Araku Balloon Festival : ఒక్కో బెలూన్ ఖరీదు రూ.1.5 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో మూడు రోజుల పాటు నిర్వహించిన బెలూన్ ఫెస్ట్ ఆదివారం ముగిసింది. విదేశాల నుంచి కూడా పైలట్లు ఇక్కడకు వచ్చి ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు.
భారత్‌లో ఇప్పటి వరకు కేవలం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో, ఆగ్రాలో మాత్రమే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినట్టు ఈ-ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సమిత్ తెలిపారు. గంగా నది పుష్కరాల సందర్భంగా లక్నోలో కూడా ఓసారి బెలూన్ ఫెస్టివల్ జరిగిందన్నారు.
అరకు కేంద్రంగా 2017లోనే బెలూన్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేశారు. కానీ, వర్షాల కారణంగా అప్పట్లో బెలూన్‌లు ఎగురవేయడం సాధ్యంకాలేదు. ఈసారి జనవరి 18 నుంచి 3 రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించారు.
ఈ కింది వీడియో చూడండి
అతిపెద్ద బెలూన్ ఫెస్టివల్
గతంలో జరిగిన అన్ని బెలూన్ ఫెస్టివల్స్ కంటే, అరకు బెలూన్ ఫెస్టివల్ పెద్దదని ఏపీ టూరిజం సీఎంఓ ఎం శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. ఈసారి 15 దేశాల నుంచి 21 బెలూన్స్ రైడ్‌లో పాల్గొన్నాయని చెప్పారు. మూడు రోజులపాటు ఫ్లయిట్, టెదరింగ్ నిర్వహించామన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు.
బెలూన్ ఫ్లయిట్‌లో భాగంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజీలాండ్ సహా 15 దేశాలకు చెందిన బృందాలు ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నాయి.
నైట్రోజన్, ఎల్‌పీజీ నింపిన హాట్ ఎయిర్ బెలూన్లు గాలిలోకి ఎగరేయడంతో వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు.

గాలిలో లేచిన తర్వాత బెలూన్‌లో గ్యాస్‌తో పాటుగా, గాలి ప్రవాహ దిశ ఆధారంగా బెలూన్స్ పైకి ఎగిరాయి. కొన్ని బెలూన్స్ అరకు నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లడం విశేషం.
మధ్యలో కొండలు దాటుకుంటూ వెళుతున్న సమయంలో బెలూన్‌లో ప్రయాణం చేసిన వారికి ఊహించనంత ఆనందం కలిగిందని పర్యటకురాలు భూషిత తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

ఒక్కో బెలూన్ రూ. 3 కోట్ల వరకూ
బెలూన్ రైడ్‌కు ఉపయోగించే బెలూన్ ఖరీదు ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆస్ట్రేలియాకి చెందిన ఫిలిప్ తెలిపారు. ప్రస్తుతం అరకు ఫెస్ట్‌లో రూ. 1.5 కోట్ల ఖరీదైన బెలూన్ పాల్గొందని ఆయన అన్నారు. ఒక్కో బెలూన్‌లో రైడ్ కోసం 18 కిలోల ఎల్పీజీ, 2 కిలోల నైట్రోజన్ వినియోగిస్తామని ఫిలిప్ వివరించారు.

తెలుగోడి సత్తా
బెలూన్ రైడ్‌లో కూడా తెలుగు యువకుడు సత్తా చాటుతుండడం పలువురిని ఆనందపరిచింది. గుంటూరుకి చెందిన కరిముల్లా సయ్యద్ బెలూన్ రైడ్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. అరకు ఫెస్ట్‌లో ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ బెలూన్ పైలట్లతో సమన్వయంలో కీలకంగా వ్యవహరించారు.
బెలూన్ రైడ్‌లో భాగంగా ఇప్పటివరకూ 21 దేశాలలో పర్యటించినట్టు కరిముల్లా తెలిపారు. అరకు బెలూన్ ఫెస్ట్ విజయవంతం అయ్యిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
బెలూన్ పైకి ఎగిరినప్పుడే ఎంత ఎత్తుకు వెళ్ళాలి, ఎక్కడి వరకూ వెళ్ళాలి అనే అంశాలపై పైలట్‌కు అవగాహన ఉంటుందన్నారు. అయినప్పటికీ రైడ్‌కి వచ్చిన వారిలో ఉత్సుకత పెంచడం కోసం ఈ వివరాలు ముందుగా చెప్పడం లేదన్నారు.
ప్రపంచంలో అనేక దేశాల్లో బెలూన్ రైడ్‌కి మంచి ఆదరణ లభిస్తోందని వివరించారు. ఒక్క అమెరికాలోనే ఏకకాలంలో 900 బెలూన్లతో ఫెస్టివల్ నిర్వహిస్తారని చెప్పారు.
భారత్‌లోనూ బెలూన్ పైలట్ కావాలనుకునేవారిని ప్రోత్సహించేందుకు ఓ శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తానని కరిముల్లా తెలిపారు.

సాహస క్రీడలకు ఊపు
భారత్‌లో కూడా సాహస క్రీడలకు మంచి ఆదరణ ఉంటుందని, అందులో భాగంగా బెలూన్ రైడ్స్‌తోపాటు పారాగ్లైడర్స్ వంటివాటిని కూడా ప్రోత్సహిస్తున్నామని ఏపీ టూరిజం సీఎంఓ శ్రీనివాసరావు చెప్పారు.
అరకు అందాల మధ్యలో బెలూన్ రైడ్ ఉత్సాహాన్నిచ్చిందని జర్మన్ పైలట్ డోనల్డ్ తెలిపారు. భారత్‌కు తొలిసారిగా వచ్చానని ఇటలీ గ్లైడర్ పస్కలే బియన్దో చెబుతూ, ఇక్కడి ప్రజల ఆదరణ అద్భుతంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










