బడ్డెట్ 2019: ఎన్నికల ఏడాదిలో మోదీ ఆశల మంత్రం ఫలిస్తుందా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వివేక్ కౌల్
- హోదా, బీబీసీ కోసం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో 'యురీ: ది సర్జికల్ స్ట్రైక్స్' సినిమా గురించి ప్రస్తావించారు. థియేటర్లో ఈ సినిమాను చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన, ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఓ మాట అన్నారు. పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల నేపథ్యం ఆధారంగా రూపొందింది.
పీయూష్ గోయల్ యురీ దాడులను ప్రస్తావించడంతో మోదీ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోందా అని అప్పటివరకూ ఉన్న అనుమానాలు నిజమయ్యాయి. వాస్తవానికి, ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ అవసరమైన వ్యయాలకోసం ఉద్దేశించినదే ఈ మధ్యంతర బడ్జెట్. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే నెలాఖరుకు కొత్త ప్రభుత్వం కొలువుతీరవచ్చు.
పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోగల మోదీ తనకు దక్కిన ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
రైతుల కోసం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకమే ఈ బడ్జెట్‌లో అతిపెద్ద ప్రకటన అనుకోవచ్చు. దాదాపు 5 ఎకరాల లోపు వ్యవసాయయోగ్య భూమి ఉన్న రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా సంవత్సరానికి 6000 రూపాయలను బదిలీ చేసే పథకాన్ని ప్రారంభించనున్నట్లు గోయల్ ప్రకటించారు. దీన్ని మూడు విడతల్లో ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు లబ్ధికలుగుతుందని ఆయనన్నారు. ఒక్కో కుటుంబంలో సరాసరిన ఐదుగురు ఉంటారనుకుంటే సుమారు 60 కోట్లమంది (దాదాపు దేశంలో సగం జనాభా)కి ఇది నేరుగా ప్రయోజనం కలిగిస్తుంది. దాదాపు వీరంతా ఓటుహక్కు ఉన్నవారే.
ఆ కోణంలో చూస్తే, ఒకవేళ ఈ పథకం అమల్లోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ పథకాన్ని గత సంవత్సరం అంటే 2018 డిసెంబరు 1 నుంచే అమలుచేయడం, ఈ సంవత్సరం మార్చి 31 నాటికి మొదటి వాయిదా సొమ్ము ఖాతాల్లో జమచేస్తామని చెప్పడం. దీని కోసం ప్రభుత్వానికి రూ. 20,000 కోట్లు ఖర్చవుతాయి. వచ్చే ఏడాది మొత్తానికి ఈ పథకం అమలుకు దాదాపు 75 వేల కోట్లు అవసరమని అంచనా. వ్యవసాయ రంగంలో నెలకొన్న అసంతృప్తిని ఈ పథకం ద్వారా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ప్రకటించారు.
మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం ముందున్న సవాళ్ళేమిటంటే, అమలుకు విధివిధానాల రూపకల్పన. ఈ పథకానికి ఎవరు అర్హులో గుర్తించడం. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో భూరికార్డుల్లో ఇప్పటికీ ఎన్నో అవకతవకలున్నాయి. మరో ముఖ్యమైన అంశం, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? 'ఏదీ ఉచితంగా రాదు' అని ఆర్థిక శాస్త్రంలో ఓ మాట ఉంది. అంటే ఎవరో ఒకరు డబ్బులు చెల్లించాలి. ఇక్కడ 'ఎవరో ఒకరు' అంటే మధ్యతరగతి ప్రజలు కావచ్చు.

ఫొటో సోర్స్, LOK SABHA TV
వీటన్నింటికీ మించి, అసంఘటితరంగ ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. నెలకు 15000 రూపాయల లోపు ఆదాయం ఉన్న దాదాపు 42 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. 60 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు 3 వేల రూపాయలను పెన్షన్‌గా అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 18 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరే ప్రతి వ్యక్తి నెలకు 55 రూపాయలను కడితే, ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో పెన్షన్ పథకంలో జమ చేస్తుంది.
