పేటెంట్లు పొందే ఆవిష్కర్తల్లో మహిళలు తక్కువ మందే ఉంటారెందుకు

లింగ సమానత్వం, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళల వినూత్న ఆలోచనల ప్రయోజనాలను పొందడంలో ఇప్పటికీ ప్రపంచం విఫలమవుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలు, పేటెంట్ల సంఖ్యను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ హక్కుల కోసం చేసే దరఖాస్తుల్లో మహిళా ఆవిష్కర్తల భాగస్వామ్యం ఉన్నవి కేవలం 13 శాతమేనని బ్రిటన్‌లోని మేధో సంపత్తి కార్యాలయం (ఐపీవో) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంటే, ఆవిష్కర్తల్లో ఏడుగురు పురుషులకు, ఒక్కరే మహిళ ఉన్నారు.

ప్రస్తుతం నెమ్మదిగా మహిళల నిష్పత్తి పెరుగుతోంది. అయినా, ఈ పెరుగుదల ప్రకారం చూస్తే, పురుషులతో మహిళల సంఖ్య సమానం అవ్వాలంటే మరో 50 ఏళ్లు పడుతుందని అంచనా.

మేరీ క్యూరీ: రెండు నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేరీ క్యూరీ: రెండు నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త

మహిళల సంఖ్య తక్కువగా ఎందుకుఉంది?

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) విభాగాలలో పనిచేసే మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

"ఎక్కువ మంది మహిళలు పరిశోధనలు చేస్తూ, వినూత్న ఆవిష్కరణలకు పేటెంట్ల కోసం దరఖాస్తు చేయాలంటే, ఎక్కువ మంది మహిళలు విశ్వవిద్యాలయంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) సబ్జెక్టులను ఎంచుకోవాలి. వాళ్లు పరిశోధనలను తమ కెరీర్‌గా ఎంచుకునేలా అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది" అని ఈ అధ్యయన బృందం సభ్యురాలు పెన్నీ గిల్బర్ట్ అన్నారు.

పురుషులున్న బృందాలే ఎక్కువ

ఒక ఆవిష్కరణను ఎవరు చేస్తే వారికి పేటెంట్ హక్కులు లభిస్తాయి.

ఒక "ఆవిష్కరణ" పేటెంట్‌కు అర్హత పొందాలంటే, అది వినూత్నమైన, ఉపయోగకరమైన ఆలోచన అయ్యుండాలి. ఆ ఆలోచన ఆయా రంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తిదే అయ్యుండాలన్న నిబంధనేమీ లేదు.

పేటెంట్ కోసం ఎవరైనా వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, తోటి ఆవిష్కర్తలతో కలిసి బృందంగానూ దరఖాస్తు చేయవచ్చు.

మహిళా ఆవిష్కర్తల్లో బృందంగా ఏర్పడటం కంటే, ఒంటరిగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

పేటెంట్లు

బృందాలుగా చూసినా, వ్యక్తిగతంగా చూసినా పురుషుల పేరిటే అత్యధిక పేటెంట్లు జారీ అవుతున్నాయి.

మొత్తంగా చూస్తే మూడింట రెండొంతుల పేటెంట్లు అందరూ పురుషులే ఉన్న బృందాలకు లేదా పురుషులు వ్యక్తిగతంగా పొందినవే.

పురుషుల ప్రమేయం లేకుండా మహిళలు (వ్యక్తిగతం, బృందాలు కలిపి) తీసుకుంటున్న పేటెంట్ల సంఖ్య 6 శాతం మాత్రమే.

తాజా అధ్యయనం ప్రకారం, పూర్తిగా మహిళలే బృందంగా ఏర్పడి తీసుకుంటున్న పేటెంట్లు 0.3 శాతం మాత్రమే.

దరఖాస్తు చేసుకున్నా, పురుషులతో పోల్చితే మహిళలకు పేటెంట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండవచ్చునని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. స్పష్టంగా మహిళ పేరుతో ఉన్న దరఖాస్తులు ఆమోదం పొందే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనకర్తలు గుర్తించారు. అయితే, మహిళలందరికీ అలాగే జరుగుతుందని కాదు.

మొత్తం మీద, మహిళా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు పేటెంట్ పొందే అవకాశం సగం కంటే తక్కువని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఇంతకుముందు జరిపిన అధ్యయనం తేల్చింది. పురుషులతో పోల్చితే, మహిళలు తమ ఆవిష్కరణల గురించి వాణిజ్య కోణంలో తక్కువగా ఆలోచిస్తుండవచ్చునని ఆ అధ్యయనం పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Hannah Eachus

బయోటెక్నాలజీలో లింగ సమానత్వం

మూలకణాలను వేరుచేసే విధానాన్ని అభివృద్ధి చేసిన ఆన్ సుకామోటో 1991లో పేటెంట్ హక్కులు పొందారు. క్యాన్సర్ రోగుల రక్త ప్రసరణ వ్యవస్థలను వైద్యులు అర్థం చేసుకునేందుకు ఆమె ఆవిష్కరణ ఎంతో దోహదపడింది.

