అయోధ్య కేసు: మా మధ్య ఎలాంటి అంగీకారం కుదరలేదన్న ముగ్గురు పిటిషనర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్న 'బాబ్రీ మసీదు - రామజన్మభూమి' వివాదంలోని మూడు ప్రధాన పార్టీలు - నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్‌లాలా విరాజమాన్ (హిందూ మహా సభ) ఓ అంగీకారానికి వచ్చాయనే వార్తలను అవి ఖండించాయి.
ఈ అంశంపై మధ్యవర్తిత్వం చేయడానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేసు విచారణ చివరి రోజైన అక్టోబర్ 16న ఆ కమిటీ తన నివేదికను... విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించింది.
మూడు ప్రధాన పార్టీల్లో కొన్నింటి మధ్య అంగీకారం కుదిరిందంటూ భారత్‌లోని ఓ వర్గం మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. కానీ, ఇది అవాస్తవం అని మూడు ప్రధాన పార్టీలు ఆ కథనాలను ఖండించాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మోహి అఖాడా ఏమంటోంది?
అయోధ్యలోని వివాదాస్పద భూభాగం తమదేనంటున్న మూడు పార్టీల్లో ఒకటైన నిర్మోహి అఖాడా బీబీసీతో మాట్లాడింది. మాకు, ఇతర పక్షాల అంగీకారం లేకుండా ఒప్పందం సాధ్యం కాదు.
ఈ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశామని నిర్మోహి అఖాడాకు చెందిన కార్తీక్ చోప్రా తెలిపారు.
"హిందూ మహాసభను మేం అసలు పిటిషనర్‌గానే పరిగణించం. నేరుగా ముస్లిం పక్షాలతోనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే, ఇదంతా కోర్టులో, న్యాయమూర్తుల సమక్షంలో జరగాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Thinkstock
కోర్టు బయట పరిష్కారం కష్టం
మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో తాము భాగస్వామ్యం కాలేదని హిందూ మహాసభకు మద్దతిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వ్యాఖ్యానించింది.
"మార్చి నుంచి ఆగస్టు మధ్యలో జరిగిన మొదటి ప్రయత్నం నుంచి మాకు అర్థమైంది... ఈ కేసులో కోర్టు బయట పరిష్కారం కష్టం. ఇదే విషయం మేం కోర్టుకు తెలిపాం" అని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు.
అదే సమయంలో, మరో ప్రధాన పక్షం సున్నీ వక్ఫ్ బోర్డు కూడా ఈ విషయంలో ఒప్పందం కుదిరిందనడాన్ని ఖండించింది.
మధ్యవర్తిత్వ ప్రక్రియను తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది కోర్టులోనే జరగాలని సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన ఇక్బాల్ అన్సారీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కమిటీని ఏర్పాటు చేసిన కోర్టు
2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 11న ఆ కమిటీ తన పని ప్రారంభించింది. ఆగస్టు 1న నివేదిక సమర్పించింది. కానీ, ఈ ప్రయత్నం విఫలమైందని తేలింది.
ఆ తర్వాత, మరోసారి మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించాలని కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును కోరాయి. మధ్యవర్తిత్వ ప్రక్రియ మొదలుపెట్టొచ్చు కానీ విచారణ కొనసాగుతుందని కోర్టు తెలిపింది.
మీడియా కథనాల ప్రకారం, కమిటీ తన రెండో రౌండ్ మధ్యవర్తిత్వ ప్రక్రియకు సంబంధించిన నివేదికను కోర్టుకు బుధవారం సమర్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటనేది ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. కానీ, ఈ కేసులో భాగమైన మూడు పక్షాలూ ఈ ప్రక్రియలో భాగం కావడానికి తిరస్కరించాయనేది మాత్రం స్పష్టం.
మూడు పక్షాల్లో ఒకటైన నిర్మోహి అఖాడా 1959లో కోర్టు గడప తొక్కింది. 1961లో సున్నీ వక్ఫ్ బోర్డు, 1989లో రామ్‌లాలా విరాజమాన్ కోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై 2010లో అలహాబాద్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ముగ్గురు పిటిషనర్లకూ పంచాలని తీర్పునిచ్చింది. అనంతరం ఆ తీర్పును ముగ్గురూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘బాబ్రీ వద్ద హిందువులను ఆలయాన్ని కట్టుకోనివ్వండి’
- రామమందిర నిర్మాణంపై విచారణ వాయిదాతో బీజేపీకి లాభమా, నష్టమా?
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








