అరకు: కాఫీ ఆకులతో గ్రీన్ టీ

- రచయిత, శ్యాం మోహన్
- హోదా, బీబీసీ కోసం
అరకు కాఫీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మరి అదే అరకులో కాఫీ ఆకులతో తయారు చేస్తున్న 'టీ' గురించి తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఆరకు, చింతపల్లి వైపు వెళ్తే.. ఎటు చూసినా కాఫీ తోటలు కనిపిస్తాయి.
ఈ అరకు కాఫీకి ఘనమైన చరిత్ర ఉంది. ఇపుడు కాఫీ ఆకులతో చేస్తున్న వెరైటీ చాయ్.. పర్యటకులకు సరికొత్త రుచిని పంచుతోంది.
కాఫీ రైతులకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతోంది.
ఏంటీ చాయ్?
జూన్, జూలై మాసాల్లో కాఫీ మొక్కలు కొత్త చిగుర్లు తొడుగుతుంటాయి. గింజలకు ఎక్కువ పోషకాలు అందడం కోసం, రైతులు ఆకులు, కొమ్మలు విస్తరించకుండా, కత్తిరించి పారేస్తారు.
ఆలా పారేసిన కాఫీ ఆకులను సేకరించి, గ్రీన్ టీగా తయారు చేస్తున్నారు ఒక ప్రవాస భారతీయుడు.
దీంతో ఇప్పటి వరకు కాఫీ గింజలతోనే జీవనోపాధి పొందుతున్న రైతులు.. ఇప్పుడు వృథాగా పడేసే ఆకులతోనూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఈ చాయ్‌లో ఏముంది?
కెఫిన్ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఉండడమే ఈ టీ ప్రత్యేకత.
ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు తయారీ దారులు.
పాలు, పంచదార కలపాల్సిన అవసరం లేదు. కప్పు వేడినీటిలో ఈ టీ పొడి పొట్లాన్ని ముంచి తాగేయడమే.
అరకు చాయ్, కుటి, మార్నింగ్ టీ, రోసెల్లె టీ అనే పేర్లతో నాలుగు రకాల టీలను వినియోగదారులకు అందిస్తున్నారు.
70 శాతం ఎండిన కాఫీ ఆకులు, 12 శాతం అనాస పువ్వు, 10 శాతం నిమ్మగడ్డి, 8 శాతం సోంపు విత్తనాల మిశ్రమంతో అచ్చం 'గ్రీన్ టీ'లానే దీనిని తయారు చేస్తామని తయారీ దారులు వివరించారు.

ఆలోచన ఇలా..
ఈ టీ ఎక్కువగా తాగే ఇథియోపియా ప్రజల్లో డయాబెటీస్ బాధితులు తక్కువగా ఉన్నారని టీ తయారీ సంస్థ నాచురల్ ఫార్మసీ ఇండియా ప్రతినిధి రామన్ మదాల అంటున్నారు.
''మూడేళ్ల కిందట సిలికాన్ వ్యాలీలో ఇథియోపిన్ రెస్టారెంట్‌లో తొలిసారి కాఫీ ఆకుల టీ రుచి చూశాను. దీనిని 'కుటి' అని పిలుస్తారు. ఎండబెట్టిన ఆకులు మరగబెట్టుకొని రోజూ తాగడం ఆ దేశస్తుల సంప్రదాయం. దీన్ని తీసుకోవడం వల్ల ఆ దేశంలో డయాబెటీస్ తక్కువ. భారత్‌లో ఎలాగైనా తయారు చేయాలనే తపనతో రెండేళ్ల క్రితం అరకు, లంబసింగిలో కొన్ని కాఫీ ఆకులు సేకరించి, సిలికాన్ వ్యాలీలో పరిశోధన చేస్తే, ఈ ఆకులు టీపొడికి పనికొస్తాయని తేలింది. అలా 'అరకు చాయ్' మొదలైంది'' అని రామన్ మదాల వివరించారు.

