ముకేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్‌ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సచిన్‌ వాజె
    • రచయిత, మయాంక్‌ భగవత్‌, అమృత దుర్వె
    • హోదా, బీబీసీ మరాఠీ

వ్యాపారవేత్త ముకేశ్‌ అంబాని ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం దొరికినప్పటి నుంచి ఆ కేసు రోజురోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడది మహారాష్ట్రలో రాజకీయ అలజడిని కూడా సృష్టిస్తోంది.

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కారు దొరికిన తరవాత అనేక పరిణామాలు జరిగాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవాడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

విస్ఫోటనాల చేరవేత కోసం వాడిన కార్లలో ఒకటి సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ సచిన్‌ వాజె అధికారిక వాహనమని తేలింది. ఆ తర్వాత ఆయన్ను సస్పెండ్‌ చేయడం, అరెస్టు చకచకా జరిగిపోయాయి. ఈ కేసును ప్రస్తుతం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) విచారణ జరుపుతోంది.

అసలేం జరిగింది ?

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 24 అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియో కారు ముంబయిలోని ప్రియదర్శిని పార్క్‌ జంక్షన్‌ దగ్గర ఆగి ఉంది.

అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో ఈ వాహనానికి ఓ ఇన్నోవా వాహనం తోడయింది. రెండూ బైకుల్లా వైపు కదిలాయి. తర్వాత అవి దక్షిణ ముంబయిలోని కార్‌మైఖేల్‌ రోడ్‌వైపు వెళ్లాయి. పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం అంటిల్లా ఉండేది ఇక్కడే.

రాత్రి 2.30 గంటల సమయంలో కార్‌మైఖేల్‌ రోడ్‌లోని అంబానీ నివాసానికి 500 మీటర్ల దూరంలో స్కార్పియో కారును పార్క్‌ చేశారు. ఆ తర్వాత ఇన్నోవా కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్న ఈ వాహనాన్ని ముకేశ్‌ అంబానీ ఇల్లు అంటిల్లా సమీపంలో పార్క్‌ చేశారు.

అంతకు ముందు ఈ కారు ముంబయి నగరంలోకి ప్రవేశించే ప్రాంతాలలో ఒకటైన థాణెలోని ములంద్‌ వద్ద గల టోల్‌ ప్లాజా ద్వారా సిటీలోకి ప్రవేశించినట్లు ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత నుంచి అది సీసీటీవీ ఫుటేజ్‌లో ఎక్కడా కనిపించ లేదు.

ఫిబ్రవరి 25 ఉదయం అంబానీ నివాసం అంటిల్లా సెక్యురిటీ సిబ్బంది ఈ వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గామ్‌దేవీ పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌ సహా వచ్చి అక్కడి నుంచి వాహనాన్ని తరలించారు. ఆ ప్రాంతంలో భద్రత పెంచారు.

ఆ స్కార్పియోను తనఖీ చేయగా 20 జిలెటిన్‌ స్టిక్స్‌ లభించాయి. నీతా, ముకేశ్‌ అంబానీలను బెదిరిస్తూ అందులో ఒక నోట్‌ కూడా దొరికింది. "ఇది ట్రైలర్‌ మాత్రమే. ఈసారి ఇలా ఉండదు. మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలం" అని రాసి ఉంది.

అందులో దొరికిన జిలెటిన్‌ స్టిక్స్‌ అన్నీ కనెక్ట్‌ చేసి లేవు కాబట్టి అవి పేలే అవకాశం లేదు. అప్పటి వరకు అందిన ఆధారాలతో స్కార్పియో వాహనం ఎవరిదో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, పీపీఈ కిట్‌లో నడిచి వచ్చింది ఎవరు అన్నది ఈ కేసులో కీలకంగా మారింది.

ఆ వాహనం ఎవరిది?

ఈ స్కార్పియో థాణె ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మన్‌సుఖ్‌ హిరేన్‌ది అని గుర్తించారు. కానీ ఆయన పోలీసులకు వేరే విషయం చెప్పారు. తన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి దాన్నితీర్చకపోవడంతో తాను అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నానని మన్‌సుఖ్‌ పోలీసులకు చెప్పారు.

ఫిబ్రవరి 17న తాను విఖ్రోలీ సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌ హైవే మీద స్కార్పియోలో ప్రయాణిస్తుండగా స్టీరింగ్‌ జామ్‌ అయ్యిందని, దాన్ని అక్కడ వదిలేసి వెళ్లానని, మరుసటి రోజు దాని కోసం రాగా, ఎవరో దొంగిలించారని గుర్తించానని మన్‌సుఖ్‌ చెప్పారు.

ఈ మేరకు తాను విఖ్రోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని హిరేన్‌ వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ ఘటనలపై రాజకీయ రగడ కూడా మొదలైంది.

