‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ బీఎండబ్ల్యూ కారులాంటి వారు’: సంజయ్ బారు

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు మాటల ప్రకారం, మన్మోహన్ సింగ్, సోనియాల మధ్య సంబంధాలకు మొదటి పరీక్ష 2004, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగం ఇవ్వాల్సిన సందర్భంగా ఎదురైంది.

ఆ ప్రసంగానికి ఒక రోజు ముందు మన్మోహన్ సింగ్ డ్రెస్ రిహార్సల్‌లో పాల్గొన్నారు. ఎర్రకోట చేరుకున్న తర్వాత ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌ను చూశారు.

వేదికకు కొంచెం ముందు ఆయన భార్య గురుశరణ్ కౌర్ కుర్చీ ఉంది. ఆ తర్వాత సీనియర్ కేబినెట్ మంత్రులు, విపక్ష నేత, ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుర్చీలు వరుసగా ఉన్నాయి. మొదటి వరుసలో సోనియా గాంధీ కుర్చీ లేదు.

సంజయ్ బారు రక్షణ శాఖ అధికారులను సోనియా సీటు గురించి ప్రశ్నించినపుడు వాళ్లు ఐదో వరుసలోనో ఆరో వరుసలోనో నజ్మా హెప్తుల్లా సీటు పక్కన వేసి ఉన్న సోనియా సీటును చూపించారు.

ఇది చూసి బారు ఆశ్చర్యపోయారు. ఇది మన్మోహన్ సింగ్‌కు చాలా ఇబ్బందిగా ఉంటుందని, సోనియా గాంధీ కూడా దీనిని చాలా అవమానకరంగా భావిస్తారని అనుకున్నారు.

అయితే, సోనియా సీటును వెంటనే ముందుకు మార్చడం, ఆమె కేబినెట్ మంత్రులతో కలిసి కూర్చోవడంతో పెద్ద ఉపద్రవం తప్పింది.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ

సంజయ్ బారు తన పుస్తకం 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్'లో మన్మోహన్ సింగ్ దృష్టిలో ప్రధాని పదవికన్నా పార్టీ అధ్యక్ష పదవికే ప్రాధాన్యం ఉండేదని చెబుతారు.

మన్మోహన్ సింగ్, సోనియాల మధ్య ఘర్షణపూర్వక వైఖరి ఉండేదా అని నేను సంజయ్ బారును ప్రశ్నించాను.

దీనికి సమాధానంగా ఆయన, ''లేదు. వాళ్లిద్దరి మధ్యా మంచి సుహృద్భావ సంబంధాలు ఉండేవి. మన్మోహన్ సింగ్ సోనియాను గౌరవించేవారు. ఆమె మన్మోహన్ సింగ్‌ను ఒక పెద్ద మనిషిలా చూసేవారు. కానీ, మన్మోహన్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవి ప్రధాని పదవికన్నా పెద్దదని భావించేవారు.'' అని తెలిపారు.

''1950లలో ఆచార్య కృపలానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నపుడు, ఆయన నెహ్రూతో 'నీ ప్రభుత్వంతో ఏం జరుగుతుందో నాకు తెలియాలి' అన్నారు. దీనికి నెహ్రూ 'ఈ విషయంలో నేను మీకు ఏమీ చెప్పలేను' అని సమాధానం ఇచ్చారు.''

''ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే నా కేబినెట్‌లో మంత్రిగా చేరండి అన్నారు. శాఖ లేకుండా ఆయనకు మంత్రి పదవి ఇస్తానని కూడా ఆఫర్ చేశారు. కానీ కృపలానీ దానిని తిరస్కరించారు.''

''కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశాక, ప్రధాని పదవి పార్టీ అధ్యక్షుడి పదవికన్నా చాలా ఎక్కువని కృపలానీ గుర్తించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి, పార్టీ అధ్యక్షురాలి పదవికన్నా తక్కువ అని భావించడం నా దృష్టిలో చాలా తప్పు'' అన్నారు సంజయ్ బారు.

ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్

ఫొటో సోర్స్, The Accidental Prime Minister Poster

మంత్రులను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ లేదు

''తన టీమ్‌ను తానే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా మన్మోహన్ సింగ్‌కు లేదు. రోజూ ఆయనకు అహ్మద్ పటేల్ లేదా పులక్ ఛటర్జీ ద్వారా సోనియా గాంధీ నుంచి ఆదేశాలు అందేవి. క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్న జాబితా సోనియా గాంధీ పంపేవారు.''

