సీఈఎస్: ఈ కారుకు కాళ్లున్నాయ్.. నడుస్తుంది కూడా

ఫొటో సోర్స్, HYUNDAI
కార్ల తయారీ సంస్థ హుందాయ్ ఓ సరికొత్త కారును రూపొందించింది. ఈ కారుకు రోబోటిక్ కాళ్లున్నాయి.
ఇది సాధారణ రోడ్ల మీద చక్రాలతో వెళ్తుంది. రాళ్లు రప్పలున్న ప్రాంతాల్లో మాత్రం తన 'కాళ్ల'కు పనిచెప్తుందని హుందాయ్ తెలిపింది.
ఎగుడుదిగుడుగా ఉండే ప్రదేశాల్లో ఈ కారుకు ఉండే రోబోటిక్ కాళ్లు తెరుచుకుంటాయి.
ఆ కాళ్ల సాయంతో గంటకు 5 కిలోమీటర్ల దూరం నడవగలదు. అలా 5 అడుగుల గోడను సైతం దాటుకుంటూ వెళ్లగలదు. ఒకేసారి 5 అడుగుల దూరం దూకగలదు.
ఈ కారును అమెరికాలోని లాస్ వెగాస్‌లో తాజాగా నిర్వహించిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో ఆవిష్కరించింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సహాయక చర్యల కోసం ఈ కారు ఉపయోగపడుతుందని హుందాయ్ వివరించింది.
"సునామీ, భూకంపం, వరదల్లాంటి ప్రకృత్రి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవనాలు కూలిపోతుంటాయి. అలాంటప్పుడు ఆ శిథిలాల్లో చిక్కుకున్న వారికి తక్షణ సాయం అందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలు సహాయక బృందాలను శిథిలాల దగ్గరికి మాత్రమే తీసుకెళ్లగలవు. ఆ తర్వాత వాళ్లు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది."
"ఇలాంటి రోబోటిక్ కాళ్లున్న కారు శిథిలాల్లో, బురదలోనూ ప్రయాణిస్తుంది. దాంతో క్షతగాత్రులకు ఘటనా స్థలం నుంచి వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు వీలవుతుంది’’ అని హుందాయ్ ఉపాధ్యక్షుడు జాన్ సుహ్ వివరించారు.
అలాగే, వైకల్యం వల్ల నడవలేని వారిని ఇంటి గుమ్మం దాకా వెళ్లి ఈ కారు తీసుకువస్తుందని సుహ్ చెప్పారు.

ఫొటో సోర్స్, HYUNDAI
ఈ కారు ఆవిష్కరణల గురించి ఆస్టన్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్. డేవిడ్ బెయిలీ మాట్లాడుతూ.. "కార్ల తయారీ సంస్థలు ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలు చేస్తుంటాయి. ఆ ఆలోచనలు నిజంగానే ఆచరణ రూపం దాల్చుతాయో లేవో చెప్పలేం. కానీ, ఇలా సహాయక చర్యలను వేగవంతం చేసే దిశగా ఆలోచించడం గొప్ప విషయం" అన్నారు.
నిజంగా ఇలాంటి వాహనాలు అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో ఎంతో సాయపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇలాంటి సాంకేతికతల విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని ప్రొఫెసర్ డేవిడ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
- ఎప్పుడు పుట్టామన్నదే.. ఎంతకాలం బతుకుతామన్నది నిర్ణయిస్తుందిలా
- రూపాయిన్నర కోసం.. రైలు పట్టాలపై ప్రాణాలు పణంగా..
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- బిహార్‌లో ఆంధ్రా చేపల కలకలం: రసాయనాలు పూసిన చేపలు తినొచ్చా.. తినకూడదా
- PUBG: ఈ ఆటకు ఎందుకంత క్రేజ్? ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
- క్యాథలిక్ చర్చిల్లో మతాచార్యుల ఆధిపత్యం: ‘వాళ్లు చెప్పినదానిని గొర్రెల్లా అనుసరించాలి.. అంతే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








