వైద్య పరీక్షల కోసం దానం చేసిన శవాన్ని ఏం చేస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోజినా సిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ వ్యక్తి తన తల్లి శవాన్ని ఒక వైద్య పరిశోధనా సంస్థకు దానం చేశారు. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన పరిశోధనల కోసం ఆ శవాన్ని వినియోగిస్తారని అతడు భావించాడు. కానీ, అలా జరగలేదు. ఆ శవాన్ని పేలుడు పదార్థాల పరీక్షల కోసం వినియోగించారు.
మరి, ఒక శవాన్ని మెడికల్ సైన్స్ కోసం దానం చేస్తే ఏమవుతుంది?
అమెరికాలోని అరిజోనాలో ఉన్న ఆ పరిశోధనా కేంద్రంపై 2014లో ఎఫ్‌బీఐ దాడులు చేసింది. అందులో చెల్లాచెదురుగా, అత్యంత భయంకర స్థితిలో పడి ఉన్న వందలాది శరీర భాగాలు కనిపించాయి.
ఆ కేంద్రంపై నమోదైన కేసుకు సంబంధించి ఇటీవల కొత్త విషయాలు బయటపడ్డాయి.
వైద్య పరిశోధనల కోసం సాయపడినవాళ్లం అవుతామన్న ఆలోచనతో కొంతమంది తమ ఆప్తుల శవాలను దానం చేస్తుంటారు. కానీ, అరిజోనాలోని ఈ పరిశోధనా సంస్థ మాత్రం, శరీర విడిభాగాలను అక్రమంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం మూతపడ్డ ఈ కేంద్రంపై అనేక మంది కేసు వేశారు. వారిలో జిమ్ స్టాఫర్ ఒకరు.
అల్జీమర్స్ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఆయన తన తల్లి శవాన్ని ఆ కేంద్రానికి ఇచ్చారు. కానీ, పేలుడు పదార్థాల ప్రభావాలను పరిశీలించేందుకు మిలటరీ ఆ శరీరాన్ని ఉపయోగించినట్లు ఆయనకు తరువాత తెలిసింది.
పేలుడు పదార్థాల పరీక్షల కోసం ఆ శరీరాన్ని వినియోగించేందుకు మీరు సమ్మతిస్తున్నారా? అని ఆ పరిశోధనా కేంద్రం వారు అడిగినప్పుడు తాను 'నో' అని రాతపూర్వకంగా చెప్పానని, అయినా తన తల్లి శవంతో పేలుడు పదార్థాలను దుర్వినియోగం చేశారని జిమ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో శవ దానం మీద నియంత్రణ ఎందుకు లేదు?
అవయవ దానం మీద అమెరికాలో నియంత్రణ ఉంది. కానీ, శవదానం పేరుతో నడుస్తున్న కార్యకలాపాల మీద మాత్రం పెద్దగా నియంత్రణ లేదు.
ఏటా ఎన్ని శవాలను దానం ఇస్తున్నారు? వైద్య పరిశోధనల కోసం ఎన్ని శరీరాలను వినియోగిస్తున్నారు? అన్న కచ్చితమైన వివరాలను నమోదు చేసే వ్యవస్థ ఏదీ లేదు.
అయితే, ఒక్క అమెరికాలోనే వైద్య విద్య, పరిశోధనల పేరుతో కొన్ని వేలమంది శరీరాలను దానం చేస్తున్నారని అంచనా.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు శరీర దానం కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రాలలో వైద్య విద్యార్థులకు వివిధ అంశాలను వివరించేందుకు ఆ శరీర భాగాలను చూపిస్తారు. అందుకు సంబంధించిన రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
'ది బాడీ ఫార్మ్' పేరుతో యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ ఒక ఆంత్రొపాలజీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసింది. మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎలా కుళ్లిపోతుందో ఫోరెన్సిక్ బృందాలకు ఇక్కడ వివరిస్తారు.
ఇలాంటి ప్రదేశాలు అమెరికాలో ఆరు ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనెడా, బ్రిటన్ కూడా ఈ ఏడాది ఆఖరులోగా ఇలాంటి కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
వీటిని కొందరు 'బాడీ ఫార్మ్స్' అని పిలిచినా శాస్త్రవేత్తలు మాత్రం 'ఫోరెన్సిక్ స్మశానం' లేదా 'టఫోనమీ లాబరేటరీ' అంటున్నారు.