ఈ విధానంతో బ్లడ్ క్యాన్సర్ వైద్యం సులభతరమైంది.

మరో ఏడు ఇతర పేటెంట్లలోనూ ఆమె భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం మూలకణాల ఎదుగుదలపై ఆన్ సుకామోటో పరిశోధనలు చేస్తున్నారు.

మెరుగైన ఔషధాలు, ఆహారం ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగపడే బయోటెక్నాలజీలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య భారీగా ఉంది. అత్యంత మెరుగైన లింగ నిష్పత్తి ఉన్న రంగం ఇదే.

బయోటెక్నాలజీకి సంబంధించిన 53% పేటెంట్లలో మహిళా ఆవిష్కర్తలు భాగస్వాములుగా ఉన్నారు.

రెండవ స్థానంలో, 52% ఔషధ సంబంధిత పేటెంట్లలో కనీసం ఒక మహిళా ఆవిష్కర్త ఉన్నారు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో మహిళా ఆవిష్కర్తల భాగస్వామ్యం అత్యల్పంగా ఉంది. ఈ రంగంలోని ఆవిష్కరణల్లో మహిళల భాగస్వామ్యం పదిశాతం కంటే తక్కువే.

పేటెంట్లు

ఎంత పెరిగింది?

గత 20 ఏళ్లలో మహిళా ఆవిష్కర్తల నిష్పత్తి రెట్టింపు అయింది. ఐపీఓ గణాంకాల ప్రకారం, 1998లో మహిళల భాగస్వామ్యం కేవలం 6.8% ఉండగా, 2017 నాటికి అది 12.7 శాతానికి చేరుకుంది. 2017 వరకు మాత్రమే పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.

అదే సమయంలో, కనీసం ఒక మహిళ ప్రమేయం ఉన్న ఆవిష్కరణల నిష్పత్తి 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది.

శాస్త్ర, సాంకేతిక రంగాలను కెరీర్‌గా ఎంచుకునేలా మహిళలను ప్రోత్సహించడం ద్వారా ఆవిష్కరణల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుంటుందని గిల్బర్ట్ అంటున్నారు.

"చరిత్రలోకి తొంగిచూస్తే, రేడియో ధార్మికతపై పరిశోధన చేసిన మేరి క్యూరీ నుంచి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను కనిపెట్టిన గ్రేస్ హాపర్ వరకు అనేక అద్భుత ఆవిష్కరణలు మహిళలవే కావడం హర్షించాల్సిన విషయం. అలాంటి గొప్ప మేధావుల గురించి నేటి తరానికి చెప్పాలి" అని ఆమె అన్నారు.

పేటెంట్లు

అగ్రస్థానంలో రష్యా

దాదాపు 20 ఏళ్ల నుంచి రష్యాలో 17 శాతం పేటెంట్ దరఖాస్తుల్లో కనీసం ఒక మహిళ భాగస్వామిగా ఉంటున్నారు. అత్యధిక సంఖ్యలో పేటెంట్ దరఖాస్తులు వస్తున్న టాప్ 10 దేశాలలో మహిళా ఆవిష్కర్తల నిష్పత్తి అత్యధికంగా ఉన్నది రష్యాలోనే. రెండో స్థానంలో ఫ్రాన్స్ ఉంది.

బ్రిటన్‌లో 11 శాతం పేటెంట్ దరఖాస్తుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది.

ఈ 20 ఏళ్లలో జపాన్‌, దక్షిణ కొరియా దేశాల్లో 5 శాతం కంటే తక్కువ ఆవిష్కరణల్లో మహిళా ఆవిష్కర్తల పాత్ర ఉంది.

line

డేటా ఎలా సేకరించారు?

ఆవిష్కర్తలు పురుషులా, మహిళలా అన్న వివరాలను సాధారణంగా పేటెంట్ దరఖాస్తుల్లో పేర్కొనరు. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ హక్కుదారుల పేటెంట్ స్టాటిస్టికల్ డేటాబేస్ (పాట్‌స్టాట్) నుంచి సేకరించిన వివరాలను విశ్లేషించి, ఆవిష్కర్తల మొదటి పేర్ల ఆధారంగా వారి జెండర్‌ను గుర్తించారు.

ఆ వివరాలు యూకేలోని జాతీయ గణాంకాల కార్యాలయం నుంచి, అమెరికా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి సేకరించిన డేటాతో సరిపోలాయి.

కొంతమంది ఆవిష్కర్తల జెండర్ నిర్ధరించుకునేందుకు వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను కూడా పరిశోధకులు చూశారు.

అధ్యయనం కోసం వినియోగించిన ఈ జాబితాలోని 95% ఎంట్రీలలో మాత్రమే మగ లేదా ఆడ పేర్లు చేర్చారు. ఆడ, మగ అని స్పష్టంగా తెలియని కొన్ని పేర్లను ఈ జాబితాలో చేర్చలేదు.

ఇవి కూడా చదవండి: