అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?

వరి పొలంలో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

'అన్నదాత సుఖీభవ' పథకం మార్గదర్శకాలు విడుద‌ల‌య్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజ‌న‌'ను విస్తరిస్తూ ఏపీలో 'అన్నదాత సుఖీభవ'ను అమలు చేస్తున్నట్లు ఏపీ వ్యవసాయశాఖ విడుదల చేసిన జీవో ఎంఎస్ 28లో పేర్కొన్నారు.

ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి 15 వేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఇస్తున్న ఆరు వేలకి మరో 9వేలు కలిపి మొత్తం 15వేలు ఇస్తామంటోంది. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

ఇంతకీ అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారు? కుటుంబం అనే పదానికి ప్రభుత్వం చెబుతున్న నిర్వచనం ఏంటి? ఒకే కుటుంబంలో ఇద్దరి పేరుతో భూమి ఉంటే ఈ పథకం వర్తిస్తుందా? అన్నింటికన్నా ముఖ్యంగా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు?

అన్నదాతకు ఆర్థిక సాయం

మొన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం.. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వాలు భారీ నజరానాలు ప్రకటించాయి.

తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కేంద్రం ఏడాదికి 6వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయబోతోంది.

అన్నదాత

ఫొటో సోర్స్, https://goir.ap.gov.in/

ఏపీలో పెట్టుబడి సాయం రూ.15వేలు

ఏపీ ప్రభుత్వం కూడా రైతుల కోసం అన్నదాత సుభీభవ పథకం ప్రకటించింది.

పంట పెట్టుబడి కోసం ప్రతీ రైతుకి ఏడాదికి 10 వేల రూపాయలు ఇస్తామని మొదట ప్రకటించింది. తర్వాత ఈ ఆర్థికసాయాన్ని 15 వేలకు పెంచింది.

ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ఇస్తున్న 6 వేలకి మరో 9వేలు కలిపి ఒక్కో రైతుకు మొత్తం 15 వేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తామే సొంతంగా 10 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేశారు. కౌలు రైతులకు కూడా తామే ఏడాదికి 15వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

ఎంత మందికి ప్రయోజనం?

ఏపీలో 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతు కుటుంబాల సంఖ్య 54 లక్షలు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాల సంఖ్య మరో 15 లక్షలు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకం కింద మొత్తంగా 70 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.

అన్నదాత

ఫొటో సోర్స్, AFP

ఎవరు అర్హులు?

ఏపీలో ఉన్న రైతులు, కౌలుదారులందరికీ ఈ పథకం వర్తింస్తుంది. ఎకరానికి ఇంత అని కాకుండా కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆర్థిక సాయం చేస్తారు. ఐదెకరాల లోపు ఉన్న వారికి ఏడాదికి 15వేలు ఇస్తారు. ఐదెకరాల కంటే ఎక్కువున్న వారికి 10వేలు ఇస్తారు.

కుటుంబాన్ని ఎలా లెక్కిస్తారు?

భార్య, భర్త, వారి మైనర్ పిల్లలని ఒక కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

ఒక కుటుంబంలోని వ్యక్తికి పెళ్లికానప్పటికీ.. మేజర్ అయి ఉండి, అతను / ఆమె పేరుపై భూమి ఉంటే అతను / ఆమెను మరో కుటుంబంగా లెక్కిస్తామని వివరించారు. అలాంటి వాళ్లకి కూడా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందుతుందని స్పష్టం చేశారు.

రేషన్ కార్డులు లేకపోతే ఎలా?

అన్నదాత సుఖీభవ పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేదని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

రైతులకు సంబంధించిన సమాచారం తమ వద్ద కావాల్సినంత ఉందని, బ్యాంకు అకౌంట్ల వివరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రుణ విముక్తి పథకానికి సంబంధించిన డేటా తమ వద్ద ఉందని, భూమి పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల్ని ఎంపిక చేయొచ్చని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అన్నదాత

ఫొటో సోర్స్, Getty Images

షరతులు వర్తిస్తాయ్ - వీరికి అన్నదాత సుఖీభవ వర్తించదు

రైతులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకానికి వర్తించిన షరతులు అన్నదాత సుఖీభవ పథకానికి కూడా వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం కేంద్రం వెల్లడించిన మార్గదర్శకాల్లో ఎన్నో షరతులున్నాయి.

రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్న వారికి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, నగర మేయర్లు కిసాన్ పథకానికి అనర్హులు. ఆ పదవులను నిర్వహించిన మాజీలకు కూడా వర్తించదు.

రైతు కుటుంబాన్ని భర్త, భార్య, మైనర్ పిల్లలు అని వర్గీకరించినందున ఆ కుటుంబంలో పైన పేర్కొన్న వారు సభ్యులుగా ఉంటే ఈ పథకం వర్తించదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైనవారు, స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, రిటైరైనవారు, అటానమస్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, రిటైరైనవారు ఈ పథకానికి అనర్హులు.

అయితే, వీరిలో క్లాస్‌ ఫోర్‌, గ్రూపు డీ ఉద్యోగులను మినహాయించారు. అలాగే నెలకు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ పెన్షన్‌ పొందుతున్న వారికి కూడా ఇది వర్తించదు.

డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్‌ అక్కౌంటెట్లు, వృత్తిపరమైన నిపుణులకు సంబంధించిన గుర్తింపు పొందిన అసోసియేషన్లలో ప్రాక్టీస్‌ చేసే వారికి పథకం వర్తించదు.

గత ఏడాది ఇన్‌కంట్యాక్స్‌ చెల్లించిన వారికి పథకం కూడా కేంద్ర ప్రభుత్వ పథకం వర్తించదు.

రైతులను గుర్తించేందుకు ఇప్పుడు ఇవే నిబంధనలను ఏపీ ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోబోతోంది.

కేంద్ర పథకంలో ఎన్నో ఆంక్షలున్నాయని ఆక్షేపించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మ‌ళ్లీ వాటినే మార్గదర్శకాలుగా ఎంచుకోవ‌డం ఆశ్చర్యంగా ఉందని కిసాన్ స‌భ ఏపీ విభాగం అధ్యక్షుడు పూల పెద్దిరెడ్డి అన్నారు.

అన్నదాత

ఫొటో సోర్స్, Reuters

డబ్బులెప్పుడు చెల్లిస్తారు?

మొదటి విడతలో రూ.4 వేలు ఈ మార్చిలోపు రైతుల ఖాతాల్లో వేస్తామని జీవోలో తెలిపారు.

తొలివిడతలో ఇస్తామన్న రూ.4 వేలల్లో కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిసే ఉంటుందా లేక రాష్ట్ర వాటానే రూ.4 వేలా అన్న విషయంపై అందులో స్పష్టత ఇవ్వలేదు.

కౌలు రైతులకు వచ్చే ఖరీఫ్‌ నుంచి అంటే ఎన్నికల తర్వాత రెండు విడతల్లో రూ.15 వేల చొప్పున ఇస్తామని వివరించారు.

అంటే ఎన్నికల్లోపు కౌలు రైతులకు ప్రయోజనం దక్కడం లేద‌ని తెలుస్తోంది. అయితే, ఆర్థికశాఖ నుంచి బడ్జెట్‌కు సంబంధించిన వివ‌రాలు కూడా జీవోలో పేర్కొన‌లేదు.

తెలంగాణలో మాదిరిగా డబ్బులు చెక్కుల రూపంలో ఇవ్వాలా.. లేక నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలా అన్న దానిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఏపీలో 45 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వారికి నేరుగా నగదు బదిలీ చేసి, మిగతా వారికి చెక్కుల రూపంలో ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

కౌలు రైతుల పరిస్థితి ఏంటి?

ఏపీలో 15.34 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో అర్హులైన వారందరికీ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.

కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదు. వారికి తామే ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అన్నదాత

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక సాయం పొందాలంటే కౌలుదారులు ఏం చేయాలి?

కల్టివేషన్ సర్టిఫికేట్, లోన్ ఎలిజిబిలిటి సర్టిఫికెట్ ఉన్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింస్తుందని ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు చెప్పారు.

"మే, జూన్‌లో కౌలు ఒప్పందాలు జరుగుతాయి. పంట వేసేటప్పుడే కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటి సర్టిఫికెట్ ఇస్తారు. కౌలు రైతులకు గతంలో రుణాలు ఇచ్చిన వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా కౌలు రైతులను గుర్తిస్తా" మని మంత్రి సోమిరెడ్డి చెప్పారు.

అయితే, కౌలుదారుల గుర్తింపు, వారికెలా సాయం చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి కచ్చితమైన సమాచారం వస్తుందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

అన్నదాత

ఫొటో సోర్స్, Getty Images

కౌలు రైతుల సమస్యలేంటి?

