CBI vs CBI: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తిరిగి నియమించిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకాన్ని సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలను రద్దు చేసింది.
అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన్ను సెలవులో పంపిస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
హైపవర్డ్ సెలక్ట్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సీబీఐ డైరెక్టర్ అధికారాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్టపరమైన అవకాశాలు లేవని తెలిపింది.
సీబీఐ డైరెక్టర్‌గా పునః నియామకం అయినప్పటికీ అలోక్ వర్మ ప్రధాన విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోరాదని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి, డిసెంబర్ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
నిర్ణయాన్ని సమర్థించుకున్న సీవీసీ
కాగా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
సీవీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సీబీఐలో ఒక అసాధారణ పరిస్థితి తలెత్తిందని, అలోక్ వర్మను డైరెక్టర్‌గా కొనసాగించలేని పరిస్థితి అదని వివరించారు.
అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు కొన్నిసార్లు అసాధారణ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అందుకే అలోక్ వర్మను సెలవులో పంపించాల్సి వచ్చిందని చెప్పారు.
కేసు ఏంటి?
భారత ప్రభుత్వ 'డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్' (డీఓపీటీ) 2018 అక్టోబర్ 23వ తేదీ అర్థరాత్రి రెండు ఆదేశాలు ఇచ్చింది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాతో పాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను కూడా సెలవుపై పంపించింది.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు డీవోపీటీ కేబినెట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
తనను బలవంతంగా సెలవుపై పంపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎన్జీవో 'కామన్ మ్యాన్' ద్వారా మరో పిటిషన్ వేశారు. అవినీతి కేసులో నిందితుడు రాకేశ్ అస్థానాను వెంటనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని, ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరారు.
కాగా, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షించారు.
కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు ఈలోపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, ఆయన సాధారణ (రొటీన్) కార్యకలాపాలు మాత్రమే చేయాలని కూడా సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డు కవరులో తమకు అందించాలని ఆదేశించింది.
ఈ నెలాఖరున రిటైర్ కానున్న అలోక్ వర్మ
కాగా, అలోక్ వర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. జనవరి 31వ తేదీన ఆయన రిటైర్ కానున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అలోక్ వర్మకు పాక్షిక విజయమని, దీన్ని స్వాగతిస్తున్నామని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సీనియర్ న్యాయవాది కేసీ కౌశిక్ స్పందిస్తూ.. సీవీసీ ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేయటం అలోక్ వర్మకు పెద్ద విజయమని, ముందుకు చర్చించకుండా, అనుమతి తీసుకోకుండా బలవంతంగా సెలవులో పంపించడం సాధ్యం కాదన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








