ఇరాక్ నిరసనల్లో ఆగని హింస... 99 మంది మృతి

ఇరాక్ ఘర్షణలు

ఫొటో సోర్స్, Reuters

గత కొద్ది రోజులుగా ఇరాక్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 100కు చేరింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిన ఐక్యరాజ్య సమితి, "అమాయకుల ప్రాణాలను తీస్తున్న ఈ హింసకు" తక్షణమే ముగింపు పలకాలని కోరింది.

దేశంలో నిరుద్యోగం, పేలవమైన ప్రభుత్వ సేవలు, అవినీతికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్నట్లు నిరసనకారులు చెబుతున్నారు.

రాజధాని బాగ్దాద్ నగరంలో మంగళవారం రాజుకున్న నిరసనలు, తర్వాత దక్షిణ ఇరాక్‌ ప్రాంతానికీ వ్యాపించాయి. అనేక మంది రోడ్ల మీదికొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదు రోజుల్లో 99 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

"ఐదురోజుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ హింస తక్షణమే ఆగాలి" అని ఐరాస అసిస్టెంట్ మిషన్ ఫర్ ఇరాక్‌ అధ్యక్షుడు జీనైన్ హెన్నిస్- ప్లాషర్ట్ అన్నారు.

అంతమంది మరణాలకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇరాక్ ఘర్షణలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నిరసనకారుల మీద భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి

శనివారం బాగ్దాద్‌లో ప్రారంభమైన నిరసన ర్యాలీని భద్రతా బలగాలు చెదరగొట్టాయి. ఈ ఘర్షణల్లో శనివారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. భద్రతా సిబ్బంది మరోసారి టియర్ గ్యాస్‌తో పాటు కొన్ని రౌండ్ల కాల్పులు జరిపారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

మంగళవారం రాజధానిలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి 99 మంది మరణించారు, దాదాపు 4,000 మంది గాయపడ్డారని ఇరాక్‌లోని మానవ హక్కుల సంఘం తెలిపింది.

ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ ఓడిపోయినట్లు 2017లో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఇరాక్‌లో ఇంత తీవ్రస్థాయిలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి.

దేశ ప్రధానిగా ఆదెల్ అబ్దెల్ మహ్ది గతేడాది బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం కూడా ఇదే మొదటిసారి.

ఇరాక్ ఘర్షణలు

ఫొటో సోర్స్, AFP

తాజాగా ఏం జరిగింది?

కర్ఫ్యూలు విధిస్తూ, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ నిరసనలను నియంత్రించేందుకు భద్రతాధికారులు ప్రయత్నిస్తున్నారు.

బాగ్దాద్‌ నగరంలో శనివారం పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. దాంతో, కొంతమంది నిరసనకారులు మళ్లీ ప్రదర్శనలు ప్రారంభించారు.

నగరంలో నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తహ్రీర్ స్వ్కేర్‌‌ ప్రాంతంలో శనివారం కర్ఫ్యూ కొనసాగిందని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.

శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన పార్లమెంటు అత్యవసర సమావేశాలు ముందుకు సాగలేదు. సౌదీకి చెందిన అల్-అరేబియా న్యూస్ ఛానల్ కార్యాలయాలతో సహా, పలు టీవీ చానళ్ల కార్యాలయాలపై దాడులు జరిగాయి.

నాసిరియా పట్టణంలోని ఆరు రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పంటించారు.

దక్షిణాది నగరం దివానియాలోని ప్రభుత్వ కార్యాలయాన్ని వేలాది మంది ముట్టడించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

"నిరసనకారులకు ప్రస్తుతానికి స్పష్టమైన నాయకత్వం ఉన్నట్లు కనిపించడం లేదు. వారిలో ఆగ్రహం మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది" అని బీబీసీ ప్రతినిధి సెబాస్టియన్ ఉషర్ చెప్పారు.

ఇరాక్ ఘర్షణలు

ఫొటో సోర్స్, Reuters

ప్రభుత్వం ఏమంటోంది?

నిరసనకారుల ఆందోళనలకు స్పందిస్తానని ప్రధాని మహ్దీ శుక్రవారం హామీ ఇచ్చారు. కానీ, ఇరాక్ ఎదుర్కొంటున్న సమస్యలకు "తక్షణ పరిష్కారం" ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రతా దళాలకు తన పూర్తి మద్దతు ఉందని, నిరసనకారులతో వ్యవహరించడంలో తమ బలగాలు "అంతర్జాతీయ ప్రమాణాలకు" కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు.

నిరసనకారులు చేస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఇరాక్‌లోని సీనియర్ షియా మతాధిపతి, అయతోల్లా అలీ అల్-సిస్తానీ కోరారు.

"అవినీతిని కట్టడి చేయాలంటున్న ప్రజల డిమాండ్‌కు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ఏం చేస్తున్నారన్న విషయాలను కూడా వెల్లడించలేదు" అని ఆయన అన్నారు.

ఇరాక్‌లో హింసపై ఐక్యరాజ్య సమితి, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి, ఇరాక్ అధికారులు సంయమనం పాటించాలని కోరాయి.

ఇరాక్‌లో నిరుద్యోగ సమస్య

నిరుద్యోగం

ప్రస్తుతం అవినీతి, నిరుద్యోగం, పేలవమైన ప్రజా సేవల పట్ల ఇరాక్ యువత తీవ్ర అసంతృప్తితో ఉంది.

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న నాలుగో దేశం ఇరాక్‌. కానీ, 2014లో ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం, 4 కోట్ల మంది ఇరాక్ వాసుల్లో 22.5% మంది రోజుకు 135 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. సగటున ప్రతి ఆరుగురిలో ఒకరు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.

దేశ జనాభాలో మొత్తంగా చూస్తే గత ఏడాది నిరుద్యోగిత రేటు 7.9% గా ఉంది. కానీ, యువతలో నిరుద్యోగుల శాతం అంతకంటే రెట్టింపు ఉంది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన యువతరంలో దాదాపు 17% మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.

అత్యంత భీకర పోరులో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు నుంచి ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు ఇరాక్ తీవ్రంగా కష్టపడుతోంది.

అప్పటి ఘర్షణల ప్రభావం ఉన్న చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజా సేవలు సరిగా లేవు. దాంతో, ప్రజల జీవన పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)