తన ప్రేయసైన మాజీ విద్యార్థినిని చంపేసిన రష్యా చరిత్రకారుడు

ఫొటో సోర్స్, EPA
రష్యాలో ప్రముఖ చరిత్రకారుడు ఒలెగ్ సొకొలోవ్ తన ప్రేయసి అయిన మాజీ విద్యార్థినిని హత్య చేశారు. సొకలోవ్ నేరాన్ని అంగీకరించారని ఆయన న్యాయవాదులు వెల్లడించారు.
ఆమె శరీరభాగాలను కనిపించకుండా చేసే ప్రయత్నంలో ప్రొఫెసర్ సొకొలోవ్ ఓ నదిలో పడిపోయారని, అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. నదిలో సొకొలోవ్ వద్దనున్న బ్యాక్‌ప్యాక్‌లో ఆమె చేతులు ఉన్నాయి.
సొకొలోవ్ వయసు 63 ఏళ్లు. హత్యకు గురైన ఆయన ప్రేయసి అనస్టేసియా యెష్‌చెంకో వయసు 24 ఏళ్లు.
సొకొలోవ్ ఇంట్లో తలలేని అనస్టేసియా శరీరాన్ని పోలీసులు గుర్తించారు.
నేరాన్ని అంగీకరించిన సొకొలోవ్, అనస్టేసియా హత్యపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని, ప్రస్తుతం విచారణకు సహకరిస్తున్నారని ఆయన న్యాయవాది అలెగ్జాండర్ పొచుయేవ్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.
తమ ఇద్దరి మధ్య వాదన జరిగిందని, అప్పుడు ఆమెను హత్య చేశానని, తర్వాత ఆమె తల, చేతులు, కాళ్లు వేరుచేశానని ప్రొఫెసర్ సొకొలోవ్ పోలీసులకు తెలిపారని సమాచారం. అనస్టేసియా శరీర భాగాలను కనిపించకుండా చేసి, ఆ తర్వాత నెపోలియన్ వస్త్రధారణలో బహిరంగంగా ఆత్మహత్య చేసుకొందామని తాను అనుకొన్నట్లు చెప్పారు.
'హైపోథెర్మియా' అనే ఆరోగ్య సమస్యకు పొచుయేవ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారని, ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుండొచ్చని న్యాయవాది పొచుయేవ్ అభిప్రాయపడ్డారు.
శరీరంలో వేడి పుట్టేదాని కన్నా వేగంగా శరీరం వేడిని కోల్పోయే సమస్యను 'హైపోథెర్మియా' అంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరస్థాయికి పడిపోతుంది. అప్పుడు గుండె, నాడీవ్యవస్థ, ఇతర కీలక అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

ఫొటో సోర్స్, DEA PICTURE LIBRARY/GETTY Images
ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ బోనపార్టేపై పరిశోధనల్లో పేరుగాంచిన సొకొలోవ్ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం 'లీజన్ ఆఫ్ ఆనర్' గ్రహీత.
నెపోలియన్‌పై సొకొలోవ్ అనేక పుస్తకాలు రాశారు. పలు సినిమాలకు చరిత్ర విషయంలో సలహాదారుగా సేవలందించారు. సొకొలోవ్, అనస్టేసియా ఇద్దరూ కలిసి కూడా పుస్తకాలు రాశారు.
వీరిద్దరూ ఫ్రెంచ్ చరిత్రను అధ్యయనం చేశారు. చారిత్రక శైలిలో దుస్తులు ధరించడం వీరికి ఎంతో ఇష్టం. సొకొలోవ్‌కు నెపోలియన్‌లా బట్టలు వేసుకోవడం ఇష్టం.
నెపోలియన్ ప్రభావం సొకొలోవ్‌పై చాలా ఉందని, అనస్టేసియాను ఆయన 'జోసెఫిన్' అని పిలిచేవారని ఆయన విద్యార్థులను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. జోసెఫిన్- నెపోలియన్ మొదటి భార్య పేరు.
సొకొలోవ్ 'ఫ్రాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ఎకనామిక్స్, పాలిటిక్స్' సభ్యుడు కూడా. అనస్టేసియాను సొకొలోవ్ హత్య చేసిన నేపథ్యంలో సంస్థలో సైంటిఫిక్ కమిటీ నుంచి ఆయన్ను తప్పించినట్లు సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సొకొలోవ్ ఇంత దారుణానికి పాల్పడతారని తాము ఎన్నడూ అనుకోలేదంటూ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు
- అయోధ్య తీర్పు: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు ఇప్పుడు ఏమవుతాయి...
- కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
- పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు యూఎన్‌కు స్పష్టం చేసిన అమెరికా
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








