గూగుల్ హెచ్చరిక: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే డేటా డేంజర్లో పడ్డట్టే - ప్రెస్‌రివ్యూ

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తెలిపినట్లు సాక్షి సహా ప్రధాన తెలుగు పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా ఈ విషయాన్ని ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ మొదట రిపోర్టు చేసినట్టు సాక్షి ప్రచురించింది.

'ఫుల్‌ స్క్రీన్‌ యాడ్స్‌ను ప్రజెంట్‌ చేస్తూ, డివైస్‌ స్క్రీన్‌ అన్‌లాకింగ్‌ పనితీరును గమనించే ఇటువంటి యాప్‌లు చాలా ప్రమాదకరం.

అయితే ఇప్పటికే ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌ అనే యాప్‌ను యూజర్లు 50 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ చేశారు. అంతేకాదు ఇటువంటి మరిన్ని 85 హానికారక యాప్‌లు కూడా 9 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఈ యాప్‌లు ఓపెన్‌ చేసిన ప్రతిసారీ ఫుల్‌ స్క్రీన్‌ యాడ్‌ డిస్‌ప్లే అవుతుంది. దాని నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్‌ నొక్కమంటూ ఆప్షన్స్‌ వస్తూనే ఉంటాయి.

అలా అనేక రకాల వెబ్‌పేజీల్లోకి మన వివరాలు వెళ్లిపోతాయి. యాప్‌ క్రాష్‌ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుందని కథనంలో తెలిపారు.

అదే సమయంలో మన ఫోన్‌ లాక్‌ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది' అని ట్రెండ్‌ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులోని కథనం ద్వారా చెప్పారు.

ఇక గూగుల్‌ ఇలా హానికారక యాప్‌లను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబరులో 13, డిసెంబరులో మరో 22 ఫేక్‌ యాప్‌లను తొలగించిందని సాక్షి కథనం తెలిపింది.

మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు

  • స్పోర్ట్‌ టీవీ
  • ప్రాడో పార్కింగ్‌ సిములేటర్‌ 3డీ
  • టీవీ వరల్డ్‌
  • సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్‌
  • అమెరికన్‌ మజిల్‌ కార్‌
  • ఐడిల్‌ డ్రిప్ట్‌
  • టీవీ రిమోట్‌
  • ఏసీ రిమోట్‌
  • బస్‌ డ్రైవర్‌
  • లవ్‌ స్టిక్కర్స్‌
  • క్రిస్‌మస్‌ స్టిక్కర్స్‌
  • పార్కింగ్‌ గేమ్‌
  • బ్రెజిల్‌ టీవీ
  • వరల్డ్‌ టీవీ
  • ప్రాడో కార్‌
  • చాలెంజ్‌ కార్‌ స్టంట్స్‌ గేమ్‌
  • యూకే టీవీ
  • ఫొటో ఎడిటర్‌ కొలాగ్‌ 1
  • మూవీ స్టిక్కర్స్‌
  • రేసింగ్‌ కార్‌ 3డీ
  • పోలీస్‌ చేజ్‌
  • ఫ్రాన్స్‌ టీవీ
  • చిలీ టీవీ
  • సౌతాఫ్రికా టీవీ మొదలైనవాటిని పేర్కొంది.
పవన్ కల్యాన్

ఫొటో సోర్స్, JANASENA / FACEBOOK

సామాజిక ప్రయోగంతో దూసుకుపోయాం-పవన్

'2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశానని, అందుకే జనసేన దూసుకుపోయిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఎదుటివారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలి. అందుకే అప్పుడు టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చి విజయం చేకూరేలా చేశా.

అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం ఉంది'' అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నట్లు కథనం తెలిపింది.

2019 ఎన్నికల్లో అద్భుతాలు సాధిస్తామో లేదో తెలియదు కానీ, జనసేన బలంగా అయితే నిలబడుతుందని ఆయన చెప్పారు.

విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. పవన్ వివిధ అంశాలపై మాట్లాడినట్లు ఈనాడు రాసింది.

'తెదేపా నాయకులను నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశాను .

ప్రతిపక్ష నాయకుడిలా చంపేయండి, చింపేయండి అనలేదు. 2014లో జగన్‌ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు.. ఏం చేయగలవంటూ అంతా నన్ను ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికే వచ్చానని వారితో చెప్పాను.

