ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకున్న బడులు, తొలిరోజు ఎలా గడిచిందంటే..

ఏపీ స్కూల్ ఓపెనింగ్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. విద్యార్థులు నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ స్కూళ్లు, కాలేజీలలో అడుగుపెట్టారు.

ఓవైపు కరోనా థర్డ్‌వేవ్ భయాందోళనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అభ్యంతరాలున్నప్పటికీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో అడుగుపెట్టారు. తొలిరోజు హాజరు శాతం తక్కువగా ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు ఆఫ్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి.

కానీ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభించడానికి పెద్దగా మొగ్గుచూపలేదు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు పూర్తిగా తెరుచుకోలేదు. సోమవారం కూడా కొన్ని స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులకే ప్రాధాన్యతనిచ్చాయి.

పాఠశాలల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేసిన పాఠశాలను పరిశీలించారు. పి గన్నవరం మండలం పోతవరం పాఠశాలను ఆయన సందర్శించారు.

విద్యాసంవత్సరం కోల్పోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పాఠశాలలు తెరిచినట్టు ఆయన చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

ఏపీ స్కూల్ ఓపెనింగ్

కరోనా కేసులు కొనసాగుతుండగానే..

ఏపీలో కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ నెల 14వ తేదీ నాటి ప్రభుత్వ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1535 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో నైట్‌ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న కర్ఫ్యూను ఆగష్టు 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలిచ్చింది.

కరోనా కేసులు పూర్తిగా తగ్గకపోయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు రీత్యా పాఠశాలలు తెరిచామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. అన్ని జాగ్రత్తల మధ్య విద్యాసంస్థలు నడుపుతామని వెల్లడించారు.

ఏపీ స్కూల్ ఓపెనింగ్

ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఓపీ) రూపొందించినట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.

అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా, సెక్షన్‌కు 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చింది.

తరగతి గదులు సరిపోకపోతే 6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు (రోజు విడిచి రోజు) తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.

ప్రాథమిక పాఠశాలల్లో 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు.

తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది.

పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా శానిటైజ్‌ చేయిస్తామని చెబుతున్నారు.

పిల్లల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్‌ రూమును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్‌ కేసులను గుర్తిస్తుండాలి. వాటి సంఖ్య ఆధారంగా స్థానికంగానే పాఠశాలలు తెరవాలా లేదా అన్నది నిర్ణయిస్తారు.

ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలయ్యింది.

ఏపీ స్కూల్ ఓపెనింగ్

వ్యాక్సినేషన్ గురించి ఏం చెబుతోంది?

ఏపీలో విద్యాసంస్థలు తెరవడానికి ముందే బోధన, బోధనేతర సిబ్బందికి వ్యాక్సీన్లు పూర్తిగా వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలయిన పిటీషన్‌ని చీఫ్‌ జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈనెల 12న విచారణ జరిపి 18కి కేసు వాయిదా వేశారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రాథమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్ వ్యాక్సినేషన్ వివరాలను కోర్టుకి సమర్పించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధనా సిబ్బంది 2.83 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. అందులో 1.34 లక్షల మందికి మొదటి డోసు మాత్రమే వ్యాక్సీన్ అందించినట్టు పేర్కొన్నారు. 79వేల మందికి రెండు డోసులు వేసినట్టు వివరించారు. ఇంకా 69 వేల మంది టీచర్లు, మరో 20వేల మంది బోధనేతర సిబ్బందికి వ్యాక్సీన్ వేయలేదని కోర్టుకి తెలియచేశారు.

దాంతో పావు వంతు మందికి వ్యాక్సీన్లు వేయకుండా స్కూళ్లు తెరుస్తుండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బడులు తెరవడం మీద పెడుతున్న శ్రద్ధ సిబ్బందికి వ్యాక్సీన్లు, ఇతర జాగ్రత్తల మీద చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీ స్కూల్ ఓపెనింగ్

'మాటలకు, ఆచరణకు పొంతన ఉండదు'

"గత సంవత్సరం కూడా ఇలానే చెప్పారు. కానీ స్కూళ్లు తెరిచిన వెంటనే వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రమాదకర పరిస్థితులు కూడా చవిచూశారు. ఇప్పుడు కోవిడ్ ప్రమాదం పూర్తిగా తొలగిపోకముందే విద్యాసంస్థలు తెరిచారు. ఇది విద్యార్థుల ప్రాణాల సమస్య" అని జిల్లా మాజీ విద్యాశాఖాధికారి పి నరసింహరావు బీబీసీతో అన్నారు.