అయితే, విరాళంగా ఇచ్చిన శరీనానికి ఏమవుతుందనేది, మీరు ఎవరికి ఇచ్చారన్న దానిని బట్టి ఉంటుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అనటోమికల్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ బ్రాండీ షమిట్ అంటున్నారు.
అంటే, మృతదేహాన్ని ఏ సంస్థకు ఇస్తున్నాం? ఆ శవాన్ని వైద్య పరిశోధనల కోసం వినియోగిస్తున్నారా? లేక వైద్య కళాశాలల ప్రయోగశాలల్లో విద్యార్థులకు చూపిస్తున్నారా? లేదా విడి భాగాలతో ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా? అన్నది దాతలు పరిశీలించాలని షమిట్ సూచిస్తున్నారు.
శవ దానానికి సంబంధించిన నిబంధనలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
"అదనపు నిబంధనలను తీసుకురావల్సిన అవసరం ఉంది. దాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలి. ఒక శవాన్ని దానం చేశాక అది దేనికి ఉపయోగపడిందన్న విషయం దాతలకు తెలిసేలా స్పష్టమైన నిబంధనలు రావాలి. దాతల అనుమతి ఉంటేనే ఆ శవాన్ని వినియోగించాలి" అని షమిట్ అంటున్నారు.
మానవ శరీరాలపై పరిశోధనలకు సంబంధించిన సంస్థలకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ టిష్యూ బ్యాంక్స్ గుర్తింపు ఇస్తుంది. అయితే, అరిజోనాలోని ఆ పరిశోధనా కేంద్రానికి అలాంటి గుర్తింపు ఏదీ లేదని వెల్లడైంది.
ఈ సంస్థ యజమాని స్టీఫెన్ గోరెను 2015లో న్యాయస్థానం దోషిగా తేల్చి తాత్కాలిక శిక్ష విధించింది. అతని మీద, ఆ సంస్థ మీద అనేక కుటుంబాలు దావాలు వేస్తున్నాయి. తాము దానం చేసిన శరీరాలను, తమ అంగీకారం లేకుండానే దుర్వినియోగం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, ASPETAR
ఇతర దేశాల్లో శవ దానం
ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో శవాలపై పరిశోధనలు చేసే కేంద్రాలకు హ్యూమన్ టిష్యూ అథారిటీ (హెచ్‌టీఏ) అనుమతులు ఇస్తుంది. అప్పుడప్పుడు ఆయా పరిశోధనా కేంద్రాలను తనిఖీ చేస్తుంటుంది.
శవ దానాన్ని స్వీకరించే సంస్థలు బ్రిటన్‌లో 19 ఉన్నాయి. మతపరమైన విశ్వాసాల కారణంగా కొన్ని దేశాల్లో కొంతమంది మానవ శరీరాలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రారు. ఉదాహరణకు, కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అవయవదానం కూడా నిశిద్ధం అన్నట్లుగా భావిస్తారు.
ఖతార్‌లో 2007లో ప్రారంభమైన ఆస్పెటార్ ఆస్పత్రి వేరే దేశాల నుంచి మానవ శరీర భాగాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా భుజాలు, మోకాళ్లు, చీలమండలం, తల, మొండెం భాగాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. అవయవాల ఎగుమతులు, దిగుమతుల వ్యవహారం అత్యంత క్లిష్టమైనది.
ఇవి కూడా చదవండి:
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- 'ఆర్టికల్ 370 రద్దు'తో జమ్మూ, కశ్మీర్లో ఏమేం మారతాయి
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- #INDvSL మ్యాచ్ చూస్తుంటే విమానం శబ్ధం వినిపిస్తోందా? ఆ విమానం ఇదే
- మయన్మార్: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్
- మాస్కో విమాన ప్రమాదానికి పిడుగుపాటే కారణమా
- తుపాను సమయంలో ల్యాండింగ్ కష్టమై నదిలోకి దూసుకెళ్లిన విమానం
- జెట్ ఎయిర్వేస్: అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలన్నీ రద్దు
- 'ఇథియోపియా విమానం పడిపోతుంటే పైలెట్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