దీని అమలులో కూడా ఎన్నో అనుమానాలు, సమస్యలు. అసంఘటిత కార్మికుల్లో చాలామందికి జీతాలు డబ్బురూపంలో నేరుగానే చెల్లిస్తారు. వారి ఆదాయంలో చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దాన్ని ఎలా నిర్ణయిస్తారో చూడాలి. రాజకీయంగా చూస్తే ఇదో మంచి పథకమే కావచ్చు, కానీ ఆర్థికాంశాలను బేరీజు వేస్తే దీని అమలు కష్టం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల ఏడాది తాత్కాలిక బడ్జెట్ సంప్రదాయాన్ని పక్కనపెట్టిన పీయూష్ గోయల్ ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళు వచ్చే ఏడాది నుంచి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమిది రూ.2.5 లక్షలుగా ఉంది. ఇంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు పన్ను మీద రూ. 2,500 రిబేటు ఉంది. అంటే, రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. ఈ రిబేటు ఇకపై రూ. 5 లక్షల వరకు వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్నప్పుడు పాత స్లాబుల ప్రకారమే పన్ను చెల్లించాలి. అయితే, ఈసారి బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 40 వేల నుంచి 50 వేలకు పెంచారు.
ఇక, మరో అంశం ఆదాయపన్ను రిటర్నుల మదింపు, చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, మరి కొన్ని నెలల్లో వచ్చే కొత్త ప్రభుత్వం ఈ మార్పులను ఆమోదిస్తూ, పూర్తి స్థాయి బడ్జెట్‌లో వీటన్నింటికీ చోటు కల్పించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
తన ప్రసంగం ఆసాంతం గోయల్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. బీజేపీ ఎంపీలంతా బడ్జెట్ ప్రసంగం జరుగుతున్న గంటన్నరపాటు 'మోదీ, మోదీ, మోదీ...' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ 10 పాయింట్లతో విజన్ 2030ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. 2022 నాటికి మానవసహిత అంతరిక్ష యాత్ర, భారత్‌ను అత్యంత ఆహారభద్రత గల దేశంగా చేయడం (ఇప్పటికే ఆహార భద్రత ఉంది), కాలుష్య రహితంగా మార్చడం, అన్ని రంగాలనూ డిజిటలీకరణ చేసి డిజిటల్ ఇండియా సాధన, అందరికీ అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు వంటివి వీటిలో కొన్ని.

ఫొటో సోర్స్, Getty Images
'మెరుగైన భారత్ కోసం' అంటూ మోదీ 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. 'మంచి రోజులు రాబోతున్నాయి' (అచ్ఛే దిన్ ఆనేవాలీ హై) అనే మోదీ నినాదం బాగా ప్రాచుర్యం పొందింది. ఉద్యోగాలు సృష్టిస్తామని, తక్కువమంది ప్రభుత్వంతో సమర్థపాలన అందిస్తామని మోదీ అప్పట్లో హామీలిచ్చారు.
ఐదేళ్ల తర్వాత, 'మంచిరోజులు రానున్నాయి' అనేది మరోసారి ఎన్నికల నినాదంగా మారిపోయింది. పెద్దనోట్ల రద్దు, సరైన ప్రణాళిక లేకుండా ప్రవేశపెట్టిన జీఎస్టీ వంటి నిర్ణయాల కారణంగా నిరుద్యోగం 46 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిందని ఇటీవల లీక్ అయిన ఓ ప్రభుత్వ నివేదిక వెల్లడి చేసింది. అయితే ఆ నివేదిక కేవలం ముసాయిదా ప్రతి అని, తుది నివేదిక కాదని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యువతలో నిరుద్యోగం 13% నుంచి 27% మధ్య ఉంది. అంటే, ఉద్యోగంలో చేరే యువత సంఖ్య ప్రతి ఏటా దాదాపు కోటీ 20 లక్షల వరకూ తగ్గిపోతోంది. 2018లో దాదాపు కోటీ 10 లక్షల మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారని జనవరి మొదట్లో 'ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' అనే ఓ ప్రైవేటు సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఆహార ఉత్పత్తుల ధరల్లో తగ్గుదల వ్యవసాయ సంక్షోభానికి దారితీసింది. దాని ఫలితమే దేశంలో నిత్యం చూస్తున్న రైతుల ఆందోళనలు. ఉద్యోగావకాశాలు లేవు అనే విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు, తగినన్ని ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గోయల్ తన ప్రసంగం ఆసాంతం మొక్కుబడిగా చెబుతూనే ఉన్నారు. అయితే అసలు సమస్యే లేదంటున్నప్పుడు, ఇంక ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
2014లో ఎలా అయితే ఆశలు కల్పించారో అలాగే ఇప్పుడు పీయూష్ గోయల్ ద్వారా ఆశలు కల్పించేందుకు మోదీ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే దీన్ని ప్రజలు మరోసారి నమ్ముతారా లేదా అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.
(వివేక్ కౌల్ ఆర్థికవేత్త, 'ఈజీ మనీ' పేరుతో మూడు పుస్తకాలు రాశారు)
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