ప్రభుత్వం ఈ కేసును సరిగా హ్యాండిల్‌ చేయలేకపోతోందని, మన్‌సుఖ్‌ హిరేన్‌కు రక్షణ కల్పించాలని విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే మన్‌సుఖ్‌ హిరేన్‌ చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, ముకేశ్‌ అంబానీ ఇంటి ముందు దొరికిన జిలెటిన్‌ స్టిక్స్‌

హిరేన్‌ ఎలా చనిపోయారు?

మార్చి 4న రాత్రి 8 గంటల సమయంలో మన్‌సుఖ్‌ హిరేన్‌ షాప్‌ నుంచి ఇంటికి వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చిన కాసేపటికే తావ్డే అనే పోలీస్‌ అధికారి నుంచి ఆయనకు కాల్‌ వచ్చిందని, కండివాలి ప్రాంతానికి రావాలని ఆ పోలీస్‌ అధికారి పిలిచారని హిరేన్‌ తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు.

హిరేన్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మార్చి 5న ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబ్రా ప్రాంతంలో ఒక డెడ్‌బాడీ కనిపించిందని పోలీసులు హిరేన్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇసుకలో కూరుకుపోయి ఉన్న హిరేన్‌ మృతదేహంలో ముఖానికి నాలుగైదు కర్చీఫ్‌లు కట్టి ఉన్నాయి.

నీళ్లలో మునగడం వల్ల చనిపోయారని ప్రాథమిక పరీక్షలో తేలినా, ఆయన మరణానికి అసలు కారణమేంటన్నది ఫొరెన్సిక్‌ లేబరేటరీ కెమికల్‌ ఎనాలిసిస్‌ రిపోర్ట్‌ వస్తే గాని తెలియదు. ప్రస్తుతం ఆ రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా పోలీసులు మార్చి 5న కేసును రిజిస్టర్‌ చేశారు. అయితే హిరేన్‌ను పిలిచిన పోలీస్‌ అధికారి తావ్డే ఎవరో ఇంత వరకు తేలలేదు.

హిరేన్‌ చేతులు కట్టేసి ఉన్నాయని, ఆయన్ను ఎవరో హత్య చేశారని ప్రతిపక్ష నేత ఫడ్నవీస్‌ ఆరోపించగా, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఈ ఆరోపణలను ఖండించారు.

మరోవైపు ఈ పేలుడు పదార్ధాల కేసు విచారణ మహారాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ నుంచి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి బదిలీ అయ్యింది.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, మన్‌సుఖ్‌ హిరేన్

సచిన్‌, మన్‌సుఖ్‌ల మధ్య ఉన్న లింక్‌ ఏంటి?

ఇక ఈ కేసు విచారణ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ వ్యక్తి పీపీఈ కిట్‌ (కరోనా రాకుండా వైద్య సిబ్బంది వేసకునే డ్రెస్‌) ధరించి కనిపించడం సంచలనం సృష్టించింది.

ఆ వ్యక్తి స్కార్పియో వెనకే వచ్చిన ఇన్నోవా వాహనం నుంచి దిగి వస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది. ఆ వ్యక్తి ఎవరు అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న వ్యక్తి పేరు అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజె ది. సంఘటనా స్థలానికి అందరికన్నా ముందు చేరుకున్న వ్యక్తి సచిన్‌ వాజె అని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు.

అయితే సచిన్‌ వాజె ఈ వాదనను ఖండించారు. స్థానిక పోలీసులు చేరుకున్న మూడు, నాలుగు గంటల తర్వాత తాను సంఘటనా స్థలానికి వచ్చానని వాజె అన్నారు. మార్చి 13న వాజెను 12 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌ఐఏ అదే రోజు రాత్రి ఆయన్ను అరెస్టు చేసింది.

ఆ మరుసటి రోజు అంటే మార్చి 14న MH 01 ZA 403 నంబర్‌తో ఉన్న ఒక తెలుపు రంగు ఇన్నోవా కారును ఎన్‌ఐఏ గుర్తించింది. ముంబయి పోలీస్‌ మెయింటెనెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆ ఇన్నోవాను స్వాధీనం చేసుకుంది. ఆ కారు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందినదని తేలింది. ఈ బ్రాంచ్‌లోనే సచిన్‌ వాజె పని చేస్తున్నారు.

సచిన్‌ వాజె
ఫొటో క్యాప్షన్, సచిన్‌ వాజె

అంటిల్లా ముందు పేలుడు పదార్ధాల కేసులో సచిన్‌ వాజె పాత్ర కచ్చితంగా ఉందన్నది ఎన్‌ఐఏ వాదన. అయితే ఎందుకు ఈ పథకం రచించారన్నది తెలియాల్సి ఉంది. కుట్ర ఆరోపణ మీద సచిన్‌ వాజెను అరెస్టు చేయగా, ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో సచిన్‌ వాజె మీద ఎన్‌ఐఏకు అనుమానాలు పెరగడానికి మన్‌సుఖ్‌ హిరేన్‌ భార్య విమల చేసిన ఆరోపణలు కూడా ఓ కారణం.

