చైనా, తైవాన్‌ల మధ్య ‘వికీపీడియా’ యుద్ధం

వికీపీడియా గ్రాఫిక్స్
    • రచయిత, కార్ల్ మిల్లర్
    • హోదా, బీబీసీ క్లిక్

''వాట్ ఈజ్ తైవాన్?'' అని గూగుల్‌ని కానీ సిరిని కానీ అడగండి.

''తూర్పు ఆసియాలో ఒక దేశం'' అని చెప్తాయి.

కానీ.. సెప్టెంబర్ నెలలో అయితే ''పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక రాష్ట్రం'' అని జవాబు ఇచ్చి ఉండేవి.

సాధారణ వాస్తవాల గురించిన ప్రశ్నలకు చాలా సెర్చ్ ఇంజన్లు, డిజిటల్ అసిస్టెంట్లు, ఫోన్లు అన్నీ ఒక చోటుకే తీసుకెళతాయి: వికీపీడియా.

మరి ఈ వికీపీడియా అకస్మాత్తుగా మారిపోయింది.

ఒకసారి ఎడిట్ అవుతుంది. అది మళ్లీ రివర్స్ అవుతుంది. మళ్లీ ఎడిట్ అవుతుంది. మళ్లీ మళ్లీ ఎడిట్ అవుతూ ఉంటుంది. ఇదో బలప్రదర్శనగా మారింది. వికీపీడియాకు సంబంధించినంతవరకూ తైవాన్ దేశం ఒక్క రోజులోనే.. ఒకసారి మనుగడలో ఉండటం, మరుక్షణంలో మాయమవటం పదే పదే జరుగుతూ వచ్చింది.

''ఈ సంవత్సరం చాలా పిచ్చెక్కించింది'' అంటారు వికీమీడియా తైవాన్ బోర్డు సభ్యుడు జేమీ లిన్.

''తైవాన్‌కు చెందిన వికీపీడియన్లు చాలా మంది దాడులకు గురయ్యారు'' అని పేర్కొన్నారు.

ఎడిటింగ్ యుద్ధాలు

వికీపీడియా అనేది వెబ్‌సైట్ మాత్రమే కాదు.. ఒక ఉద్యమం కూడా.

వికీపీడియా ఎంట్రీల్లో ఎవరైనా రాయవచ్చు. ఎడిట్ చేయవచ్చు. మానవ విజ్ఞానాన్ని చేర్చికూర్చిన అతి పెద్ద భండాగారం. ఇది అందరికీ ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. డిజిటల్ యుగంలో ఇది అతిపెద్ద విజయం అనవచ్చు.

కానీ.. లిన్, ఆమె సహచరుల దృష్టిలో ఇది ఇప్పుడు దాడికి గురవుతోంది.

వికీపీడియాలో విస్తారంగా బహుళ భాషల్లో ఉన్న ఎంట్రీల్లో జరుగుతున్న ఎడిటింగ్ యుద్ధాల్లో తైవాన్ అంశం ఒకటి మాత్రమే.

హాంగ్ కాంగ్ నిరసనల పేజీలో ఒక్క రోజులోనే 65 మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అందులో ఉపయోగించిన భాష గురించి: వాళ్లు నిరసనకారులా? అల్లరిమూకలా? అనే అంశం గురించి.

సెన్కాకు దీవులకు సంబంధించి ఇంగ్లిష్ ఎంట్రీ.. అవి 'తూర్పు ఆసియాలోని దీవులు' అని చెప్తోంది. కానీ.. ఇదే అంశంపై మాండారిన్ భాషలో ఉన్న ఎంట్రీలో ఈ ఏడాది ఆరంభంలో దీనిని 'చైనా అంతర్గత భూభాగం' అని మార్చారు.

1989 తియానాన్మెన్ స్క్వేర్ నిరసనలను మండారిన్ భాషలో ఉన్న పేజీలో.. 'విప్లవ ప్రతీఘాత అల్లర్లను అణచివేయటానికి' జరిగిన 'జూన్ 4వ తేదీ సంఘటన'గా వర్ణిస్తూ మార్చేశారు.

