స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు.. అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు

ఫొటో సోర్స్, Mebiol
జపాన్ శాస్త్రవేత్త యూచి మోరీ పండ్లు, కూరగాయల తోటలను భూమిలో సాగు చేయడంలేదు. ఆయన చేస్తున్న వ్యవసాయానికి మట్టి అవసరమే లేదు.
మట్టికి బదులుగా, మనుషుల మూత్రపిండాల చికిత్స కోసం రూపొందించిన పాలిమర్ (పాదర్శకమైన, సూక్ష్మ రంధ్రాలు ఉండే పాలిమర్ ఫిల్మ్. దానిని మూత్ర పిండాలలో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు) పదార్థాన్ని వాడుతున్నారు.
ఆ పాలిమర్ మీదే మొక్కలు పెరుగుతాయి. నీటిని, పోషకాలను నిల్వ చేసి, మొక్కలకు అందించేందుకు ఆ ఫిల్మ్ ఉపయోగపడుతుంది.
ఈ సాంకేతికతతో ఎలాంటి వాతావరణంలోనైనా కూరగాయలు సాగు చేయడంతో పాటు, సంప్రదాయ వ్యవసాయం కంటే 90% తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చు. మెరుగైన దిగుబడులు సాధించవచ్చునని ఈ శాస్త్రవేత్త చెబుతున్నారు.
పురుగు మందులను కూడా చాలా సులువుగా మొక్కలకు అందించే వీలుంటుంది. అంతేకాదు, స్వయంగా ఈ పాలిమర్ బ్యాక్టీరియాను, వైరస్‌లను కూడా నిరోధిస్తుంది.
కూలీల కొరత, పరిమిత సాగు భూమి ఉన్న జపాన్ వ్యవసాయ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
మూత్ర పిండాల డయాలిసిస్‌లో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వాడే పాలిమర్ పదార్థాన్ని ఈ వ్యవసాయంలో వినియోగిస్తున్నామని శాస్త్రవేత్త యూచీ మోరీ బీబీసీతో చెప్పారు.
దాదాపు 120 దేశాలలో రిజిస్టరైన ఈ వినూత్న ఆవిష్కరణకు ఆయన సంస్థ మెబియోల్ పేటెంట్ హక్కులు కూడా తీసుకుంది.
జపాన్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో సాగు భూములను టెక్నాలజీ కేంద్రాలుగా ఎలా మార్చేస్తున్నారో ఇది చూస్తే అర్థమవుతుంది.
పంటల పర్యవేక్షణ, నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంచడంలో వ్యవసాయ సాంకేతికత సమీప భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది.
పర్యావరణ క్షీణత, నీటి వనరుల అభివృద్ధి ప్రస్తుత స్థాయిలో కొనసాగితే 2050 నాటికి పంటల దిగుబడులు 40 శాతం, జీఎస్‌డీపీ (గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) 45 శాతం తగ్గిపోతాయని నీటి వనరుల అభివృద్ధి మీద ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది.
యూచీ మోరీ అనుసరిస్తున్న సాంకేతిక సాగు విధానాలు జపాన్‌లోని 150 ప్రాంతాలతో పాటు, యూఏఈ లాంటి మరికొన్ని దేశాల్లోనూ ఇప్పటికే అమలవుతున్నాయి.
ముఖ్యంగా సునామీ, భారీ భూకంపాలు, 2011లో సంభవించిన అణుప్రమాదాల కారణంగా వ్యవసాయ భూములు నిస్సారంగా మారిన ఈశాన్య జపాన్‌లో ఈ విధానం ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది.

ఫొటో సోర్స్, Mebiol
రోబో ట్రాక్టర్
2050 నాటికి ప్రపంచ జనాభా 7.7 బిలియన్ల నుంచి 9.8 బిలియన్లకు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయి. దాంతో, ఆహార పదార్థాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ డిమాండ్‌ను వ్యాపార అవకాశంగా మార్చుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. మార్కెట్‌లో యాంత్రాలకు కూడా భారీగా డిమాండ్ పెరిగే వీలుంటుంది.
