లోక్‌సభ ఎన్నికలు 2019: మోదీ హయాంలో రహదారుల నిర్మాణం మూడు రెట్లు పెరిగిందా - RealityCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
చెప్పుకుంటున్నది: రోడ్ల నిర్మాణం గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ హయాంలో మూడింతలు ఎక్కువగా ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది.
చేసింది: మోదీ హయాంలో రోడ్ల నిర్మాణం గతం కంటే బాగా పెరిగింది. కానీ ఈ పెరుగుదల మూడింతలైతే లేదు.
రహదారులను ముందెన్నడూ లేనంత ఎక్కువగా తమ ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ 2018 ఏప్రిల్‌లో చెప్పారు. ''ఇంతకుముందు వరకు జరిగిన పని కన్నా మూడింతలు ఎక్కువ పని ఇప్పుడు జరుగుతోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, NHAI
ప్రపంచంలోనే రహదారుల వ్యవస్థ అత్యధిక స్థాయిలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో 55 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి.
భారత్‌లో రహదారుల వ్యవస్థను మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు.
1. జాతీయ రహదారులు
2. రాష్ట్ర రహదారులు
3. గ్రామీణ రహదారులు
1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్‌లో 21,378 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉండేవి.
2018 నాటికి ఇది సుమారు 1,29,709 కిలోమీటర్లకు చేరుకుంది.
జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తారు. రాష్ట్ర రహదారులను రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయి.
గ్రామీణ రహదారులు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి వస్తాయి.

ఫొటో సోర్స్, NHAI
బాగా పెరిగింది
గత దశాబ్దపు అధికారిక గణాంకాలను పరిశీలిస్తే 2014లో బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం బాగా పెరిగింది.
యూపీఏ ప్రభుత్వ చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14లో 4,260 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 9,829 కిలోమీటర్ల మేర నిర్మించింది. 2013-14తో పోలిస్తే ఇది రెండింతల కన్నా ఎక్కువ. కానీ మూడింతలు మాత్రం కాదు.
300కు పైగా ప్రభుత్వ రహదారి ప్రాజెక్టులు 2019 చివర్లోగా పూర్తవుతాయని నిరుడు డిసెంబరులో జరిపిన ఒక సమీక్షలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ చెప్పింది.
ప్రస్తుత ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేటాయింపులను పెంచుతూ వచ్చింది.
రహదారులు దేశం ఆస్తులు: నితిన్ గడ్కరీ
''రహదారులు దేశం ఆస్తులు'' అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. దేశంలో రహదారుల అభివృద్ధికి గడ్కరీ చేస్తున్న కృషిని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కూడా ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ రహదారుల నిర్మాణం
2000వ సంవత్సరంలోనే బీజేపీ సారథ్యంలోని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో తాము 47 వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు వేశామని నిరుడు మేలో మోదీ ప్రభుత్వం తెలిపింది. 2016-17లో గ్రామీణ రహదారుల నిర్మాణం ముందెన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరిందని బీజేపీ చెప్పింది. కానీ గత దశాబ్దపు అధికారిక గణాంకాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
యూపీఏ హయాంలో 2009-10లో 60,017 కిలోమీటర్ల పొడవున గ్రామీణ రహదారులు వేశారు. ఇది 2016-17 గణాంకాల కన్నా ఎక్కువే.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ రహదారులకు ప్రతీ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి.
గ్రామీణ రహదారుల నిర్మాణానికి 2004 నుంచి ప్రపంచ బ్యాంకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది.
గ్రామీణ రహదారుల నిర్మాణంలో పురోగతి అత్యంత సంతృప్తికరంగా ఉందని ప్రపంచ బ్యాంకు నిరుడు డిసెంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:
- అభినందన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా...
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్‌గాంధీ
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









