మీ ఏడాది ఆదాయాన్ని మీ సీఈఓ ఒక పూటలో సంపాదిస్తాడు

మెక్‌డొనాల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెక్‌డొనాల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బుక్ ఆ సంస్థ సగటు ఉద్యోగికన్నా 3 వేల రెట్లు ఎక్కువ వార్షిక వేతనం పొందుతున్నారు

కొత్త ఏడాది ప్రారంభమైంది. మీరు ఈసారి పెరగబోయే జీతం గురించి, దానిలో ఎంత పొదుపు చేయవచ్చన్న దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు.

మీరు బ్రిటన్‌లో ఉన్నట్లైతే, మీరు మొత్తం ఏడాదిలో సంపాదించే వేతనం మీ బాస్ ఈపాటికి సంపాదించేసి ఉండొచ్చు.

జనవరి 4 నాటికి బ్రిటన్‌లోని అతి పెద్ద కంపెనీల సీఓఈలు, సగటు ఉద్యోగి సంపాదనను సంపాదించేసి ఉంటారు.

ఇలా సగటు ఉద్యోగి జీతాన్ని నాలుగు రోజుల్లో సంపాదించే సీఈఓలు బ్రిటన్‌లో ఒక్కటే కాదు.. ఇంకా అనేక దేశాల్లో కూడా ఉన్నారు.

ఆర్థిక, మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఇలా సీఈఓలు, ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని సమీక్షించినపుడు అమెరికా, భారతదేశంలోని సీఈఓలు సగటు ఉద్యోగి వార్షిక వేతనాన్ని అతి తక్కువ రోజుల్లోనే సంపాదిస్తున్నారని వెల్లడైంది.

ఒక సగటు ఉద్యోగి వార్షిక వేతనాన్ని అమెరికా టాప్ సీఈఓలు రెండు రోజుల్లో, ఇంకా చెప్పాలంటే 1.52 రోజుల్లో పొందుతున్నారని తెలుస్తోంది.

ఉద్యోగితో పోలిస్తే సీఈఓలు తీసుకుంటున్న వేతనం (ఆధారం: బ్లూమ్‌బర్గ్, పేస్కేల్.కామ్)

భారతదేశంలో అయితే దానికింకా తక్కువ సమయం పడుతుంది.

భారతీయ సీఈఓ ఒక సగటు ఉద్యోగి వార్షిక సంపాదనను రోజులో మూడోవంతులో (0.35) సంపాదించేస్తున్నారు.

''పెద్ద కార్పొరేషన్లలో సగటు ఉద్యోగి ఒక సీఈఓ ఏడాది సంపాదన పొందాలంటే మూడు శతాబ్దాలు పడుతుంది. అదే మెక్‌డొనాల్డ్స్‌లో అయితే ఖచ్చితంగా 3,101 ఏళ్లు పడుతుంది'' రచయిత సామ్ పిజిగాటి తన 'ద కేస్ ఫర్ ఎ మేగ్జిమమ్ వేజ్' పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సగటు ఉద్యోగి వార్షిక వేతనం పొందేందుకు వారం కన్నా తక్కువ సమయం పడుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

సీఈఓలు, ఉద్యోగులు, వేతన వ్యత్యాసం

ఫొటో సోర్స్, Getty Images

రూ.99 కోట్ల వార్షిక వేతనం

ప్రపంచవ్యాప్తంగా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వార్షిక వేతనాలు భిన్నంగా ఉన్నాయి.

టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న సంస్థలు ఎక్కువగా అమెరికాలో ఉన్నాయి. అక్కడ ఒక సగటు సీఈఓ వార్షిక వేతనం సుమారు. రూ.99 కోట్లు.

జీవనవ్యయం లాంటి కారణాల వల్ల కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి.

అయితే మంచి జీవన ప్రమాణాలు కలిగిన దేశాలలో కూడా సీఈఓలు, సగటు ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసాలు ఎక్కువగానే ఉన్నాయి.

అసమానతలు తక్కువని భావించే స్వీడన్‌లో కూడా వేతన వ్యత్యాసం 60:1 ఉంది. స్వీడన్‌ సగటు సీఈఓ వార్షిక వేతనం రూ.60 కోట్ల వరకు ఉంది.

