జెట్ ఎయిర్‌వేస్: అత్యవసర రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు

ఫొటో సోర్స్, Reuters
జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలు ఆ సంస్థకు అత్యవసర నిధులను ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో, ఈరోజు ఎస్‌బీఐ, జెట్ ఎయిర్‌వేస్ మధ్య జరిగే చర్చల్లో కీలక నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న వేయి మందికి పైగా ఉద్యోగుల ఆశల మీద నీళ్ళు చల్లినట్లయింది.
నిధుల నిరాకరణతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ మనుగడ మళ్ళీ ప్రశ్నార్థకంగా మారింది.
"మేం మా కార్యకలాపాలు కొనసాగించడానికి బ్యాంకుల నుంచి తాత్కాలిక నిధుల కోసం ప్రయత్నిస్తూ వచ్చాం. కానీ, ఈ దిశగా మా ప్రయత్నలేవీ ఇంతవరకూ ఫలించలేదు. అందుకని, మేం మా అంతర్జాతీయ సేవల రద్దును ఏప్రిల్ 18 వరకు పొడిగిస్తున్నాం" అని జెట్ ఎయిర్‌వేస్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"అత్యవసర రుణాలు ఇవ్వడానికి ఇంతవరకూ ఎవరూ ముందుకు రాలేదు" అని జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ వినయ్ దుబే తన ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వెల్లడిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఉదయం జెట్ ఎయిర్‌వేస్, దాని ప్రధాన రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల కోసం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్లు, ఇంజినీర్లు సుమారు వెయ్యి మంది ఆశగా ఎదురు చూశారు.
జనవరి నుంచి జీతాలు అందకపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి విధుల్లోకి రాకూడదని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్.. ఈ రోజు సమావేశంలో సంస్థ పునరుద్ధరణకు అవకాశాలు ఉంటాయేమో చూడాలని ఉద్యోగులకు సూచించడంతో సమ్మె నిర్ణయం వాయిదా పడింది.
అయితే, ముంబయిలోని జెట్ ఎయిర్‌వేస్ కార్పొరేట్ ఆఫీసు ఎదుట నిరసన తెలపాలని మాత్రం ఉద్యోగులు నిర్ణయించారు. శనివారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం ఎదుట జెట్ ఉద్యోగులు నిరసన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జెట్ ఎయిర్‌వేస్ గతం...
జెట్ ఎయిర్‌వేస్... ఒకప్పుడు భారతదేశంలో ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ. ముఖ్యంగా, 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయిన సంస్థ. అక్షరాలా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఈ సంస్థ ఇప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితుల్లో చిక్కుకుంది. తప్పు ఎక్కడ జరిగింది? బీబీసీ ఇండియా ప్రతినిధి సమీర్ హష్మి అందిస్తున్న విశ్లేషణ.
భారతీయ విమానయాన అనుభవాన్ని పునర్నిర్వచించిన ఈ సంస్థ ఎంతో మంది ప్రయాణికులను తన అభిమానులుగా మార్చుకుంది. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన సేవలు అందిస్తూ జాతీయ సంస్థ అయిన ఎయిరిండియాను అధిగమించగలిగే స్థాయికి చేరుకుంది.
గత ఏడాదిలో స్థిరమైన ప్రగతి సాధించిన జెట్ ఎయిర్‌వేస్ భారతదేశ అతిపెద్ద అంతర్జాతీయ విమాన సేవల సంస్థగా ఎదిగింది. గత ఏడాదే రజతోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ సంస్థకు ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇటీవలి వారాలలో ఈ సంస్థ వేల సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది.
తనకున్న 119 విమానాలలో మూడింట రెండు వంతులను నిలిపేసింది. ఇప్పటికే ఈ సంస్థ రుణభారం 100 కోట్ల డాలర్లకు (దాదాపు 7,000 కోట్ల రూపాయలు) చేరుకుంది. రుణాల కిస్తులు, ఉద్యోగుల జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది.

ఫొటో సోర్స్, Getty Images
గట్టెక్కించే ప్రయత్నాలు...
అయితే, ఇప్పటికే అంతా అయిపోయిందనుకోవాల్సిన అవసరం లేదు.
భారత ప్రభుత్వం అసాధారణ రీతిలో రంగంలోకి దిగి ప్రైవేట్ సంస్థే అయినప్పటికీ, జెట్‌ను ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంస్థను కష్టాల్లోంచి బయటపడేసే పథకాలతో ముందుకు రావాలని జాతీయ బ్యాంకులకు సూచించింది.
వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ 23,000 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ కుప్పకూలిపోవడాన్ని ఆపాలని చూస్తున్నారు.
ఈ "ఆదుకునే ప్రయత్నం" దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ)తో నేతృత్వంంలో మొదలైంది. ఈ సంస్థ కష్టాలకు ఒక పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు బ్యాంకులు రంగంలోకి దిగుతున్నాయని అన్నారు.
ఏది ఏమైనా, ఈ సంస్థ నిలబడుతుందన్న నమ్మకం ఇంకా చాలా మందికి కలగడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విమానయాన సంస్థ ఆర్థిక స్థితి గందరగోళంగా మారిన నేపథ్యంలో కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడమన్నది బ్యాంకులకు కూడా కష్టమేనని ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అన్నారు.
"కనుచూపు మేరలో లాభాలు కనిపించే అవకాశం లేనప్పుడు ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారు. ఎవరూ కూడా ఓ వ్యాపారాన్ని ముంచడానికి డబ్బు ఖర్చు చేయరు కదా" అని ఆయన అన్నారు.
అయితే, ఎస్.బి.ఐ ఇప్పటికే అబూ ధాపీలోని ఎతిహాద్ ఎయిర్వేస్‌తో చర్చలు జరిపింది. ఈ సంస్థకు జెట్ ఎయిర్వేస్‌లో 24 శాతం వాటా ఉంది. జెట్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని రుణదాతలు ఎతిహాద్ యాజమాన్యాన్ని కోరారు. కానీ, ఆ సంస్థ అందుకు ఒప్పుకోకుండా, ఇప్పటికే ఉన్న వాటాను అమ్ముకుని బయటపడాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విమానయాన సంస్థ నిపుణుడు మహంతేశ్ సబారద్ మాత్రం, వ్యూహాత్మకంగా చూస్తే జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్ అదనపు పెట్టుబడులు పెట్టడం మంచిదేనని భావిస్తున్నారు. దాని వల్ల ఈ గల్ఫ్ విమానయాన సంస్థ 2024 నాటికి అమెరికా, చైనాల తరువాత మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు.
గోయల్ సమస్య
ఎతిహాద్ సహా పెట్టుబడి పెట్టగలిగిన ఇతర సంస్థలు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేశ్ గోయల్‌ను చూసి వెనుకడుగు వేస్తున్నాయి. ఆయన ఈ సంస్థ మీద తన పట్టును వదలుకోవడానికి ససేమిరా అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి, ఎతిహాద్ సంస్థ జెట్ ఎయిర్వేస్‌లో తన వాటాను పెంచడానికి మొదట అంగీకరించిందని, అయితే గోయల్ ఆ సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరించడంతో వెనక్కి తగ్గిందని తెలిసింది. గోయల్, ఆయన కుటుంబ సభ్యులకు జెట్ ఎయిర్వేస్‌లో 52 శాతం వాటా ఉంది. విదేశీ విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థలలో 49 శాతం వరకు పెట్టుబడులు పెట్టడానికి భారత విమానయాన చట్టాలు అనుమతిస్తున్నాయి.
"గతంలో కూడా జెట్ కష్టాల్లో ఉన్నప్పుడు తన హోదాను కాపాడుకోవడానికి గోయల్ ఎలాంటి ఒప్పందాలనూ ఆమోదించలేదు" అని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
"గోయల్ కనుక చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటే సమస్య పరిష్కారానికి ఎన్నో తలుపులు తెరుచుకుంటాయి. పెట్టుబడులు పెట్టేవారు ఎవరైనా ఆ సంస్థను ప్రొఫెషనల్‌గా నడపడానికి పూర్తి నియంత్రణ కోరుకుంటారు" అని భార్గవ అన్నారు.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
ఆ రెండు సంస్థల రాకతో మొదలైన కష్టాలు
2004-05 సమయంలో ఇండిగో, స్పైస్ జెట్ రాకతో జెట్ ఎయిర్వేస్‌కు సమస్యలు మొదలయ్యాయి. ఈ రెండు సంస్థలు తక్కువ ధరలకే టికెట్లను అమ్మడం మొదలుపెట్టాయి.