తన భర్త మన్‌సుఖ్‌కు, సచిన్‌ వాజెకు పరిచయం ఉందని, 2020 నవంబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు తన భర్త స్కార్పియోను సచిన్‌ వాజె ఉపయోగించారని విమల వెల్లడించారు.

అప్పుడప్పుడు తన భర్త, సచిన్‌ వాజె కలిసి బయటకు వెళుతుండే వారని, బహుశా ఆయనే తన భర్తను హత్య చేసి ఉండొచ్చని విమల ఆరోపించారు. సచిన్‌ వాజె, మన్‌సుఖ్‌ హిరేన్‌ల మధ్య ఫోన్‌ సంభాషణలు జరిగాయని, కాల్‌ రికార్డ్‌ ఆధారాలు తన వద్ద ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు.

అయితే మన్‌సుఖ్‌ మరణం గురించి తనకేమీ తెలియదని, అంటిల్లా సమీపంలో పేలుడు పదార్ధాలు దొరికినప్పుడు అక్కడికి తానే ముందుగా వెళ్లాననడం సరికాదని సచిన్‌ వాజె మీడియాతో అన్నారు.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Sharad Badhe, BBC Marathi

ఫొటో క్యాప్షన్, సచిన్‌ వాజె

ఎవరు ఈ సచిన్‌ వాజె?

కొల్హాపూర్‌కు చెందిన సచిన్‌ హిందూరావ్‌ వాజె 1990లో పోలీస్‌ శాఖలో చేరారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌శర్మతో సచిన్‌ కొన్నాళ్లు కలిసి పని చేశారు. మున్నా నేపాలీ అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు సచిన్‌ పేరు బైటికి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు 60 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారని చెబుతారు.

2002లో ఘట్కోపర్‌ పేలుళ్ల కేసులో ఖ్వాజా యూనస్‌ అనే యువకుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఇంటరాగేషన్‌ జరుగుతుండగా యూనస్‌ మరణించారు. ఆయన మరణానికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొన్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల బృందంలో సచిన్‌ వాజె కూడా ఒకరు.

2004లో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2007లో సచిన్‌ వాజె తన పదవికి రాజీనామా చేయగా, దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. 2008లో బాల్‌ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు సచిన్‌ వాజె. అయితే రాజకీయంగా అంత క్రియాశీలకంగా ఉండేవారు కాదని పార్టీ వర్గాలు చెప్పాయి.

2020 జూన్‌లో ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ముంబై పోలీస్‌ క్రైమ్‌బ్రాంచ్‌లో ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు అధిపతిగా పని చేస్తున్నారు. ఇప్పుడు సచిన్ వాజె రెండోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.

సచిన్‌ వాజె

ఫొటో సోర్స్, Mumbai Police

ఫొటో క్యాప్షన్, ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీలను బెదిరిస్తూ ఓ నోట్‌ అంటిల్లా సమీపంలో నిలబెట్టిన స్కార్పియోలో దొరికింది.

జవాబు దొరకని ప్రశ్నలు

1) పేలుడు పదార్ధాల కారును అంబానీ ఇంటి దగ్గర పార్క్‌ చేయడం వెనక ఉద్దేశం ఏంటి ? ఇది అతి పెద్ద ప్రశ్న.

2) ఆ రోజు ఆ రెండు వాహనాలను నడిపిందెవరు? ఇందులో ఒక కారు ముంబయి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు చెందింది. సచిన్‌ వాజె అధికారిక వాహనం.

3) ఆకుపచ్చ స్కార్పియో నిజంగా దొంగతనానికి గురైందా? ఎన్‌ఐఏ చెబుతున్నదాని ప్రకారం మన్‌సుఖ్‌ హిరేన్‌దిగా చెబుతన్న ఆ వాహనం, దొంగతనానికి గురైందని చెబుతున్న రోజు నుంచి అంటే ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు సచిన్‌ వాజె ఇంటి దగ్గరే ఉంది.

4) ఆ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాను సచిన్‌ వాజె అంతకు ముందే తొలగించారు. ఆ కారు ఆయన దగ్గరే ఉందనడానికి ఇదే కారణమని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

5) ప్రస్తుతానికి ముంబై ఏటీఎస్‌ విభాగం గుర్తు తెలియని వ్యక్తి హిరేన్‌ను చంపి ఉంటారని కేసు నమోదు చేసింది. ఇంతకీ మన్‌సుఖ్‌ హిరేన్‌ను ఎవరు చంపారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)