ప్రస్తుతం విత్తనాలు వేయడం నుంచి పంటల కోత వరకు వివిధ పంటల్లో రైతులకు ఉపయోగపడే 20 రకాల రోబోల అభివృద్ధికి జపాన్ ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది.
హొక్కాయిడో విశ్వవిద్యాలయం నిపుణులతో కలిసి, యన్మార్ అనే ఇంజిన్ తయారీ సంస్థ ఒక రోబో ట్రాక్టర్‌ను రూపొందించింది. దానిని ఇప్పటికే పంట పొలాల్లో పరీక్షించారు.
సెన్సర్ల సాయంతో ఈ ట్రాక్టర్లు పనిచేస్తాయి. ముందు, వెనుక ఏమున్నాయి? ఏవైనా అడ్డుంకులు ఉన్నాయా? అన్న విషయాలను ఆ సెన్సర్ల ద్వారా ఈ స్మార్ట్ ట్రాక్టర్లు గుర్తిస్తాయి. ఒకే డ్రైవర్ ఏకకాలంలో రెండు ట్రాక్టర్లను నడపొచ్చు.
జీపీఎస్, వైఫై ఫీచర్లతో, సౌర విద్యుత్‌తో నడిచే రోబోను వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఈ ఏడాది మొదట్లో ఆవిష్కరించింది.

ఫొటో సోర్స్, Yanmar
తక్కువ మనుషులతో సాగు
టెక్నాలజీ రంగంలో పట్టు ఉండి, వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్న యువతను జపాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
రోజురోజుకీ శ్రామిక శక్తి తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఆర్థికరంగం మీద పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది.
గడచిన దశాబ్ద కాలంలో, జపాన్ వ్యవసాయ రంగంలో పనిచేసే వారి సంఖ్య 22 లక్షల నుంచి 17 లక్షలకు తగ్గిపోయింది.
ఈ సమస్య ఎంతగా ఉందంటే, ప్రస్తుతం ఇక్కడి శ్రామికుల సగటు వయసు 67 ఏళ్లు. చాలామంది రైతులు రోజూ కొద్ది సమయాన్ని మాత్రమే వ్యవసాయానికి కేటాయిస్తున్నారు.
కేవలం 40 శాతం దేశ ఆహార అవసరాలను మాత్రమే స్థానిక వ్యవసాయం తీరుస్తోంది.
జపాన్‌లో 85 శాతం పర్వత ప్రాంత భూములే. మిగిలిన వ్యవసాయ యోగ్యమైన భూముల్లో అధిక భాగం వరి సాగుకే పరిమితమైంది.
జపాన్ వాసులకు వరి ప్రధాన ఆహారంగా ఉంది. రెండున్న ఎకరాల చిన్న కమతాలలో వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్లతో పిచికారీ
కొన్ని దశాబ్దాలుగా జపాన్‌లో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.
వార్షిక తలసరి బియ్యం వినియోగం భారీగా తగ్గింది. 1962లో తలసరి బియ్యం వినియోగం 118 కిలోలు ఉండగా, 2006 నాటికి అది 60 కిలోలకు తగ్గింది. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వస్తుండటంతో, ఇక్కడి రైతులు క్రమంగా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
అధునాతన సాంకేతికతతో పాటు, దిగుబడులను పెంచే బయో టెక్నాలజీ వినియోగం కూడా శరవేగంగా పెరుగుతోంది.
కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. పంట చేలపై పురుగు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దాంతో, మనిషి రోజంతా చేసే పనిని గంట, అరగంటలోనే పూర్తవుతోంది.

ఫొటో సోర్స్, Reuters
భూమి లేకుండానే కొందరు వ్యవసాయం చేసేందుకు కూడా అధునాత టెక్నాలజీ దోహదపడుతోంది.
