మాయావతి - ములాయం సింగ్ బద్ధ శత్రువులు ఎందుకయ్యారు... ఆరోజు గెస్ట్ హౌజ్‌లో ఏం జరిగింది?

మాయా-ములాయం
    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

ఇది 2019 లోక్‌సభ ఎన్నికల వరకే కాదని, శాశ్వతంగా కలిసి నడుస్తామని బీఎస్పీ సుప్రీమో మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 38-38 స్థానాల్లో పోటీ చేస్తామని రెండు పార్టీలూ చెప్పాయి. రాయ్‌బరేలీ, అమేథీ సీట్ కాంగ్రెస్ కోసం విడిచిపెట్టాయి. మరో రెండు స్థానాలను సహచర పార్టీలకు ఇచ్చాయి.

ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన మాయావతి ఆనాటి గెస్ట్ హౌస్ గొడవను ప్రస్తావించడం మాత్రం మర్చిపోలేదు.

దేశప్రయోజనం కోసమే తాము ఆ గొడవను పక్కన పెట్టామని మాయావతి స్పష్టం చేశారు.

"1993 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అప్పుడు ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఆ పొత్తు కొన్ని తీవ్రమైన కారణాల వల్ల ఎక్కువ కాలం నడవలేకపోయింది. దేశ ప్రయోజనాల కోసం 1995లో జరిగిన లక్నో గెస్ట్ హౌస్ గొడవను పక్కన పెట్టాలనుకున్నాం. రెండు పార్టీలు సఖ్యతతో ఉండాలని నిర్ణయించాం" అని మాయావతి అన్నారు.

మాయా-ములాయం

ఫొటో సోర్స్, Getty Images

ఎస్పీతో దూరం ఎందుకు పెరిగింది?

కానీ రెండు పార్టీల స్నేహం హఠాత్తుగా శత్రుత్వంగా మారిపోయేంతగా అప్పట్లో లక్నో గెస్ట్ హౌస్‌లో ఏం జరిగింది.

అది తెలుసుకోవాలంటే మనం 28 ఏళ్ల ముందుకు వెళ్లాల్సుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 1995, గెస్ట్ హౌస్ గొడవ రెండూ చాలా కీలకం అయ్యాయి.

భారత రాజకీయ ముఖచిత్రమే మారిపోయేంతగా, ఆరోజు మాయావతి, ములాయం మధ్య అగాథం ఏర్పడింది.

నిజానికి 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదే రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోడానికి వ్యూహాత్మకంగా బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలిపారు.

మాయా-ములాయం

ఫొటో సోర్స్, Mehdi hassan

గెస్ట్ హౌస్ గొడవ ఎందుకు?

ఎస్పీ 256, బీఎస్పీ 164 స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. ఎస్పీ 109 సీట్లు గెలుచుకోగా, 67 స్థానాల్లో బీఎస్పీ విజయం సాధించింది. కానీ రెండు పార్టీల పొత్తు చాలా రోజులు సాగలేకపోయింది.

1995 వేసవిలో రెండు పార్టీల పొత్తుకు తెరపడే సమయం వచ్చింది. దీన్లో గెస్ట్ హౌస్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ రోజు జరిగిన ఘటనతో బీఎస్పీ ప్రభుత్వానికి తమ మద్దతు వెనక్కు తీసుకుంది. ఎస్పీ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసింది.

మాయావతికి బీజేపీ అండగా నిలిచింది. బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని అప్పటి స్పీకర్ మోతీలాల్ వోరాకు కొన్ని రోజుల్లోనే లేఖ అందింది.

సీనియర్ విలేకరి, గొడవ జరిగిన ఆ రోజు గెస్ట్ హౌస్ బయట ఉన్న శరత్ ప్రధాన్ బీబీసీతో "ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు బీఎస్పీ వారికి మద్దతిచ్చింది. కానీ ప్రభుత్వంలో భాగం కాలేదు" అని చెప్పారు.

"రెండు పార్టీల పొత్తు ఏడాదంతా నడిచింది. తర్వాత మాయావతి బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత కొంత కాలానికే మాయావతి ఎస్పీకి తన నిర్ణయం తెలిపారు".

మాయా-ములాయం

ఫొటో సోర్స్, COURTESY BADRINARAYAN

గెస్ట్ హౌస్‌లో బీఎస్పీ సమావేశం

"మద్దతు వెనక్కు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత మాయావతి గెస్ట్ హౌస్‌లో తమ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. దీంతో బీఎస్పీ, బీజేపీ కలుస్తున్నాయని, ఆమె తమతో పొత్తు తెంచుకుంటోందని ఎస్పీ నేతలకు ఎలాగోలా సమాచారం అందింది".

"సమాచారం తెలీగానే ఎస్పీ నేతలు పెద్ద సంఖ్యలో గెస్ట్ హౌస్ బయట గుమిగూడారు. కొంత సేపటికి గెస్ట్ హౌస్ లోపల గదిలో సమావేశం జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న బీఎస్పీ నేతలను కొట్టడం మొదలు పెట్టారు. అదంతా మా కళ్ల ముందే జరిగింది" అని ప్రధాన్ చెప్పారు.