కత్తిరిస్తే కాఫీ దిగుబడి పెరుగుతుందా?
'కాఫీ మొక్కలు ఎదిగే దశలో కొమ్మలు విస్తరించకుండా కత్తిరించాలి. ఈ పని వల్ల వేరే చోట కూలీ పోతుందని చాలా మంది గిరిజనులు పట్టించునేవారు కాదు. దాంతో కాఫీ గింజల దిగుబడి తగ్గిపోయేది. కానీ.. ఇపుడు కత్తిరించి పారేసే ఆకులతోనూ ఆదాయం వస్తుండటం వల్ల అందరూ కత్తిరింపులు చేస్తున్నాం. దాని వల్ల తోటల సంరక్షణతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తోంది' అని చెప్పారు లంబసింగిలోని కాఫీ రైతులు వెంకటలక్ష్మి, చంద్రకళ.
''కాఫీ గింజలు గట్టిపడాలంటే ఏడాదికి రెండు సార్లు ఆకులు కత్తిరించాలి. ఎండబెట్టిన కిలో కాఫీ ఆకులకు రూ. 90 నుండి రూ. 120 వరకు ఇస్తున్నారు' అని రైతు వనపల చిన్నారావు తెలిపారు.

రైతుల భాగస్వామ్యంతో...
''మన్యంలో కాఫీ పండించే వారిలో కొందరు రైతులం సంఘంగా ఏర్పడి ఆకులను సేకరించి కంపెనీకి అమ్మి లాభాలను పంచుకోవాలనుకుంటున్నాం' అని చింతపల్లి రైతు గొబ్బాడ మోహనరాయ అన్నారు.
'ఆకులను శుభ్రపరచడం, ఆరబెట్టుకోవడానికి సోలార్ డ్రయర్లను వాడకంలో శిక్షణ ఇస్తాం. వారు పెంచిన కాఫీ ఆకులను వారితోనే టీ పొడి చేయించి, ఈ ఉత్పత్తిలో వారిని భాగస్వాములను చేసి స్వయం సమృద్ది సాధించే దిశగా రైతులకు సహకరించాలనేది మా లక్ష్యం' అంటారు రామన్ మాదల.

గిరిజన సహకార సంస్థతో ఒప్పందం
'కాఫీ ఆకులతో చేసిన అరకు చాయ్ రుచి చూశాం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న గ్రీన్ టీకి ఇది ప్రత్యామ్నాయం అవుతుంది. కత్తిరించి, పారేసే కాఫీ అకుల వల్ల గిరిజనులకు అదనపు ఆదాయం తెచ్చే ఈ ప్రాజెక్టుని స్వాగతిస్తున్నాం. త్వరలో రామన్ మదాలతో ఒప్పందం చేసుకోబోతున్నాం. మా అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఈ కొత్త టీ వల్ల, మరింత ప్రాచుర్యం వస్తుంది'' అని ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఎండీ బాబారావు నాయుడు బీబీసీ తెలుగుకి చెప్పారు.
గిరిజనుల నుండి ఆకులు సేకరించి కంపెనీకి ఇవ్వడం, వారు తయారు చేసిన అరకు చాయ్‌ని మార్కెట్ చేయడం వీరి ఒప్పందంలో ప్రధాన అంశాలు.
దీని వల్ల గిరిజన సహకార సంస్థ పరిధిలో కాఫీ పండిస్తున్న వందలాది మంది రైతులు లబ్దిపొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఈ అరకు టీని పర్యాటకులకు అందుబాటులో ఉంచింది.

ఆఫ్రికాలో పుట్టి, అరకు వచ్చి..
"ఇథియోపియాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు చెందిన 'కల్డి' అనే పశువుల కాపరి 'కాఫీ' మొక్కను గుర్తించాడు. ఈ కాఫీ ఇథియోపియా నుంచి క్రమంగా అరేబియాకి ద్వీపకల్పానికి విస్తరించింది. 16వ శతాబ్దంలో సూఫి సన్యాసి బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుంచి భారతదేశం తీసుకువచ్చారు.
వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తమ ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగా పండుతోంది.
1898లో ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా పాములేరులో ఈ పంటను పండించారు. అక్కడ్నించి పుల్లంగి, విశాఖ జిల్లా మన్యం గిరిజన ప్రాంతాలకి విస్తరించింది' అని కాఫీ చరిత్రను జీసీసీ మాజీ ఎండీ ఆకెళ్ల రవి ప్రకాశ్ వివరించారు.
కెనడియన్ కంపెనీ ఒక్కటే ఇలాంటి టీని తయారు చేస్తోందని.. భారత్‌లో ఇదే తొలిసారి అని తయారీ దారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