గ్రీన్‌హౌజ్‌లలో పండించడంతో పాటు, హైడ్రోపోనిక్స్ (ఇందులో మట్టి లేకుండానే నీటి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తారు) ద్వారా జపాన్‌లో పండ్లు, కూరగాయలను భారీగా పండిస్తున్నారు.
ఈ విధానం ద్వారా చిబా ప్రాంతంలో మిరాయీ గ్రూప్, ప్రస్తుతం రోజూ 10,000 కట్టల పాలకూరను పండిస్తోంది. సంప్రదాయ సాగు విధానంతో పోల్చితే, వంద రెట్లు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ షెడ్లలో సెన్సర్లు ఉంటాయి. ఆ సెన్సర్ల ద్వారా వాటిలో కృత్రిమ వెలుతురును, ద్రవరూప పోషకాలను, కార్బన్‌డయాక్సైడ్ స్థాయిని, ఉష్ణోగ్రతను నియంత్రిస్తారు.
కృత్రిమ వెలుతురు మొక్కలు అత్యంత వేగంగా పెరిగేలా చేస్తుంది. చీడపీడలను సులువుగా నివారించవచ్చు.
ఇలాంటి పరిశ్రమల సంఖ్య గత దశాబ్ద కాలంలో జపాన్‌లో మూడు రెట్లు పెరిగింది.
హైడ్రోపోనిక్స్ మార్కెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ డాలర్లు ఉంది. 2023 నాటికి అది నాలుగు రెట్లు పెరిగి 6.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ అలైడ్ మార్కెట్ రీసెర్చ్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Mebiol
టెక్నాలజీ బదిలీ
2030 నాటికి ఆఫ్రికన్ దేశాలలో వార్షిక బియ్యం ఉత్పత్తిని రెట్టింపు చేసి 50 మిలియన్ టన్నులకు పెంచేందుకు సాయం చేస్తామని జపాన్ హామీ ఇచ్చింది. అందుకోసం ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
ఉదాహరణకు, సెనెగల్‌లో వ్యవసాయ సాంకేతికతపై స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు అక్కడ జపనీయులు భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఫలితంగా అక్కడ వరి దిగుబడి 20 శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా ఖండం వ్యాప్తంగా ప్రైవేటు పెట్టబడులను ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ యాంత్రీకరణలో వ్యాపారాన్ని విస్తరించాలన్నది జపాన్ వ్యూహం.
వియత్నాం, మయన్మార్, బ్రెజిల్ దేశాలతోనూ జపాన్ కొన్ని ఒప్పందాలు చేసుకుంది.
అయితే, వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, వినియోగానికి జపాన్ ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం తన సొంత ఆహార అవసరాలను తీర్చడం, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిచడమే.
టెక్నాలజీ సాయంతో దిగుబడులను పెంచడం ద్వారా, 2050 నాటికి దేశీయ ఆహార అవసరాలలో కనీసం 55 శాతమైనా సొంతంగా తీర్చగలగాలని జపాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ: పి.సాయినాథ్
- 5జీ టెక్నాలజీతో విమానాల భద్రతకు, సైనిక చర్యలకు పొంచి ఉన్న ప్రమాదమేంటి..
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయండి
- 'మా పంటలు పోయినట్టే... ఇంకా ఇక్కన్నే ఉంటే మనుషులం కూడా పోయేట్టున్నాం'
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
- తెలంగాణలో రైతులకు యూరియా కొరత ఎందుకొచ్చింది? ప్రత్యామ్నాయాలు ఏమిటి?
- చైనా, తైవాన్‌ల మధ్య ‘వికీపీడియా’ యుద్ధం
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఆదివాసీలు
- వీళ్లు స్మార్ట్ రైతులు.. యాప్స్‌తో లాభాలు పండిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