''ఒకసారి మంత్రిమండలిలో మార్పులు చేయాలని మంత్రుల జాబితాను రాష్ట్రపతికి ఇవ్వడానికి మొదట మన్మోహన్‌ సింగ్‌కు ఆ జాబితాను ఇచ్చారు. రెండో జాబితా టైప్ చేయడానికి సమయం లేదు. చివరి నిమిషంలో ఆ జాబితాలో మార్పులు చేయాల్సి రావడంతో ఆ లిస్టులో ఒకరి పేరుపై వైట్‌నర్ పూసి, మరొకరి పేరు రాశారు.''

''అలా హరీష్ రావత్ (తర్వాత ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు) పేరు తొలగించి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ పథకాల వల్ల వచ్చే మంచి పేరు కూడా ప్రధానికి కాకుండా పార్టీకి రావాలని సోనియా ప్రయత్నించేవారు.''

దీని ద్వారా సోనియా మన్మోహన్ సింగ్‌కు బాస్ ఎవరో తెలియజెప్పే ప్రయత్నం చేశారా?

దీనికి జవాబుగా బారు, ''సోనియా గాంధీ కాదు కానీ, ఆ పని ఇతర పార్టీ నాయకలు చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ప్రధానికన్నా పార్టీ పెద్దదని ఆమె భావించేవారు. అలాంచి చర్చలు పార్టీలో జరిగేవి.''

''రాజకీయంగా ఇద్దరూ కలిసే పని చేసినా.. సోనియా, మన్మోహన్ సింగ్‌ల మధ్య చాలా సామాజిక అంతరం ఉండేది. అందువల్ల వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు కలవలేకపోయారు.''

''వారిద్దరి కుటుంబాల మధ్య సంబంధాలు ఉండేవి కావు. వాళ్లిద్దరూ ఎప్పుడైనా కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారని నేను అనుకోను. మన్మోహన్ సింగ్ కూతుళ్లు ఎప్పుడూ రాహుల్ గాంధీతో కానీ, ప్రియాంక గాంధీతో కానీ మాట్లాడ్డం నేను చూడలేదు,'' అని బారు తెలిపారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

లలిత్ నారాయణ్ మిశ్రాతో వివాదం

పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తన కెరీర్ ప్రారంభించిన మన్మోహన్ సింగ్ తర్వాత కాలంలో భారతదేశంలో ఎగుమతులు, దిగుమతులపై కేంబ్రిడ్జిలో రీసెర్చ్ చేశారు. కేంబ్రిడ్జి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయను విదేశీ వాణిజ్య విభాగంలో సలహాదారుగా నియమించారు.

మన్మోహన్ సింగ్ కూతురు దమన్ సింగ్ ఆయన జీవిత చరిత్ర 'స్ట్రిక్ట్‌లీ పర్సనల్ : మన్మోహన్ అండ్ గురుశరణ్'లో ''మా నాన్నగారు చాలా గర్వంగా భారతదేశం విదేశీ వాణిజ్యం గురించి తన కన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరూ లేరని చెప్పేవారు. అప్పుడు లలిత్ నారాయణ్ మిశ్రా ఆయన మంత్రిగా ఉండేవారు'' అని తెలిపారు.

''ఒకసారి మిశ్రాకు మా నాన్నపై కోపం వచ్చింది. ఎందుకంటే నాన్న కేబినెట్‌కు పంపిన నోట్‌తో ఆయన ఏకీభవించలేదు. దీంతో నాన్నగారు తాను తిరిగి ప్రొఫెసర్‌గా వెళ్లిపోతానని అన్నారు.''

''ఇందిరా గాంధీకి సెక్రటరీగా ఉన్న హక్సర్‌కు దీని గురించి తెలిసి, మీరు వెళ్లిపోవడానికి వీల్లేదు అన్నారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. అలా ఒక ఘర్షణ ఆయనకు ప్రమోషన్‌ను తెచ్చి పెట్టింది''.

పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Prashant Panjiar/The India Today Group/Getty Image

ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసుకున్న పీవీ

ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రణాళికా సంఘం ఛైర్మన్‌గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా పని చేశారు. 1991లో ప్రధాని నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా నియమించారు.

పీవీ జీవితచరిత్ర రాసిన వినయ్ సీతాపతి దీని గురించి: ''పీవీ వద్ద ఆలోచలకు కొదవ లేదు. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి, స్వదేశంలోని తన ప్రత్యర్థులను సమాధానపరచగలిగే ఒక ముఖం ఆయనకు కావాల్సి వచ్చింది.'' అని వివరించారు.

1991లో పీసీ అలెగ్జాండర్ పీవీ ప్రధాన సలహాదారుగా ఉండేవారు.

ఆయనను పిలిచి పీవీ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న ఒక వ్యక్తి కావాలి అని కోరారు. అలెగ్జాండర్ గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పని చేసి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్‌గా ఉన్న ఐజీ పటేల్ పేరును సూచించారు.