మొదట్లో 'ప్రీమియం ఎయిర్‌లైన్స్' అన్న పేరును నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో జెట్ ఎయిర్వేస్ తమ టికెట్ల ధరలను తగ్గించకుండా హెచ్చు ధరలనే కొనసాగించింది. రోజులు గడిచే కొద్దీ ప్రయాణికుల్లో తన వాటాను ఇండిగోకు కోల్పోవడం మొదలైంది.
ఈ పరిణామంతో జెట్ ఎయిర్వేస్ తన విధానాన్ని మార్చుకొంది. టికెట్ల ధరలను తగ్గించింది. ఈ విధాన నిర్ణయమే జెట్ ఎయిర్వేస్ ను సమస్యల్లోకి నెట్టేసిందని నిపుణులు అంటున్నారు.
చమురు ధరల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల్లో నిలకడ లేకపోవడం కూడా జెట్ ఎయిర్వేస్‌ను
ప్రభావితం చేసింది. లాభాలు తగ్గిపోయాయి. సంస్థ కార్యకలాపాలు సాఫీగా కొనసాగించేందుకు బ్యాంకుల నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది.
జెట్ ఎయిర్వేస్ పదేళ్లుగా నష్టాలనే చవిచూస్తోంది. రుణాలను తీర్చడం ఆ సంస్థకు కష్టమవుతోంది. నిరుడు చమురు ధరలు పెరగడంతో పరిస్థితి ఇంకా దిగజారింది.
అప్పట్నుంచి తక్కువ వనరులతోనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.
సమయం మించిపోతోంది
600 దేశీయ మార్గాలు, 380 అంతర్జాతీయ మార్గాలలో సేవలు అందించిన ఈ సంస్థ ఇప్పుడు క్రమక్రమంగా అన్ని సేవలను రద్దు చేస్తూ వస్తోంది. సేవలను రద్దు చేసుకున్న జెట్ విమానాలను ఉపయోగించే విషయం ఆలోచించమని ప్రభుత్వం స్పైస్ జెట్ వంటి లోకాస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రత్యామ్నాయ ప్రణాళికను త్వరగా అమలు చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్లయింగ్ నిలిపి వేస్తామని జెట్ సంస్థ పైలట్ల సంఘం నిర్ణయించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
జెట్ ఎయిర్వేస్ పైలట్ల సంఘానికి చెందిన అసీం లిల్వాని బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రస్తుతం మా దగ్గర 40 విమానాలే సేవలు అందిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ నెల 31కి ఈ సంఖ్య ఐదు లేదా ఆరుకు చేరొచ్చు. ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు సమస్య జీతాలది కాదు. మా భవిష్యత్తుకు సంబంధించి స్పష్టత ఇవ్వండి, ఒకవేళ సంస్థను మూసేయాలనుకుంటే మాకు చెప్పండి, మేమందరం గౌరవంగా మా ఉద్యోగాలకు రాజీనామా చేసి తప్పుకుంటాం' అని ప్రభుత్వాన్నీ, బ్యాంకులనూ, ఛైర్మన్‌నూ కోరుకొంటున్నాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/JetAirways
జెట్ ఎయిర్వేస్ సమస్య ప్రభావం వినియోగదారులపైనా పడుతోంది. విమాన చార్జీలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. మామూలు కనా న్నాలుగు రెట్లు ఎక్కువ పెరిగాయి.
జెట్ ఎయిర్వేస్‌కు ప్రస్తుతం నిధులు తక్షణం అవసరం. ఆ డబ్బు కూడా సంస్థను కొంతకాలమే నిలబెట్టగలదు.
సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ కంపెనీలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులు కావాలి. లాభాలు తెచ్చే ఒక వ్యాపార నమూనా కూడా దొరకాలి.
ఇవవీ జరక్కపోతే కొంత మంది భావిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ మూతపడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ హయాంలో రహదారుల నిర్మాణం ఎన్ని రెట్లు పెరిగింది?
- రఫేల్ ఒప్పందం: నిన్న... నేడు... రేపు...
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
- ఆలయ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామని డీఎంకే చెప్పిందా
- పాక్‌లో వైరల్ అవుతున్న ఆ పైలట్ వీడియో బెంగళూరులోది
- న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పులు: ఆత్మీయులను కోల్పోయిన వారి అంతరంగం
- ''మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం.. ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే ఏమైపోయేవాళ్లమో" - బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