"థర్డ్ వేవ్ మూలంగా పిల్లలకు ఎక్కువ ముప్పు ఉంటుందనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ బడులు తెరిచారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఏ స్కూల్లోనూ జాగ్రత్తలు పాటించరు. శానిటైజేషన్ తరచుగా చేయాలని ప్రొటోకాల్‌లో ఉంది. మరి వాటిని ఎవరు అందిస్తారు. కొనుగోలు చేయాలంటే డబ్బులు ఎలా? ప్రభుత్వం ప్రకటనలు ఆడంబరంగా, ఆచరణ నామమాత్రంగా ఉంటుంది. దానివల్ల గత ఏడాది నాటి ముప్పు తప్పదనే ఆందోళన తల్లిదండ్రుల్లో కూడా ఉంది. ఇంకా ఒక నెలరోజులు వేచి చూసి, అప్పుడు బడులు తెరిచి ఉంటే బాగుండేది" అని నరసింహారావు అన్నారు.

ఏపీ స్కూల్ ఓపెనింగ్

ఆందోళనగానే ఉంది..అయినా తప్పదు కదా!

పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ఆందోళనగా ఉన్నప్పటికీ, తప్పదు కదా అని కొంతమంది తల్లితండ్రులు అంటున్నారు.

"ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నా పిల్లలు వినడం లేదు. పేరుకి డివైజ్ పట్టుకుని కూర్చున్నా ఫలితం ఉండడం లేదు. ఆఫ్‌లైన్ క్లాసులు అవసరమే. అయితే బయట కరోనా కేసుల గురించి వింటుంటే కొంత ఆందోళన ఉంది. అయినా తప్పదు కదా. పిల్లల్ని పంపించాలనే అనుకుంటున్నాం. అందుకే స్కూల్ బస్సులో కాకుండా పేరెంట్స్ మేమే ఎవరో ఒకరం పిల్లల్ని దింపాలని నిర్ణయించుకున్నాం. స్కూల్లో కూడా ఎవరితోనూ దగ్గరగా వెళ్లకుండా పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నాం. వాటిని వాళ్లు పాటించే అవకాశం లేదు. అయినా జాగ్రత్తగానే స్కూల్‌కి వెళ్లడమే బెస్ట్. అందుకే మా పిల్లల్ని పంపిస్తున్నాం. గతేడాది కూడా ఇలాంటి వాతావరణంలోనే పంపించాం. అప్పుడు ముప్పు బారిన పడకుండా గట్టెక్కాం. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాం" అని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పి సుమలత అనే సెక్రటేరియేట్ ఉద్యోగిని అన్నారు.

ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు విజయవాడలో 8వ తరగతి, ఆరో తరగతి చదువుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి

ఫొటో సోర్స్, THINKSTOCK

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి

పిల్లల భవిష్యత్తు కోసమే - ప్రభుత్వం

"విద్యార్థులు రెండు విద్యా సంవత్సరాల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా భయం ఓవైపు, క్లాసులు నడవకపోవడంతో మరోవైపు నష్టపోతున్నారు. ఇబ్బందులున్నా వారి భవిష్యత్తు రీత్యా తరగతులు జరపడమే ఉత్తమమని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కూడా చెబుతున్నారు. కొన్ని సమస్యలుంటాయి. వాటిని ఎదుర్కొంటాం. గత ఏడాది మాదిరిగా కూడా అక్కడక్కడా కొన్ని కేసులు బయటపడినా వెంటనే స్పందిస్తాం. ఇప్పటికే పీడియాట్రిక్ ఐసోలేషన్ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్య రాదనే భావిస్తున్నాం" అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)