అయితే, దిల్లీకి రావడం ఇష్టం లేని పటేల్ పీవీ ఆఫర్‌ను అంగీకరించలేదు. దీంతో అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్ పేరును సూచించారు. జూన్ 20న ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పారు.

సంజయ్ బారు

ఫొటో సోర్స్, Sipra Das/The India Today Group/Getty Images

ఫొటో క్యాప్షన్, సంజయ్ బారు

ఆర్థిక మంత్రిగా ఎంచుకున్న విషయం చెప్పినపుడు ఆయన నిద్ర పోతున్నారు

‘'ఫోన్ చేసిన సమయంలో మన్మోహన్ సింగ్ విదేశాల నుంచి తిరిగి వచ్చి నిద్రపోయి ఉన్నారు. ఆయనను నిద్ర లేపి, మీరు ఆర్థిక మంత్రి అని చెప్పగానే, మొదట ఆయన దీన్ని నమ్మలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే పీవీయే సరాసరి తనకు ఫోన్ చేసి చెబుతారని మన్మోహన్ భావించారు.''

''ఆ మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు మన్మోహన్ సింగ్ యూజీసీ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు ఆయనకు పీవీ నుంచి ఫోన్ వచ్చింది.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణస్వీకారం ఉందని. ఒక గంట ముందు నా దగ్గరకు వస్తే, మీరు మాట్లాడాల్సిన మాటల గురించి నేను వివరిస్తానని పీవీ అన్నారు.''

''మన్మోహన్ ప్రధాని నివాసానికి వెళ్లినపుడు పీవీ ఆయనతో, 'ఒకవేళ మనం విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మనిద్దవరికీ దక్కుతుంది. లేదంటే తప్పు మొత్తానికి బాధ్యుడిగా మారతావు' అని హెచ్చరించారు.''

పీవీ మాటలను సవాలుగా తీసుకున్న మన్మోహన్ సింగ్, తాను భారతదేశపు అత్యంత విజయవంతమైన ఆర్థికమంత్రిగా పేరు తెచ్చుకుంటానని హామీ ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ చాలా అంతర్ముఖుడని సంజయ్ బారు అంటారు.

''ఆయనకు చాలా సిగ్గు, మొహమాటం. ఇతరులు మాట్లాడుతుంటే, తాను మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన చాలా సంతోషించేవారు. అంతర్జాతీయ సమావేశాలలో ఎక్కువగా మాట్లాడే అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ లాంటి వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం.'' అని బారు తెలిపారు.

ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Mail Today

గుడ్డు ఉడికించడం కూడా రాదు

మన్మోహన్ సింగ్ కూతురు దమన్ సింగ్ ఆయనలోని మరో కోణాన్ని చూపుతారు.

తన పుస్తకంలో దమన్ సింగ్, ''ప్రతి రెండునెలలకోసారి మా కుటుంబం మొత్తం కలిసి ఎక్కడైనా బైటికి వెళ్లి తినేవాళ్లం. కమలానగర్‌లోని కృష్ణా స్వీట్స్‌లో దక్షిణాది ఫుడ్ కావచ్చు లేదా దరియా గంజ్‌లోని తందూరీలో మొఘలాయ్ కావచ్చు. చాట్ తినాలంటే బెంగాలీ మార్కెట్‌కు వెళ్లేవాళ్లం'' అని తెలిపారు.

''మా నాన్నగారికి గుడ్డు ఉడకబెట్టడం కానీ, టెలివిజన్ ఆన్ చేయడం కానీ వచ్చేది కాదు. మాకు ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన కారులో కూర్చునే అవకాశమే చిక్కలేదు. మేం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, అది ఆయన వెళ్లే దారిలో ఉన్నా సరే, ఆయన మమ్మల్ని ప్రభుత్వ వాహనంలో అనుమతించేవారు కాదు.'' అని దమన్ సింగ్ తెలిపారు.

మన్మోహన్ సింగ్‌కు సొంతంగా ప్రసంగాలు చేయడం అసలు వచ్చేది కాదు. ఆయన గొంతు చాలా సన్నగా ఉండేది. అందువల్ల ఏదైనా విషయాన్ని ఆయన గట్టిగా చెప్పలేకపోయేవారు. దేశప్రజలను ఉద్దేశించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే మొదట చాలా ప్రాక్టీస్ చేసేవారు.

