోయారు.

రాధిక పక్కింటి పిల్ల వినీతా కుమారి పరిస్థితి కూడా ఇదే. చదవకపోతే, రాయకపోతే ఆమె తండ్రి కోపగించుకుంటారు. కానీ తన వయసుకు టీచరు సహాయం లేకుండా, తనంతట తాను చదువుకోవడం చాలా కష్టం.

నేను రోజూ బయటికెళ్లి పనిచేయాల్సి వస్తుంది లేకపోతే మాకు పూట గడవదు. పక్కన కూర్చుని వినీతను చదివించేందుకు సమయం దొరకదు" అని ఆమె తండ్రి మదన్ సింగ్ చెప్పారు.

ఆ గిరిజన గ్రామంలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఆ పిల్లలకు స్కూలే దిక్కు. అది కూడా మూతబడితే వాళ్ల చదువులు పూర్తిగా ఆగిపోతాయి.

ప్రభుత్వ పాఠశాల

చిన్న పిల్లలకు మరింత సహాయం అవసరం

ఇంతింత చిన్న పిల్లలు ఏడాదికి పైగా బడులకు వెళ్లకపోతే పూర్తిగా చదువులకే దూరమయ్యే పరిస్థితి రావొచ్చని జా డ్రెజ్ అన్నారు.

"పెద్ద తరగతుల్లో అయితే, అప్పటికే చదవడం, రాయడం బాగా వచ్చేస్తుంది కాబట్టి కాస్త వెనుబడినా, శ్రమతో పురోగతి సాధించవచ్చు. కానీ, ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఏమీ నేర్పకుండా పై తరగతులకు పంపించేస్తే, వాళ్లు ఎంత శ్రమపడినా ముందుకెళ్లడం కష్టం అయిపోతుంది. చదువు మీద పూర్తిగా ఆసక్తి పోతుంది. బడి మానేస్తారు" అని డ్రెజ్ అన్నారు.

డ్రెజ్ ఇప్పుడు మరో తొమ్మిది రాష్ట్రాల్లో 1500 మంది పిల్లలపై సర్వే చేస్తున్నారు. మరి కొంతమంది ఆర్థికవేత్తల సహాయంతో అసోం, మహారాష్ట్ర, ఒడిశా, దిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సర్వేలు జరుపుతున్నారు.

ఇందులో భాగంగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి 5 నుంచి 14 వయసు మధ్య గల పిల్లల అక్షరాస్యత గణాంకాల వివరాలు సేకరిస్తారు. వాటిని 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తారు.

వినీతా కుమారి
ఫొటో క్యాప్షన్, తమ్ముడు, చెల్లితో వినీతా కుమారి

మగపిల్లలకు ట్యూషన్లు

కోవిడ్ మహమ్మారి వలన బాల, బాలికల మధ్య విద్య అంతరాలు కూడా పెరిగాయి.

కొన్ని కుటుంబాల్లో ప్రైవేటు ట్యూషన్ పెట్టించగలిగే స్థోమత ఉన్నప్పటికీ, కొడుకులకైతేనే ట్యూషన్ పెట్టిస్తారు.

రాధిక తమ్ముడు విష్ణు ఆమె కన్నా ఏడాది చిన్నవాడైనా, చదవడం, రాయడంలో ఆమె కన్నా ముందున్నాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు ట్యూషన్‌కు వెళతాడు.

రాధికకు అయిదుగురు అక్కలు. వాళ్లెవరూ కూడా గత ఏడాదిన్నర కాలంగా స్కూలుకు వెళ్లలేదు. ఆన్‌లైన్ క్లాసులకూ హాజరు కాలేదు.

"విష్ణు ట్యూషన్‌కు నెలకు రూ. 250 ఖర్చు అవుతుంది. తన అక్కలు ఆరుగురికీ కూడా ట్యూషన్ పెట్టించాలంటే మావల్ల ఎక్కడ అవుతుంది? " వారి తల్లి కుంతీ దేవి అన్నారు.

ఇది కేవలం రాధిక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు. దేశంలో అనేక కుటుంబాల్లో కొడుకును ప్లస్ అని, కూతురిని మైనస్ అని అనుకుంటారు. కొడుకైతే వృధాప్యంలో తమను చూసుకుంటాడని, కూతురు పెళ్లి చేసుకుని మరొక ఇంటికి వెళిపోతుందని, ఆమెపై ఖర్చు పెట్టడం అనవసరమని కూడా భావిస్తారు.

దిగువ ఆదాయ కుటుంబాల్లో కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి, కొడుకులను ప్రయివేటు పాఠశాలకు పంపించే ఉదంతాలు అనేకం.

ఇలాంటి విషయాలన్నీ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని సంయుక్త సుబ్రమణియన్ అన్నారు.

భారతదేశంలో వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా పనిచేసే అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ ప్రథమ్‌లో సంయుక్త పనిచేస్తున్నారు.

"తెలియకుండానే రాధిక మనసులో కొన్ని విషయాలు నాటుకుపోతాయి. తనకు కావలసినవి తనకు దక్కవు. తక్కుడికే దక్కుతాయి అని అనుకుంటుంది. ఇది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది" అని సంయుక్త అన్నారు.

2020 అక్టోబర్‌లో ప్రథమ్ సంస్థ తమ యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కోసం వారం పాటు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.

రెండింట మూడొంతుల మంది పిల్లలకు చదువుకునేందుకు, రాసుకునేందుకు, క్లాసులకు హాజరయేందుకు కావాలసిన సామాగ్రి అందలేదని ఆ సర్వేలో తేలింది.

విష్ణు
ఫొటో క్యాప్షన్, విష్ణు

పాఠశాలలు తెరుచుకుంటున్న ఈ సమయంలో...

ఇప్పుడు మెల్లిమెల్లిగా పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు రావడం మొదలెట్టాక, టీచర్లు వారిపై ఒత్తిడి తేకుండా ఆటపాటల ద్వారా వారి విద్యా స్థాయిలను అంచనా వేయాలని సంయుక్త అంటున్నారు.

"ముందు వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో పరిశీలించాక, తదనుగుణంగా విద్యాబోధన చేయాలి. లేదంటే చాలామంది ఇంకా వెనుకబడిపోతారు" అని ఆమె అన్నారు.

స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటాయన్న మాటే రాధికకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. బడిలో ఆడుకోవడం, చదువుకోవడం రెండిటినీ తాను ఎంతో మిస్ అయ్యానని చెప్పింది.

"తలుపులకు తాళాలు తీసి, లోపలికెళ్లి నా బెంచీ మీద కూర్చుంటా" అంది రాధిక మెరిసే కళ్లతో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)