"దాంతో మాయావతి వేగంగా పారిపోయి ఒక గదిలో దాక్కున్నారు. లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సికిందర్ రిజ్వీ. ఆ సమయంలో పేజర్లు ఉండేవి. రిజ్వీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవద్దని నాకు పేజర్‌లో మెసేజ్ పంపించారు" అన్నారు.

"తలుపును కొడుతున్నారు. బీఎస్పీ నేతల్లో చాలా మందిని బాగా కొట్టారు. వారిలో కొంతమందికి రక్తం కారుతోంది. కొంతమంది మాత్రం పారిపోగలిగారు".

"అప్పుడు బీఎస్పీ నేతలు పోలీసులకు కూడా ఫోన్ చేశారు. కానీ అప్పుడు ఎవరూ ఫోన్ తీయలేదు" అని ప్రధాన్ చెప్పారు.

మాయా-ములాయం

ఫొటో సోర్స్, Getty Images

మాయావతి గదిలో దాక్కోగానే..

"ఈలోపు ఎస్పీ కార్యకర్తలు మాయావతి దాక్కున్న గది తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. వాళ్ల నుంచి కాపాడుకోవడానికి లోపల ఉన్న వాళ్లు తలుపులకు సోఫాలు, టేబుళ్లు అడ్డం పెట్టారు. తలుపులు ఎవరూ లోపలికి రాకుండా చేయాలని అనుకున్నారు".

సీనియర్ జర్నలిస్ట్ రామ్ దత్త్ త్రిపాఠీ ఈ ఘటనతో దిల్లీకి లింకుంది అని చెబుతారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు అందరికీ షాక్ తగిలింది. తర్వాత 1993లో బీజేపీని అడ్డుకోడానికి ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ములాయంను ముఖ్యమంత్రి చేశాయి.

దాంతో లక్నోలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలిస్తే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయని బీజేపీ భావించింది.

అందుకే బీజేపీ నుంచి బీఎస్పీకి ఆఫర్ వెళ్లింది. ఎస్పీతో పొత్తు వదులుకుంటే బీజేపీ మద్దతుతో మాయావతికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని చెప్పారు.

ములాయంకు అదే సందేహం వచ్చింది. ఆయన సభలో కూడా తన మెజారిటీ నిరూపించుకోవాలని అనుకున్నారు. కానీ స్పీకర్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు.

మాయా-ములాయం

ఫొటో సోర్స్, SANJAY SHARMA

మాయాను ఎవరు కాపాడారు?

ఇదంతా జరుగుతున్నప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలు అందరూ స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమావేశం అయ్యారు. మాయావతి కూడా అక్కడికి వచ్చారు. అప్పుడే ఎస్పీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు.

ఎస్పీ నేతలు అప్పుడు మాయావతిని కిందకు తోసేశారని బీఎస్పీ ఆరోపించింది. ఆమెపై హత్యాయత్నం జరిగిందిని కేసు పెట్టింది. దాన్నే గెస్ట్ హౌస్ గొడవ అంటారు.

ఆ సమయంలో బీజేపీ నేతలు మాయావతిని కాపాడ్డానికి అక్కడకు చేరుకున్నారని చెబుతారు. కానీ శరత్ ప్రధాన్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు.

"మాయావతి మీడియా వల్లే బయటపడ్డారు. ఆ సమయంలో గెస్ట్ హౌస్ బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎస్పీ నేతలు అక్కడి నుంచి మీడియాను పంపించేయాలని ప్రయత్నించారు. కానీ అది వారికి సాధ్యం కాలేదు" అన్నారు.

మాయా-ములాయం

ఫొటో సోర్స్, Getty Images

హత్య చేయాలనుకున్నారు-మాయావతి

గెస్ట్ హౌస్ గొడవ జరిగిన తర్వాత రోజే బీజేపీ నేతలు స్పీకర్ దగ్గరికి వెళ్లారు. బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపారు.

అప్పుడే కాన్షీరాం మాయావతిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచే మాయా ఒక్కో మెట్టూ ఎక్కడం ప్రారంభించారు.

ఆ రోజు జరిగిన గొడవ గురించి మాయవతి ఎప్పుడైనా బహిరంగంగా చెప్పారా? అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించారా?

సమాధానంగా "ఆ.. చాలాసార్లు చెప్పారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆమె స్వయంగా ఆ విషయం చెప్పారు. ఆరోజు తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్నారు అని ప్రధాన్ తెలిపారు.

"ఆ రోజు గెస్ట్ హౌస్‌లో జరిగిన గొడవల వల్ల తన ప్రాణాలే పోయేవన్న విషయం మాయావతి మర్చిపోలేకపోయారు కాబట్టే మాయావతికి సమాజ్ వాదీ పార్టీ అంటే ద్వేషం అని భావిస్తారు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)