''2004లో మొదటిసారి ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినపుడు, తన ప్రసంగాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు. అయితే క్రమంగా బాగా మాట్లాడ్డం రావడంతో ఆ ప్రాక్టీస్ మానేశారు. ఆయన హిందీ చదవడం వచ్చేది కాదు. ఆయన తన ప్రసంగాన్ని ఉర్దూలో కానీ, గురుముఖిలో కానీ రాసుకునేవారు.'' అని సంజయ్ బారు వివరించారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

'అండర్ రేటెడ్' రాజకీయ నాయకుడు

2012లో మన్మోహన్ సింగ్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ''ఆయన ఒక 'ఓవర్ రేటెడ్' ఆర్థికవేత్త అవునో కాదో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా ఆయన ఒక 'అండర్ రేటెడ్' రాజకీయ వేత్త,'' అన్నారు.

''ఆయన కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌లో చదివి, తన థీసిస్ ప్రచురించాక ఆయన ఎలాంటి పుస్తకమూ రాయలేదు. అదే రాజకీయవేత్తగా మారి రాజకీయాల్లోకి వచ్చాక ప్రధానిగా పదేళ్లు పాలించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ఇంత కాలం పరిపాలించింది మన్మోహన్ ఒక్కరే'' అని బారు చెబుతారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

మన్మోహన్ సింగ్‌కూ కోపం వస్తుంది

ఆయన మెతక వైఖరి చూస్తే, చాలా మందికి అసలు ఆయనకు కోపం వస్తుందా అన్న అనుమానం కలుగుతుంది.

''ఆయనకు చాలా అరుదుగా కోపం వచ్చేది. కోపం వస్తే ఆయన మొహం ఎర్రగా మారేది. రెండు మూడుసార్లు నాపై కూడా కోప్పడ్డారు. ఆ సమయంలో ఆయన గొంతు పెరిగేది. ఒకసారి సోనియా గాంధీ లేఖను లీక్ చేసినందుకు జైరామ్ రమేష్‌పై ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎదురుగానే ఆయనకు ఫోన్ చేసి కోప్పడ్డారు. అవతలి నుంచి ఆయన ఏదో చెప్పబోతుంటే కూడా వినకుండా ఫోన్ విసిరి పారేశారు.'' అని బారు తెలిపారు.

ప్రధాని సలహాదారు పదవి ఎంత కష్టమైనదని నేను బారును అడిగాను.

''మొదటిసారి ప్రధాని పదవీకాలంలో ఆయనకు చాలా మంచి ఇమేజ్ ఉండేది. అందుకే నాకు కష్టం అనిపించలేదు. ఆయన బీఎండబ్యూ కారులాంటి వారు. ఆ కారు ఎంత మంచిదంటే దాన్ని అమ్మడానికి సేల్స్ మ్యాన్ అవసరం లేదు.''

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Hindustan Times

మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి

మన్మోహన్ సింగ్, వాజ్‌పేయిల పనితీరును పోలుస్తూ బారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ఆయన ప్రధాన కార్యదర్శి ప్రధానిలా బాధ్యతలు నిర్వహించేవారు. అదే మన్మోహన్ సింగ్ హయాంలో ప్రధానే కార్యదర్శిలా పని చేసేవారు.

దీని గురించి వివరిస్తూ బారు, ''మాలో చాలా మంది వాజ్‌పేయితో కూడా కలిసి పని చేశారు. వాళ్లంతా వాజ్‌పేయిలో రాజకీయవేత్త ఎక్కువగా, కార్యనిర్వాహకులు తక్కువగా ఉన్నారని అనేవాళ్లు. అదే మన్మోహన్ సింగ్ విషయానికి వస్తే ఆయన ఎక్కువగా కార్యనిర్వాహకులు, తక్కువ రాజకీయవేత్త.''

''వాజ్‌పేయి సూచనలన్నీ చేసి, పనిని తన అధికారులకు అప్పగించి వెళ్లిపోయేవారు. ఒక విధంగా బ్రజేశ్ మిశ్రానే అనధికారిక ప్రధానిగా వ్యవహరించేవారు. కానీ మన్మోహన్ సింగ్ పని తీరు వేరు. ఆయన సమావేశాలలో ఎక్కువ సమయం వెచ్చించేవారు.''

''నరేగా, భారత్ నిర్మాణ్, సర్వ శిక్ష అభియాన్.. ఇలా ఏ సమావేశమైనా సరే, మన్మోహన్ సింగ్ అక్కడ ఉండాల్సిందే. నిజానికి ఆ పని కేబినెట్ కార్యదర్శి లేదా ప్రధానమంత్రి కార్యదర్శి చేయవచ్చు. దానికి ప్రధాని అవసరం లేదు.'' అన్నారు బారు.

''నేను తరచుగా ఆయనతో.. బ్రజేశ్ మిశ్రా ప్రధానిలా పని చేస్తే, మీరేమో ప్రధాని అయి ఉండి కార్యదర్శిలా పని చేస్తున్నారు అని వేళాకోళం చేసేవాణ్ని'' అని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)