మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం: రాజ్ ఠాక్రేను కాదని బాల్ ఠాక్రే వారసుడిగా ఆయన ఎలా ఎదిగారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి
మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. 56 మంది సభ్యులున్న శివసేన అధినేత ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్ధతుతో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కారు.
ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, చగన్ భుజ్‌బల్, శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయి, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరాట్, నితిన్ రౌత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కనుంది. దీనికి పృధ్వీరాజ్ చవాన్ పేరు వినిపిస్తోంది. మహారాష్ట్రలో 43 మంది కేబినెట్ మినిస్టర్లు ఉండడానికి అవకాశం ఉంది. ఇందులో 15 మంది శివసేన నుంతి, 16 మంది ఎన్సీపీ నుంచి, 12 మంది కాంగ్రెస్ నుంచి త్వరలో మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఎవరికి ఈ పదవులు దక్కుతాయనేది ప్రస్తుతానికి ప్రకటించలేదు.
అయితే, రాజ్ ఠాక్రేను కాదని బాల్ ఠాక్రే వారసుడిగా ఉద్ధవ్ ఎలా ఎదిగారు? ఆయన ప్రత్యేకతలేంటి? రాజకీయాల్లో ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
అది 1996-97 సంవత్సరం. రాజ్ ఠాక్రే దాదర్‌లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయటానికి వెళ్లేవారు. కొన్ని రోజులకు ఆయన తన దాదూ (అన్న) ఉద్ధవ్ ఠాక్రేను ఆడటానికి పిలిచారు. ప్రాక్టీస్ చేసేటపుడు ఉద్ధవ్ ఠాక్రే కింద పడిపోయారు. రాజ్ ఠాక్రే, ఆయన మిత్రులు కొందరు ఉద్ధవ్‌ను చూసి నవ్వారు. ఆ సంఘటన తర్వాత ఉద్ధవ్ ఆ కోర్టులో ప్రాక్టీస్ చేయటానికి వెళ్లటం మానేశారు.
ఆయన బాడ్మింటన్ మానేశారని అంరూ అనుకున్నారు. కానీ.. ఉద్ధవ్ ఠాక్రే ప్రాక్టీస్ చేయటానికి మరొక కోర్టును బుక్ చేసుకున్నారు. రాజ్ ఠాక్రేకు మెళకువలు నేర్పించే అదే కోచ్‌ను తానూ నియమించుకున్నారు. కొంత కాలం తర్వాత ఉద్ధవ్ ఇప్పుడు చాలా బాగా ఆడతారని మంచి ఆటగాళ్లకు సైతం గట్టి పోటీ ఇవ్వగలరని ఆ కోచ్ చెప్పారు.
రాజకీయాల్లో కూడా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పని తీరు ఎలా ఉంటుందనే దానికి ఈ ఉదంతం అద్దం పడుతుంది. శివసేన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. శివసేనకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలసి కూటమి నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నాయి. దీంతో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ ప్రయాణం
''ఉద్ధవ్ ఠాక్రే 1990ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. శివసేన 1985లో ముంబై మునిసిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో శివసేన ప్రచారంలో ఉద్ధవ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ అప్పటికి ఆయన ఇంకా సాధారణ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు'' అని 'ద ఠాక్రే కజిన్స్' అనే పుస్తకం రాసిన ధావా కులకర్ణి, ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం తొలి రోజుల గురించి చెబుతారు.
''1991లో శివసేన ములుంద్ కార్యాలయంలో శిశిర్ షిండే ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ రంగ అధికారిక అరంగేట్రంగా పరిగణిస్తారు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సోదరుల మధ్య సంఘర్షణ
రాజ్ ఠాక్రే 1991 డిసెంబర్‌లో నిరుద్యోగితకు వ్యతిరేకంగా నాగ్‌పూర్‌లో ఒక నిరసన ప్రదర్శనకు సారథ్యం వహించారు.
''ఆ నిరసన ప్రదర్శనకు ప్రణాళిక మొత్తం పూర్తయింది. కానీ ప్రదర్శన ముందు రోజు రాత్రి మాతోశ్రీ నుంచి రాజ్ ఠాక్రేకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మరుసటి రోజు జరగబోయే సభలో రాజ్‌తో పాటు దాదూ (ఉద్ధవ్ ఠాక్రే) కూడా ప్రసంగిస్తారని ఆయనకు చెప్పారు. ఇది రాజ్ ఠాక్రేకు ఆగ్రహం కలిగించింది. ఈ దాయాదుల మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది'' అని ధావల్ కులకర్ణి పేర్కొన్నారు.
ఆ రోజుల్లో శివసేనలో రాజ్ ఠాక్రే ప్రజాదరణ గల నాయకుడు. కానీ.. ఆయన దుందుడుకు శైలి వల్ల కొన్నిసార్లు కొంతమంది బాధపడ్డారు. కాబట్టి ఉద్ధవ్ ఠాక్రేను ముందుకు తీసుకురావాలని అనుభవజ్ఞులైన కొందరు శివసేన నాయకులు బాల్ ఠాక్రేకు సూచించారు.
మరోవైపు, రమేష్ కీనీ హత్య కేసులో రాజ్ ఠాక్రే పేరు వచ్చింది. దీంతో ఆయనను కొంత కాలం పాటు రాజకీయాల నుంచి పక్కనపెట్టారు.
''రమేష్ కీనీ హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు రాజ్ ఠాక్రే. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లభించలేదు. ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. కానీ ఈ కాలంలో శివసేన సంక్షోభంలో పడిపోయింది. దీనికి రాజ్ ఠాక్రే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కీనీ కేసు కారణంగా రాజకీయ రంగంలో ఆయన ఐదేళ్లు వెనుకబడిపోయారు'' అని జర్నలిస్ట్ దినేష్ దుఖాండే చెప్తారు.
ఈ సందర్భంలో ఉద్ధవ్ ఠాక్రే సాధారణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997 ముంబై మునిసిపల్ ఎన్నికల సందర్భంగా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనటం ప్రారంభించారు. ఆ తర్వాత బాల్ ఠాక్రే.. 2002 ముంబై మునిసిపల్ ఎన్నికల పూర్తి బాధ్యతలను ఉద్ధవ్‌కు అప్పగించారు. ఆ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే మద్దతుదారులకు అభ్యర్థిత్వాలను నిరాకరించారని ఆరోపిస్తుంటారు.
ఆ తర్వాత కూడా రాజ్ ఠాక్రేకు సన్నిహితంగా ఉండే వారిని నిరంతరం పక్కన పెట్టటం, ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవటం కొనసాగింది. ఇక శివసేన తదుపరి నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేయే అవుతారని 2003 జనవరిలో స్పష్టమైపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్ధవ్ ఠాక్రే శకారంభం
2003 జనవరిలో మహాబలిపురంలో శివసేన సదస్సు జరిగింది. సదస్సు చివరి రోజున బాల్ ఠాక్రే పరోక్షంలో, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్ధవ్ ఠాక్రే పేరును రాజ్ ఠాక్రే స్వయంగా ప్రతిపాదించారు. అది.. బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్ధవ్ ఠాక్రే అని అధికారికంగా ప్రకటించటం.
''శివసేన మహాబలిపురం సదస్సులో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీలో తనను ఎదగనివ్వరని నారాయణ్ రాణే తక్షణమే తెలుసుకున్నారు. దీంతో రాణే శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2006లో రాజ్ ఠాక్రే కూడా చీలిపోయి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఏర్పాటు చేశారు'' అని ధావల్ కులకర్ణి పేర్కొన్నారు.
''శివసేన నుంచి ఈ ఇద్దరు నాయకులూ విడిపోయిన తర్వాత.. ముంబయి మునిసిపాలిటీలో అధికారం కాపాడుకోవటానికి, ఎంఎల్ఏలు జారిపోకుండా చూసుకోవటానికి ఉద్ధవ్ ఠాక్రే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఉద్ధవ్ దీనిని విజయవంతంగా అధిగమించారు. పార్టీని కలసికట్టుగా ఉంచగలనని ఆయన చేసి చూపించారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అద్భుతమైన ఆర్గనైజర్.. కానీ...
''పార్టీ మీద ఉద్ధవ్ ఠాక్రే పట్టు గట్టిగానే ఉంది. ఆయన అద్భుతమైన నిర్వాహకుడు. కాబట్టి మోదీ హవా బలంగా వీచిన 2014 ఎన్నికల్లో సైతం ఉద్ధవ్ నాయకత్వంలో శివసేన 63 సీట్లు గెలవగలిగింది'' అని కులకర్ణి ఉటంకించారు.
''పార్టీ వ్యవస్థ మీద ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి పట్టు ఉన్నప్పటికీ, ఆయన రాజకీయ - సామాజిక అవగాహనలో లోతు లేదు. ఆయన ఎప్పుడైనా ఏ అంశాన్నైనా లోతుగా విశ్లేషించినట్లు కనిపించదు. ఆయన ప్రవర్తన పారదర్శకంగా ఉండదు. ఒక అంశం మీద అభిప్రాయం చెప్తూ మీడియాకు ఒక శీర్షిక అందిస్తారు కానీ, కొంచెం తరచి ప్రశ్నిస్తే బలమైన విశ్లేషణ కనిపించదు'' అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ చోర్మారే అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ నాయకుడి తరహా ఇమేజ్
ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం గురించి చెబుతూ ధావల్ కులకర్ణి, ''ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరహాలో ఉంటుంది. అదే తరహాలో 'శివశక్తి - భీంశక్తి'ని ఏర్పాటు చేయటం ద్వారా సంకీర్ణ రాజకీయాల ప్రయోగం చేశారు. 'మి ముంబైకర్' వంటి ఉద్యమాలు ప్రారంభించారు. ఆయన వ్యక్తిత్వం రాజ్ ఠాక్రే లాగా దుందుడుకు వ్యక్తిత్వం కాదు. కానీ రైతుల రుణ మాఫీ, కార్మికుల సమస్యలను ఉద్ధవ్ సమర్థంగా పరిష్కరించారు. వీటిజోలికి శివసేన, ఎంఎన్ఎస్‌లు అంతకుమునుపెన్నడూ వెళ్లలేదు'' అని వివరించారు.
''ఒక నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నడూ సామాన్యుడికి అందుబాటులో ఉండరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల తరహాలోనే ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా కలవాలనుకుంటే ఒక మధ్యవర్తుల మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది'' అని విజయ్ చోర్మారే అన్నారు.
ఇవి కూడా చదవండి
- జార్జి రెడ్డి: కొందరికి అభినవ చేగువేరా, ఇంకొందరికి ఆవేశపరుడు, ఇంతకీ ఆయన కథేంటి?
- శ్రీలంకతో సంబంధాలకు భారత్‌కు ఆతృత ఎందుకు?
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిస్తే తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- విశాఖ, కాకినాడ తీరాల్లో మోహరించిన భారత్, అమెరికా సైనిక బలగాలు
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