ఇంగ్లిష్ పేజీలో దలైలామాను టిబెట్‌కు చెందిన శరణార్థిగా చెప్తే.. మండారిన్ పేజీలో ఆయనను చైనా నుంచి పరారైన వ్యక్తిగా అభివర్ణించారు.

వికీపీడియాలో ఆగ్రహపూరిత భేదాభిప్రాయాలు నిరంతరం కొనసాగుతుంటాయి. కానీ.. తైవాన్ విషయంలో మాత్రం ఇది భిన్నమైన అంశమని లిన్ అంటారు.

''చైనా ప్రభుత్వం దీనిని నియంత్రిస్తోంది. అది చాలా భయానకం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

జామై లిన్
ఫొటో క్యాప్షన్, జామీ లిన్ (ఎడమ వైపు ఉన్న మహిళ) తైవానీస్ వికీపీడియన్లలో ఒకరు. ఆమె వికీపీడియాలోని వివిధ పేజీలను సవరిస్తుంటారు

''సామ్యవాద విలువలు''

రాజకీయంగా సున్నితమైన 22 వ్యాసాల్లో.. ఒక నిర్దిష్ట దృక్కోణాన్ని ప్రొమోట్ చేసే విధంగా దాదాపు 1,600 మార్పులు జరిగాయని బీబీసీ క్లిక్ పరిశోధన గుర్తించింది.

ఈ మార్పులన్నిటినీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కానీ.. అది మరింత విస్తృతంగా జరుగుతున్న విధానమా అనేది కానీ మేం తనిఖీ చేయలేం. అయితే.. అవన్నీ సహజమైనవని కానీ, యథాలాపంగా జరిగినవని కానీ కాదని చెప్పే సూచనలున్నాయి.

వికీపీడియా వ్యాప్తంగా 'చైనాకు వ్యతిరేకంగా వివక్షాపూరితంగా' ఉన్నాయని తాను భావిస్తున్న అంశాలను ఒక పద్ధతి ప్రకారం సరిచేయాలంటూ అధికారులు, విద్యావేత్తలు.. ఇటు ప్రభుత్వానికి, అటు పౌరులకు పిలుపినివ్వటం మొదలైంది.

'వికీపీడియాలోని చైనా విదేశీ సమాచార సంబంధాలలో అవకాశాలు, సవాళ్లు' అనే పేరుతో ఒక పరిశోధన వ్యాసాన్ని ఈ ఏడాది జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రచురించారు.

విదేశీ మీడియా ప్రభావం వల్ల వికీపీడియా ఎంట్రీల్లో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివక్షాపూరిత పదాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని విద్యావేత్తలు లి-హావో గాన్, బిన్-టింగ్ వెంగ్‌లు ఆ పత్రంలో వాదించారు.

''విదేశీ సమాచార సంబంధాల చర్చా వ్యవస్థలను పునర్నిర్మించటానికి, వికీ వేదిక మీద ప్రభావవంతమైన సంపాదకులను రూపొందించటానికి ఒక లక్ష్యిత విదేశీ సమాచార వ్యూహాన్ని మనం అభివృద్ధి చేసితీరాలి'' అని వారు సూచించారు.

''సోషలిస్టు విలువలకు కట్టుబడి ఉంటూ, కీలకమైన సంపాదక బృందాలుగా ఏర్పడే విధంగా.. వికీపీడియా వేదిక మీద అభిప్రాయ సారథులుగా, నిర్వాహకులుగా తయారయ్యేలా చైనీస్ నెటిజన్లను ప్రోత్సహించటం, శిక్షణనందించటం తక్షణ అవసరం'' అని కూడా వారు పిలుపునిచ్చారు.

హాంకాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

మారుతున్న దృక్కోణాలు

చైనా కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉండే చైనా ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ గ్రూప్‌కు చెందిన జీ డింగ్ అనే అధికారి రాసిన మరొక వ్యాసంలో.. ''వికీపీడియాలో చైనా ప్రధాన రాజకీయ చర్చలకు సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధీకరించటం, నిర్వహించటం జరగటంలేదు'' అని పేర్కొన్నారు.

''ఇతర దేశాల మీద, చరిత్ర మీద చైనా మార్గం, చైనా ఆలోచనల ప్రభావం నిష్పక్షపాతంగా, వాస్తవికంగా ప్రతిబింబించే విధంగా ఆయా అంశాల్లో మన స్వరాలు, అభిప్రాయాలు ప్రతిఫలించాల్సిన అవసరం ఉంది'' అని కూడా వాదించారు.

