మహారాష్ట్ర: శివసేనతో స్నేహమా, శత్రుత్వమా.. సంకటంలో కాంగ్రెస్

బాల్ ఠాక్రేతో ప్రణబ్ ముఖర్జీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్ ఠాక్రేతో ప్రణబ్ ముఖర్జీ
    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మోదీ ప్రభుత్వంలో శివసేనకు చెందిన ఏకైక మంత్రి అర్వింద్ సావంత్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.

ఎన్డీయే నుంచి బయటకు రావాలనే షరతును అమలు చేసిన తర్వాత తనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమ పార్టీ నేతలకు దక్కుతుందని శివసేన భావిస్తోంది.

అర్వింద్ సావంత్ రాజీనామా తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా తమ వ్యూహాల్లో మునిగిపోయాయి. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సోమవారం రాత్రి 7.30 వరకూ సమయమిచ్చి, ఆ లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖ ఇవ్వాలని శివసేనకు సూచించారు.

ఆ సమయం ముగిసిపోయింది. కానీ కాంగ్రెస్ నుంచి శివసేనకు ఎలాంటి మద్దతు లేఖా అందలేదు. ఉద్ధవ్ ఠాక్రేనే ముఖ్యమంత్రి పదవిని చేపడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమయం ముగిసేవరకూ అంతా కాంగ్రెస్ నుంచి లేఖ కోసం ఎదురుచూశారు, కానీ అది అందలేదు.

దీంతో, గడువును పొడిగించాలని శివసేన పార్టీ గవర్నర్‌ను కోరింది. కానీ దానికి ఆయన నిరాకరించారు. మరో రెండు రోజులు సమయం కావాలని ఆదిత్య ఠాక్రే కోరారు. అప్పటి వరకూ శివసేన నేత సంజయ్ రౌత్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఉన్నట్లుండి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్ధవ్ ఠాక్రే

శివసేనకు అదనపు సమయం నిరాకరించిన గవర్నర్ కోష్యారీ.. ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పరంగా ఎన్సీపీ మూడో అతిపెద్ద పార్టీ. అయితే, రెండో స్థానంలో ఉన్న శివసేనకు, ఎన్సీపీకి సీట్ల మధ్యలో తేడా కేవలం రెండే. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలుంటే, ఎన్సీపీకి 54మంది ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి, ఇది ప్రస్తుతం ఏ పార్టీకీ లేదు.

గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన తర్వాత ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు.

"ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ మాకు ఆహ్వానం పంపారు. మాకు 24 గంటల సమయం ఇచ్చారు. మా మిత్రపక్షం కాంగ్రెస్‌తో ముందు చర్చించాలి. ఆ తర్వాతే మేం ఏ నిర్ణయమైనా తీసుకోగలం. ఒకవేళ ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారు" అని మాలిక్ వ్యాఖ్యానించారు.

"మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పాం. కానీ మాకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరాం" అని అదనపు సమయం ఇవ్వడానికి గవర్నర్ నిరాకరించిన తర్వాత ఆదిత్య ఠాక్రే అన్నారు.

"శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందా, దీనికి సమాధానం ఇవ్వండి అంటూ గవర్నర్ నుంచి మాకు లేఖ అందింది. మేం సిద్ధంగానే ఉన్నాం, కానీ, కాంగ్రెస్, ఎన్సీపీలతో మాట్లాడేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరాం. అయితే గవర్నర్ దానికి అంగీకరించలేదు. ఏమైనప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు మా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇంతకు మించి ప్రస్తుతం ఏమీ చెప్పలేను" అని ఆదిత్య తెలిపారు.

దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే

రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న శివసేన, ఎలాగైనా బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలన్న ఎన్సీపీ-కాంగ్రెస్‌ల బలమైన కోరిక ముందు వాటి మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు పక్కకు తొలగిపోయాయనిపించింది. కానీ చివరి క్షణంలో కాంగ్రెస్ నుంచి శివసేనకు ఆశించిన మద్దతు దక్కలేదు.

దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. కానీ శివసేనకు బయటి నుంచి మద్దతు ఇవ్వాలా లేక ప్రభుత్వంలో చేరాలా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఒకవేళ మూడు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాటి మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలకు కూడా తక్కువ సమయంలోనే ముగింపు పలకాల్సి ఉంది.

వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. "మహారాష్ట్ర అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. సోనియా గాంధీ ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో మాట్లాడారు. ఎన్సీపీతో మరిన్ని అంశాలు చర్చించాల్సి ఉంది" అని అందులో పేర్కొంది.

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ల మధ్య కూడా చర్చలు నడిచాయి. కానీ కాంగ్రెస్ తాము మద్దతు ఇచ్చే విషయంపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

ఎలాగైనా సీఎం కుర్చీని అధిరోహించాలనే శివసేన కోరిక తీరే అవకాశాలు ఇంకా ముగిసిపోలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతిస్తే ఇప్పటికీ శివసేన అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలున్నాయి. అయితే, మద్దతు బయటి నుంచి ఇవ్వాలా లేక ప్రభుత్వంలో చేరాలా అనే దానిపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ తమ ప్రభుత్వంలో భాగం కావాలని శివసేన కోరుకుంటోంది. శరద్ పవార్ పార్టీ ఇప్పటికే మద్దతు లేఖ ఇచ్చింది.

ఆదిత్య ఠాక్రే

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఆదిత్య ఠాక్రే

శివసేన, కాంగ్రెస్‌ల మధ్య ఏం జరుగుతోంది?

శివసేన, కాంగ్రెస్.. రెండూ కలసి ఎప్పుడూ అధికారంలో లేవు. కానీ అనేక అంశాల్లో రెండు పార్టీలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి మద్దతునిచ్చిన కొన్ని పార్టీల్లో శివసేన ఒకటి. జాతి ప్రయోజనాల కోసమే అత్యవసర పరిస్థితిని విధించారని అప్పట్లో బాల్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కనీస మెజరీటీ దక్కలేదు. ఆ తర్వాత, మురళీ దేవ్‌రా మేయర్ కావడానికి మద్దతునివ్వాలని బాల్ ఠాక్రే నిర్ణయించారు.

1980లో కాంగ్రెస్‌కు మరోసారి శివసేన నుంచి మద్దతు లభించింది. బాల్ ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేత అబ్దుల్ రహ్మాన్ అంతూలేల మధ్య మంచి సంబంధాలుండేవి. అంతూలే ముఖ్యమంత్రి కావడానికి ఠాక్రే సాయపడ్డారు.

1980వ దశకంలో బీజేపీ, శివసేనల మధ్య స్నేహం పెరగినా.. రెండూ ఒకతాటిపైకి వచ్చిన తర్వాత కూడా బాల్ ఠాక్రే బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఆ తర్వాత 2007లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచిన ప్రతిభా పాటిల్‌కు శివసేన మద్దతునిచ్చింది. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు.

ప్రతిభా పాటిల్ కేవలం మహారాష్ట్రకు చెందినవారనే కారణంగానే శివసేన ఆమకు మద్దతు పలికింది. ఐదేళ్ల తర్వాత మరోసారి శివసేన... కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఓటేసింది. శరద్ పవార్ ప్రధాని అయితే తాము మద్దతిస్తామని కూడా బాల్ ఠాక్రే ఓసారి ప్రకటించారు.

శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఇకపై కలిసి పోటీ చేస్తాయా?

కాంగ్రెస్, శివసేనల మధ్య ప్రస్తుతం అంటీముట్టనట్లు ఉండే పరిస్థితేమీ లేదు. శివసేనకు మద్దతిస్తే ముస్లింల సంగతేంటి అనే ప్రశ్నలు కాంగ్రెస్‌కు తలెత్తే అవకాశముంది. కానీ, కాంగ్రెస్ మాత్రం శివసేన మద్దతు తీసుకుంటోంది. అయితే, బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ వాదించొచ్చు.

