బడ్జెట్ 2019: ఇవీ 15 ప్రధానాంశాలు

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ

కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఇందులోని 15 ప్రధానాంశాలు ఇవీ...

1) దేశవ్యాప్తంగా రైతులకు ఏడాదికి హెక్టారుకు రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో డబ్బు అందజేత. రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్)' అనే ఈ పథకాన్ని 2018 డిసెంబరు 1 నుంచి వర్తింపజేస్తూ అమలు చేస్తారు. డిసెంబరు నుంచి మార్చి వరకు కాలానికిగాను సొమ్మును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అంటే మార్చి 31లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

2018-19 బడ్జెట్ సవరిత అంచనాల్లో రూ.20 వేల కోట్లు 'పీఎం-కిసాన్' పథకానికి కేటాయించారు. 2019-20 కొత్త బడ్జెట్‌లో రూ.75 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకంతో 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

2) రూ.5 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయంపై పన్ను ఉండదు.

3) ఉద్యోగులకు పదవీ విరమణ, ఉద్యోగం నుంచి తప్పుకునే సమయానికి లభించే గ్రాట్యుటీ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు.

4) రక్షణ శాఖకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు. అవసరమైతే మరిన్ని నిధులు.

5) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60 వేల కోట్ల కేటాయింపు. అవసరమైతే అదనపు కేటాయింపులు.

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

6) ఆహార సబ్సిడీలకు దాదాపు రూ.1.8 లక్షల కోట్ల కేటాయింపు.

7) ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)కు 2018-19 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం కేటాయింపులు రూ.15,500 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.19 వేల కోట్ల కేటాయింపు

8) మహిళల రక్షణ, సాధికారత మిషన్‌కు రూ.1,330 కోట్ల కేటాయింపు. గత 2018-19 సంవత్సరం సవరిత అంచనాలతో పోలిస్తే ఇది రూ.174 కోట్లు ఎక్కువ.

9) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం లబ్ధిదారుల్లో 70 శాతం మందికి పైగా మహిళలు.

10) ఆవుల్లో దేశవాళీ జాతుల అభివృద్ధి, సంరక్షణకు ఉద్దేశించిన 'రాష్ట్రీయ గోకుల్ మిషన్'కు ప్రస్తుత 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్ల కేటాయింపు. ఆవులకు సంబంధించి జన్యు అభివృద్ధికి, ఆవుల సంతానోత్పత్తిని పెంచేందుకు 'రాష్ట్రీయ కామధేను ఆయోగ్' ఏర్పాటు. ఆవుల సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాల సమర్థ అమలును పర్యవేక్షించే బాధ్యత ఈ ఆయోగ్‌దే.

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంటులో బడ్జెట్ సమర్పణకు ముందు బడ్జెట్ పత్రాలకు రక్షణగా భద్రతా సిబ్బంది

11) మత్స్య రంగంపై ఆధారపడిన దాదాపు 1.45 కోట్ల మంది జీవనోపాధి మెరుగుపరచేందుకు తోడ్పడేలా ప్రత్యేకంగా మత్స్యశాఖ ఏర్పాటు.

12) ప్రపంచంలోకెల్లా రహదారులను అత్యంత వేగంగా నిర్మిస్తున్న దేశం భారతే. రోజుకు 27 కిలోమీటర్ల చొప్పున రహదారుల నిర్మాణం.

13) గత ఐదేళ్లలో రూ.4.6 శాతానికి తగ్గిన సగటు ద్రవ్యోల్బణం. ప్రస్తుత ఎన్‌డీఏ హయాంలో తప్ప మరే ప్రభుత్వ హయాంలోనూ ఇది ఇంత తక్కువగా లేదని, ఇదే అత్యల్పమని పీయూష్ గోయల్ చెప్పారు. డిసెంబరులో ద్రవ్యోల్బణం 2.19 శాతానికి పడిపోయింది.

14) 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు(ఫిస్కల్ డెఫిసిట్) సవరించిన అంచనాల ప్రకారం 3.4 శాతం. ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని 'ద్రవ్య లోటు' అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

15) 2018-19 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రెండున్నర శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)