''చైనా తరఫు వాదన చెప్పటమనే అంశం గత రెండేళ్లలో విపరీతంగా ఊపందుకుంది. చైనా గురించి విదేశాల్లో ప్రజలకు ఉన్న చాలా అభిప్రాయాలు అపార్థాలని వారు భావిస్తున్నారు'' అని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లోక్మన్ త్సూయి బీబీసీ క్లిక్‌తో మాట్లాడుతూ చెప్పారు.

చైనా దేశీయంగా అమలుచేస్తున్న ఆన్‌లైన్ నియంత్రణను ఇప్పుడు తన సరిహద్దుల వెలుపలికి కూడా విస్తరిస్తోందని.. అక్కడ తమపట్ల ఉన్నాయని తాము భావిస్తున్న అపార్థాలతో తలపడటానికి ఇలా చేస్తోందని పేర్కొన్నారు.

వికీపీడియా తన పేజీల మీద జరిగే విధ్వంసం సమస్యతో ఆరంభం నుంచీ పోరాడుతోంది. ఒక పేజీలో చేసిన మార్పులన్నిటినీ చూడవచ్చు. విధ్వంసాన్ని ఒక సెకనులో తిరగరాసి తుడిచేయొచ్చు. పేజీలను లాక్ చేయొచ్చు. బాట్లు, ఎడిటర్లు వెబ్‌సైట్‌కు కాపలాగా ఉంటారు.

వికీపీడియాను దుర్వినియోగం చేయటానికి ఆరంభం నుంచీ ప్రయత్నాలు జరిగాయి. దానిని ఆపటానికి అప్పటి నుంచీ కృషి జరుగుతూనే ఉంది.

అయితే.. లిన్ చెప్తున్న కార్యకలాపాల్లో అధికభాగం ఇటువంటి విధ్వంసం కాదు. తైవాన్ సార్వభౌమత్వం వంటి కొన్ని అంశాలు.. ఒక వివాదాస్పద వాదనను కాదని మరొక వివాదాస్పద వాదనను నిరూపించుకోవటానికి సంబంధించినవి.

ఇంకొన్ని అంశాలు - ప్రత్యేకించి మండారిన్‌లో - రాజకీయ కోణాన్ని చెప్పటానికి ఉపయోగించే పదాలను మార్చటానికి సంబంధించినది.

హాంగ్ కాంగ్ ఆందోళనలను చైనాకు ''వ్యతిరేకమైనవి''గా పరిగణించాలా? ఒక ప్రజాసమూహాన్ని ''హాన్ వారసులైన తైవానీస్ ప్రజలు''గా అభివర్ణించాలా లేక ''తైవాన్‌లో ఆదివాసీలు - హాన్ చైనీస్ ఉప బృందం'' అని వర్ణించాలా?

ఈ తరహా భాషాశాస్త్ర రంగంలో భీకర పోరాటాలు చెలరేగుతుంటాయి.

వికీపీడియా
ఫొటో క్యాప్షన్, వికీపీడియాలో జరిగే చిన్న సరవణ కూడా నెటిజన్ల అభిప్రాయాలను మార్చేస్తుంది

సమన్వయంతో నడుస్తున్న వ్యూహమా?

ఈ దాడులు తరచుగా వికీపీడియాలోని సమాచారం మీద కాదు.. దానిలో పనిచేసే వికీపీడియన్ల సమూహం మీద జరుగుతుంటాయి.

''కొంతమంది తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరో బహిర్గతం చేశారని.. తమకు భిన్నాభిప్రాయాలు ఉండటం దీనికి కారణమని మాకు చెప్పారు'' అని లిన్ తెలిపారు.

తైవానీస్ వికీపీడియాన్లను ఉద్దేశించి చంపేస్తామనే హెచ్చరికలు కూడా వచ్చాయి.

''మీ అమ్మ ఫోరెన్సిక్ నివేదికను పోలీసులు ఆస్వాదిస్తారు'' అంటుంది వికీమీడియా టెలిగ్రామ్ చానల్‌లో వచ్చిన ఒక హెచ్చరిక.