సగటు ఉద్యోగితో పోలిస్తే, స్వీడన్ సీఈఓ 5.5 రోజులు పని చేస్తే చాలు.

ఇంగ్లండ్‌లోని పట్టు పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సగటు ఉద్యోగితో పోలిస్తే సీఈఓల వేతనాలు వేల రెట్లు ఉన్నాయి

నార్వే విషయానికి వస్తే, అక్కడ సగటు ఉద్యోగి ఏడాది జీతం కోసం సీఈఓలు 15 (14.6) రోజులు పని చేస్తే చాలు.

ఇక్కడ జాతీయ సగటు వార్షిక వేతనం సుమారు రూ.36 లక్షలు. ఇక్కడి సీఈఓలు సగటు ఉద్యోగికన్నా 20 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.

ఆఫ్రికా విషయానికి వస్తే.. నైజీరియాలోని సెప్లాట్ పెట్రోలియం డెవలప్‌మెంట్ కంపెనీకి చెందిన సీఈఓ ఆస్టిన్ అవురు అత్యధిక వేతనం పొందుతున్నారు. ఆయన వార్షిక వేతనం రూ.9 కోట్లు. సాలరీఎక్స్‌ప్లోరర్ డాట్ కామ్‌ను అనుసరించి నైజీరియాలో సగటు వేతనం రూ.12 లక్షలు.

అంటే టాప్ ఎగ్జిక్యూటివ్ ఐదురోజులకన్నా తక్కువ కాలవ్యవధిలో సగటు ఉద్యోగి వేతనాన్ని సంపాదిస్తారు.

అలెక్సీ మిల్లర్ (ఎడమ) రష్యాలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలెక్సీ మిల్లర్ (ఎడమ) రష్యాలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓ

రష్యాలో అంతరాలు

వేతనాల్లో అత్యధిక అంతరం ఉన్న దేశాలలో రష్యా ఒకటి.

ఫోర్బ్స్ 2016 ర్యాంకింగుల ప్రకారం, అత్యధికంగా ఆర్జిస్తున్న 25 మంది టాప్ రష్యన్ సీఈఓల సగటు వార్షిక వేతనం రూ.42.6 కోట్లు.

వాళ్లు సగం కన్నా తక్కువ రోజులో సగటు ఉద్యోగి వార్షిక వేతనాన్ని(రూ.5.6 లక్షలు) సంపాదిస్తున్నారు.

అతి వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగిన బ్రెజిల్ సీఈఓ సగటున రూ.2.25 కోట్లు ఇంటికి తీసుకువెళతారు. జాతీయ సగటు వార్షిక వేతనంతో పోలిస్తే ఆయన ఎనిమిది రోజుల్లో దానిని సంపాదిస్తున్నారు.

మెక్సికో విషయానికి వస్తే అక్కడ సీఓఈలు నాలుగుకన్నా కొంచెం ఎక్కువ రోజుల్లో సగటు ఉద్యోగి వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు.

సఫ్రా కాట్జ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒరాకిల్ సీఈఓ సఫ్రా కాట్జ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనాన్ని పొందుతున్న ఎగ్జిక్యూటివ్

ఇంత అంతరం న్యాయమేనా?

దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

గత ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక కథనంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎథాన్ రౌవెన్ ఈ వేతనాలలో వ్యత్యాసాల గురించి సాధారణ ప్రజలకు, ఉద్యోగులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

2014లో పలు దేశాలలో నిర్వహించిన ఒక సర్వేలో ప్రజలు సీఈఓలు, సాధారణ ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం నాలుగురెట్లకన్నా ఎక్కువ ఉండరాదన్న అభిప్రాయం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే కేవలం అంకెలను పోల్చి చూసే బదులు, ఆ వేతనాల వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా చూడాలని ఆయన అంటారు.

దీనికి ఉదాహరణగా ఆయన ఆపిల్‌ను చూపిస్తారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్షిక వేతనం సగటు అమెరికన్ ఉద్యోగి వేతనంకన్నా సుమారు 250 రెట్లు ఎక్కువ.

ఇతర టెక్ కంపెనీలతో పోలిస్తే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువే కావొచ్చు. అయితే ఆపిల్ రిటైల్ రంగంలో చాలా మందిని నియమించుకుంటుంది కాబట్టి వారి వేతనాలు తక్కువగా ఉంటాయని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)