అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది.
రామ్ లల్లా, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్ ఈ అప్పీళ్లను దాఖలు చేశాయి. తీర్పు పాఠాన్ని జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు.
సుప్రీంకోర్టు తీర్పులోని ఐదు ముఖ్యాంశాలు...
1. ఈ 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. ఇదంతా ఒకే భూభాగం. ఇది రామ్ లల్లాకు చెందుతుంది. ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి. తీర్పు అమలుకు ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ప్రణాళికను రూపొందించాలి.

ఫొటో సోర్స్, Getty Images
2. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు. మసీదు నిర్మాణానికి ముందు అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేశారా, లేదా అన్నది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్పష్టం చేయలేదు. బాబ్రీ మసీదు కట్టడానికి ముందు అక్కడున్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని అక్కడి శిథిలాలకు సంబంధించి ఏఎస్‌ఐ ఇచ్చిన నివేదికలోని ఆధారాలు చెబుతున్నాయి. ఈ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు.
3. అన్ని ఆధారాలను పరిశీలించి, ఈ భూమిని రాముడి ఆలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలి.

ఫొటో సోర్స్, Getty Images
4. ఈ 2.77 ఎకరాల స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఈ 2.77 ఎకరాల భూమిని ఈ ట్రస్టుకే అప్పగిస్తాం.
5. బాబ్రీ మసీదు కూల్చివేత (1992) చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