అంతేకాదు.. ఎక్కువ అధికారాలుండే వికీపీడియా అడ్మినిస్ట్రేటర్ పదవులకు జరిగే ఎన్నికలు కూడా భౌగోళిక రాజకీయాలకు అనుగుణంగా చీలిపోయి ఉన్నాయి.

ఆన్‌లైన్ కార్యకలాపాలను దేశాలకు, ప్రభుత్వాలకు ఆపాదించటం ఎక్కువగా అసాధ్యం. ఈ మార్పులకు - చైనా ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష లేదా నిరూపిత సంబంధం ఏదీ లేదు.

చైనాలో దేశభక్తులు కొందరు ఈ వికీపీడియా ఎంట్రీలను ఎడిట్ చేస్తున్నట్లు భావించవచ్చు. కానీ.. అలా అంటే.. ఈ వేదికలను తారుమారు చేయటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విస్తృత నిర్మాణాత్మక సమన్వయ వ్యూహాన్ని విస్మరించటమే అవుతుంది'' అంటారు త్సూయి.

ఎవరు చేస్తున్నారనేది చెప్పలేకపోయినా.. ఆన్‌లైన్ వేదికల్లో సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం తారుమారుచేయటానికి చైనా సహా అనేక దేశాలు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ పేజీలో మార్పులు జరిగాయన్నది వాస్తవం. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి వేదికల మీద ఆయా దేశాలు ఇలా చేశాయి. ఇంకా మరిన్ని వేదికలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ మద్దతుతో ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు హెచ్చరించారు.

ఇతర ఏ ఆన్‌లైన్ వేదికతో పోల్చినా వికీపీడియా అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.

''నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇంత కాలం పట్టటం ఆశ్చర్యం కలిగించింది. ప్రపంచానికి సంబంధించి వాస్తవాలు, విజ్ఞానం గల ప్రధాన వనరు ఇది'' అంటారు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో సీనియర్ లెక్చరర్ హీతర్ ఫోర్డ్. ఆమె డిజిటల్ కల్చర్స్ అంశం బోధిస్తున్నారు. వికీపీడియాలో రాజకీయ ఎడిటింగ్ అంశం మీద పరిశోధన చేశారు.

నిజమే.. ప్రతి దేశం తన గౌరవప్రతిష్ఠల గురించి జాగ్రత్త పడుతుంది.

''ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికశక్తి చైనా. ఈ హోదాలో ఉండే ఏ దేశమైనా కోరుకునే విధంగానే చైనా చేస్తోంది'' అంటారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ సీనియర్ ఫెలో షెర్లీ జి యు.

''చైనా దృక్కోణం నుంచి ప్రపంచానికి చైనా వాదన స్వయంగా చెప్పటమనేది నేడు చైనా బాధ్యత అని నేను అనుకుంటున్నా'' అని పేర్కొన్నారు.

మరైతే.. తైవాన్ అంశంలో చైనా తన వాదన చెప్పటం కిందికి వస్తుందా? లేక ఆన్‌లైన్ ప్రచారం కిందకు వస్తుందా?

అయితే.. వికీపీడియా వరకూ చూస్తే.. ఇంటర్నెట్ ఎందుకు అన్న దాని మీద గల రెండు విభిన్న ఆలోచనల్లో మీరు ఎటువైపు ఉంటారనే దాని మీద సమాధానం ఆధారపడి ఉంటుంది. ఉచిత విజ్ఞానం, ఉచిత వనరులు, స్వచ్ఛంద సమూహాలు అనే సిద్ధాంతం ఉంది.

కానీ ఇప్పుడిది మరొక శక్తిని ఢీకొట్టాల్సి రావచ్చు: అది ఆన్‌లైన్‌లో పెరుగుతున్న దేశాలు, ప్రభుత్వాల బలం.. నిజాన్ని నిర్వచించటంలో వాటి భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వికీపీడియా వంటి వేదికలకు విస్తరిస్తున్నాయి. అవి చాలా భారీగా, చాలా ముఖ్యంగా.. విస్మరించలేనంతగా పెరిగిపోయాయి.

* ఈ అంశంపై స్పందన కోసం చైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా మాకు సమాధానం రాలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)