కౌలుదారుల‌కు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో గుర్తింపు కార్డులు జారీ చేసింది. అయితే, దీనికి భూయ‌జ‌మాని కూడా ఒప్పుకోవాలి. కానీ, చాలా మంది భూయజమానులు అంగీకరించకపోవడంతో కౌలుదారుల‌ పేర్లు చాలావరకు ఈ జాబితాలో క‌నిపించ‌డం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇది కొంతవరకు నిజమేనన్నారు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ వై. లక్ష్మీఈశ్వరీ.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, భూ యజమానులు అంగీకరించకపోవడం వల్ల కొంతమంది కౌలుదార్లకు రుణ అర్హత పత్రాలు అందలేదని అన్నారు. ఇప్పుడు కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? కొత్తవాళ్లకి అవకాశం ఇస్తారా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆమె వివరించారు.

మరోవైపు, కౌలు రైతుల సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని, డెల్టా ప్రాంతంలో 90 శాతం భూమి కౌలుదారుల చేతుల్లోనే సాగ‌వుతోందని వ్యవసాయ నిపుణులు, కృషికార్ సంస్థ ప్రతినిధి రావిపాటి శ్రీకాంత్ చెబుతున్నారు. కృష్ణా, గోదావ‌రి డెల్టా ప్రాంతాల్లోని 4 జిల్లాల్లోనే 12లక్షల మంది కౌలు రైతులు ఉంటార‌ని ఆయ‌న చెబుతున్నారు.

కౌలు రైతుల సంఖ్య 20 లక్షల వరకు ఉంటుందని కిసాన్ స‌భ ఏపీ విభాగం అధ్యక్షుడు పూల పెద్దిరెడ్డి అభిప్రాయ‌ప‌డుతున్నారు.

"గత ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటించి, ఆ తర్వాత దానికి కోతలు పెట్టారు. ఇన్‌పుట్ సబ్సీడీ అందరికీ అందడం లేదు. 350 కరువు మండలాలను పట్టించుకోవడం లేదు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రైతులకు పూర్తిగా రుణ విముక్తి కలిగించకుండా ఇలా పెట్టుబడి సాయం పేరుతో డబ్బులివ్వడం రైతుల్ని మోసం చేయడమే" నని పెద్దిరెడ్డి అన్నారు.

కౌలు రైతులను గుర్తించేందుకు జన్మభూమి తరహాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

కొంత సొంత భూమి ఉండి, మ‌రికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారంద‌రినీ సొంత భూమి య‌జ‌మానుల ఖాతాలో ఈ ప‌థ‌కం కింద ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటామ‌ని వ్యవసాయ శాఖ అద‌న‌పు డైరెక్టర్ జీ విన‌య్ చంద్ బీబీసీతో అన్నారు. సొంత భూమి లేకుండా, ఇత‌రుల పొలాల‌ను సాగు చేస్తున్న కౌలుదారుల విష‌యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

అన్నదాత

ఫొటో సోర్స్, apagrisnet.gov

మూడు పథకాల మధ్య తేడాలేంటి?

తెలంగాణ రైతుబంధు పథకంలో ఎకరాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. భూ గరిష్ఠ, కనిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. అంటే రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎనిమిది వేలు పంట పెట్టుబడిగా అందుతాయి. ఈ ఆర్థిక సాయాన్ని పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా చెక్కుల రూపంలో చెల్లిస్తారు. ఖరీఫ్, రబీ రెండు విడతల్లో నాలుగు వేల చొప్పున రైతులకు పంపిణీ చేస్తారు.

ఇక కేంద్ర ప్రభుత్వ పథకం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే వర్తిస్తుంది. రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరువేలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కౌలుదారులు, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకి ఈ పథకం వర్తించదు.

అన్నదాత సుఖీభవ పథకం ఏపీలోని రైతులు, కౌలుదారులందకీ వర్తిస్తుంది. ఎంత భూమి ఉందన్న దానితో సంబంధం లేకుండా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నారు.

ఒకవేళ మైనర్ పిల్లలు ఉన్న భార్య, భర్త.. వారికి ఎంత పొలం ఉన్నప్పటికీ అందే సాయం రూ.15 వేలు.

కుటుంబంలో మేజర్ అయిన పిల్లలు ఇద్దరు ఉండి, వారి పేర్లమీద భూమి ఉంటే.. వారికి వేర్వేరుగా చెరో రూ.15 వేలు లభిస్తాయని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.