గుండె జబ్బుల నివారణ: ఒక్క టాబ్లెట్‌లో నాలుగు ఔషధాలు - అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు రకాల ఔషధాలతో కూడిన ఒక మాత్రను రోజూ తీసుకొంటే గుండెపోటు, పక్షవాతం కేసుల్లో మూడో వంతు కేసులను నివారించే అవకాశం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. రక్తాన్ని పలుచగా మార్చే ఆస్పిరిన్, కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్, రక్తపోటును తగ్గించే రెండు ఔషధాలు పాలీపిన్ అనే ఈ మాత్రలో ఉంటాయి.
ఈ మాత్ర చాలా బాగా ప్రభావం చూపిస్తుందని, ఇది చవకైనదని ఇరాన్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పరిశోధకులు చెప్పారు.
వైద్యులకు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేని, వ్యక్తుల ఆరోగ్య స్థితిని వైద్యులు సరిగా అంచనా వేయలేని పేద దేశాల్లో నిర్దిష్ట వయసు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ మాత్ర ఇవ్వాలని వారు సూచించారు.
రక్తనాళంలో అడ్డంకి వల్ల గుండెకు రక్త సరఫరాలో అవరోధం ఏర్పడటం (కరోనరీ గుండె వ్యాధి), పక్షవాతం.. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఈ రెండూ అతిపెద్ద కారణాలు. ఈ రెండు సమస్యల వల్ల ఏటా కోటిన్నర మందికి పైగా చనిపోతున్నారు.
పొగ తాగడం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం గుండె సమస్యల ముప్పును పెంచుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌లోని 100కు పైగా గ్రామాల్లో దాదాపు 6,800 మందిపై జరిపిన ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'లాన్సెట్'లో ప్రచురితమయ్యాయి.
ఇందులో పాల్గొన్నవారిలో సగం మందికి పరిశోధకులు ఈ మాత్రను వాడాలని చెప్పడంతోపాటు జీవనశైలిని మెరగుపరచుకోవాలని సలహా ఇచ్చారు.
మిగతా వారికి జీవనశైలిని మెరుగుపరచుకోవాలనే సలహా మాత్రమే ఇచ్చారు.
ఐదేళ్ల తర్వాత వెల్లడైన ఫలితాలు ఇవీ:
ఈ మాత్ర వేసుకొంటున్న 3,421 మందిలో 202 మందికి గుండె సంబంధమైన ప్రధాన సమస్యలు వచ్చాయి.
ఈ మాత్ర వాడని 3,417 మందిలో 301 మందికి ఈ సమస్యలు ఎదురయ్యాయి.
అధ్యయన ఫలితాల సరళిని బట్టి చూస్తే ఈ మాత్రను 35 మందికి ఇస్తే సగటున వారిలో ఒకరికి ఐదేళ్లలో తీవ్రమైన గుండె సమస్య రాకుండా నివారించవచ్చని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి చెందుతున్న, మధ్యాదాయ దేశం అయిన ఇరాన్‌లో తాము ఈ మాత్ర ప్రభావాన్ని గుర్తించామని, ఇలాంటి చాలా దేశాల్లో దీనిని వాడొచ్చని యూకేలోని బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టామ్ మార్షల్ బీబీసీతో చెప్పారు.
ఈ మాత్ర చెడు కొలెస్ట్రాల్‌ను పెద్ద మొత్తంలో తగ్గించిందని, రక్తపోటుపై మాత్రం స్వల్ప ప్రభావాన్నే చూపిందని అధ్యయనంలో వెల్లడైంది.
50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పరిశోధకులు ఈ మాత్ర ఇచ్చారు.
అంతకుముందు గుండెజబ్బు వచ్చిందా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా దీనిని ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మాత్ర చవకైనదని, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదని, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమైన వ్యాధిని నివారించే అవకాశముందని ఇరాన్‌లోని ఇస్‌ఫహన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ నిజాల్ సరాఫ్‌జడేగాన్ చెప్పారు.
ఈ మాత్రను తీసుకురావాలనే ఆలోచన దాదాపు 2001వ సంవత్సరం నుంచే ఉంది. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ స్థాయిలో చేపట్టిన తొలి పరీక్ష ఇదే.
పేద దేశాలతో పోలిస్తే యూకే, ఇతర ధనిక దేశాల్లో ఆయా రోగుల అవసరాలను గుర్తించి, అనేక ఔషధాల్లోంచి తగిన ఔషధాలను ఎంపిక చేసి ఇచ్చేందుకు కావాల్సిన సమయం వైద్యులకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఆచరణ సాధ్యమేనా? నిపుణులు ఏమంటున్నారు?
- ఫోర్బ్స్ టాప్-10 జాబితాలో స్కార్లెట్ జాన్సన్... నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్
- జీ7 సదస్సు: అసలు జీ7 బృందం ఏమిటి? అది ఏం చేస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