మహారాష్ట్రలో ఇకపై జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేనలు కలిసి పోటీచేస్తాయా? అదే జరిగితే, శివసేనకున్న హిందుత్వ పార్టీ అనే ముద్ర ఏమవుతుంది? కాంగ్రెస్‌తో జతకట్టి కూడా అతివాద హిందుత్వ పార్టీగా శివసేన మనుగడ సాగించగలదా? లేదా హిందుత్వ పార్టీ అయిన శివసేనతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తన లౌకికవాద పార్టీ ముద్రను కాపాడుకోగలదా?

శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే

శివసేనతో కలికి ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే, కాంగ్రెస్ అధిష్ఠానం తన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. శరద్ పవార్, సోనియా గాంధీ.. ఇద్దరూ సోమవారం నాడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు.

ఒకవేళ మూడు పార్టీలు చేతులు కలిపితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభిస్తుంది. అదే జరిగితే, 105 మంది ఎమ్మెల్యేలతో, సంఖ్య పరంగా అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుంది.

ఎన్నికల ఫలితాలు వెల్లడై 18 రోజులైంది. కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. శివసేన-బీజేపీల మధ్య ఎన్నికల ముందు పొత్తు ఉంది. కానీ, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. రెండున్నర సంవత్సరాల పాటు తమ పార్టీకి కూడా సీఎం పీఠం ఇచ్చేలా ఉంటే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన అంగీకరించింది. కానీ బీజేపీ దీనికి సిద్ధంగా లేదు.

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

శివసేనకు ఇంకా అవకాశాలున్నాయా?

తమ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలనే కోరికను నెరవేర్చుకోవడానికి బీజేపీతో ఉన్న 25 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. జమ్మూ, కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మెహబూబా ముఫ్తీతో చేతులు కలిపినప్పుడు తాము మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీలతో ఎందుకు జట్టుకట్టకూడదు అని శివసేన వాదిస్తోంది.

మా పార్టీ, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను రాజ్ భవన్ తిరస్కరించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే అన్నారు. "ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఎన్నో అంశాలను చర్చించాల్సి ఉంది. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మేము ఇప్పటికీ ఆశిస్తున్నాం" అని పాండే టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మహారాష్ట్రలోని ప్రతిపక్షాలకు బీజేపీరహిత ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. "ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు వృధా చేసుకుంటే ఇక వారికి ఎవరూ సాయం చేయలేరు. కాంగ్రెస్, ఎన్సీపీల తీరుతో శివసేన సంతృప్తిగా లేదు. అయితే, రాత్రి శరద్ పవార్ నుంచి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుపై హామీ లభించింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజలంతా ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. రాజకీయ అధికార క్రీడలో ప్రస్తుతం బీజేపీని ఎదుర్కోవడం ఎవరికైనా అంత సులభం కాదు. దీనికి పక్కా ప్రణాళిక అవసరం" అని మహారాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలించే జర్నలిస్టు నిఖిల్ వాగ్లే ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరో ట్వీట్‌లో, "అధికార పంపిణీపై తాము శివసేనతో మాట్లాడాలని కాంగ్రెస్, ఎన్సీపీ ఇప్పుడంటున్నాయి. ఈ పని గవర్నర్‌కు మద్దతు లేఖ ఇచ్చి కూడా చేయొచ్చు. ఇందులో ఏదో మతలబు ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఇవ్వడంలో మహారాష్ట్ర గవర్నర్ బీజేపీతో ఒకలా, ఇతర పార్టీలతో ఒకలా వ్యవహరించారు. బీజేపీకి 72 గంటల సమయం ఇవ్వగా, శివసేన, ఎన్సీపీలకు కేవలం 24 గంటలే ఇచ్చారు. అయితే, గవర్నర్ నుంచి పారదర్శకతను ఆశించడం అర్థం లేనిది" అని వాగ్లే అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)