2014లో పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని తొలుత భావించా. అయితే, అలా చేస్తే పార్టీ బలపడదన్న ఉద్దేశంతోనే పోటీకి దూరంగా ఉండి ఆ పార్టీలకు మద్దతు పలికి విజయం చేకూరేలా చేశాను.

మోదీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తారనే గట్టి నమ్మకంతోనే మద్దతిచ్చా. చంద్రబాబు మరో పదేళ్లు అధికారంలో ఉండాలంటారు.. ప్రతిపక్ష నేత జగన్‌ 30 ఏళ్లు అధికారం కావాలంటారు.

పదవి కాదు.. మూడు తరాలు బాగుండాలనే ఆకాంక్ష ముఖ్యమన్న పవన్, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని చెప్పినట్లు ఈనాడు కథనం వివరించింది.

వేలికి ఇంకు

ఫొటో సోర్స్, Getty Images

సర్పంచ్ పదవి కోసం భారీ ఖర్చు

తెలంగాణలో ఈసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు జరుగుతోందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆశావహులు సవాల్‌గా తీసుకుంటున్నారు. రిజర్వుడు స్థానాల్లోనూ కొన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది.

పంచాయతీ స్థాయిని బట్టి 5 లక్షల నుంచి కోటి వరకూ ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. దీంతో, మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. రెండో విడత ప్రారంభమైంది. ఇప్పటికే కొన్నిచోట్ల వేలం జరగ్గా, మరికొన్నిచోట్ల చర్చలు సాగుతున్నాయి.

ఇవి సఫలం కాకపోతే, పోటీలో నిలిచి ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారని పత్రిక తెలిపింది.

తొలుత ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవి కట్టబెట్టేందుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

ఏకగ్రీవం కాకపోతే..అంతకు మించి ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అతి చిన్న పంచాయతీ అయినా రూ.5 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇక, 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు, భారీగా ఆదాయమున్న పంచాయతీల్లో అంతకు మించి ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితికి కనీసం ఐదు నుంచి పది రెట్లకుపైగా ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఆశావహులు చెబుతున్నారని కథనంలో వివరించారు.

srisailam

ఫొటో సోర్స్, Minister for Irrigation, Telangana/FB

శ్రీశైలంజల విద్యుత్ కోసమే-తెలంగాణ

సాగర్‌కు నీటి విడుదలతో రెండు రాష్ర్టాలకు సాగునీరు అవసరాలు తీరుతాయని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

శ్రీశైలం జలాశయంనుంచి కరంటు ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై ప్రతిసారీ తెలంగాణను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణా బోర్డుకు నీటిపారుదలశాఖ మరోసారి సరైన కౌంటర్ ఇచ్చింది.

అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిందే జల విద్యుత్ కోసం. అక్కడ కరంటు ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని వదిలి.. సాగర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకుంటాయి అని నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తాజాగా స్పష్టంచేశారు.

గతంలో జరిగిన తొమ్మిదో బోర్డు సమావేశంలోనూ ఇదే విషయాన్ని సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వెల్లడించారని, కానీ ఆ సమావేశ మినిట్స్‌లో మాత్రం ఈ అంశాన్ని పొందుపరచలేదని రెండు రోజుల కిందట బోర్డుకు రాసిన లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు.

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా కరంటు ఉత్పత్తితో సాగర్‌కు తెలంగాణ నీటిని విడుదల చేస్తారు.

ఈ నీటి విడుదలపై ఏపీ కొంతకాలంగా తరచూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నది.

శ్రీశైలంలో నీటిమట్టం తగ్గుతుందని, వెంటనే కరంటు ఉత్పత్తి ద్వారా నీటి విడుదల నిలిపివేయాలంటూ బోర్డుకు ఏపీ లేఖ రాయడం.. అందుకు బోర్డు తలూపుతూ తరచూ తెలంగాణను నీటి విడుదల నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన తొమ్మిదో బోర్డు సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

కానీ బోర్డు ఉన్నతాధికారులు సమావేశ మినిట్స్‌లో సీఎస్ వెల్లడించిన అంశాలను పొందుపరచలేదు. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తూ ఈఎన్సీ మురళీధర్‌రావు బోర్డుకు లేఖ రాశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉద్దేశాన్ని ఆయన మరోసారి బోర్డుకు స్పష్టంచేసినట్లు నమస్తే తెలంగాణ తమ కథనంలో తెలిపింది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)