CBI vs CBI: డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
2018 అక్టోబర్ 15
- లంచం తీసుకున్నందుకు తమ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపైనే సీబీఐ ఒక కేసు నమోదు చేసింది. కుట్ర చేశారని, లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్‌లో ఆరోపణలు చేసింది.
- హైదరాబాద్ వ్యాపారి సతీష్ బాబు ఫిర్యాదుతో ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
- మొయిన్ ఖురేషీ కేసులో తనపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేసేందుకు రూ.3 కోట్ల రూపాయలు లంచం ఇచ్చానని సతీష్ బాబు ఆరోపించారు.
- దుబయిలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ సాయంతో ఈ లంచాన్ని రాకేశ్ అస్థానా వరకూ చేర్చానని సతీష్ బాబు వాదిస్తున్నారు.
- ఒక కేసులో సతీష్ బాబుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు దానికి రాకేశ్ అస్థానా నేతృత్వం వహిస్తున్నారు.
- అక్టోబర్ 15న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్, దుబయిలో ఉంటున్న మనోజ్ ప్రసాద్, ఆయన సోదరుడు సోమేశ్వర్ ప్రసాద్ పేర్లు కూడా చేర్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 16
- సీబీఐ లంచం కేసులో మధ్యవర్తిగా ఆరోపిస్తున్న మనోజ్ ప్రసాద్‌ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
- మనోజ్ ప్రసాద్‌ను అక్టోబర్ 25 వరకు పోలీసుల అదుపులో ఉంచుతామని, ఆయన్ను విచారిస్తామని సీబీఐ చెప్పింది.
- మనోజ్ ప్రసాద్ తనకు సీబీఐలో చాలా మంది పెద్ద వాళ్లు తెలుసని, ఈ దర్యాప్తు ఆగిపోయేలా చేయగలనని అన్నాడని సీబీఐ తమ ఎఫ్ఐఆర్‌లో తెలిపింది.
అక్టోబర్ 20
- ప్రధాన ఫిర్యాదుదారు సతీష్ బాబు వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో సీబీఐ నమోదు చేసింది.
- సీబీఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్.. మొయిన్ ఖురేషీ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ కేసులో ఒక సాక్షి అయిన సతీష్ బాబు పేరిట సమన్లు జారీ చేశారు.
- సతీష్ బాబుకు మొయిన్ ఖురేషీ కేసులో ఉపశమనం అందించేందుకు తమ అధికారులు లంచం తీసుకున్నారని సీబీఐ చెబుతోంది.
- అదే రోజు మధ్యాహ్నం తర్వాత దేవేంద్ర కుమార్ ఇంట్లో, సీబీఐ భవనంలోని ఆయన ఆఫీసులో సీబీఐ సోదాలు చేసింది. కొన్ని కీలక పత్రాలు సీజ్ చేసినట్టు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Pti
అక్టోబర్ 22
- దర్యాప్తుకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలతో సీబీఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్‌ను అరెస్టు చేశారు.
- సతీష్ బాబు కల్పిత వాంగ్మూలం సృష్టించారని, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అస్థానా చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాలని దేవేంద్ర కుమార్ ప్రయత్నించారని ఆరోపించారు.
- దీని ఆధారంగా సీబీఐ తమ ఎఫ్ఐఆర్‌లో దేవేంద్ర కుమార్‌ను 2వ నిందితుడుగా, రాకేష్ అస్థానాను 1వ నిందితుడుగా పేర్కొంది.
- అలోక్ వర్మ కూడా సతీష్ బాబు నుంచి రెండు కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని రాకేశ్ అస్థానా ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 23
- సీబీఐ ఎఫ్ఐఆర్‌ను సవాలు చేస్తూ రాకేశ్ అస్థానా, దేవేంద్ర కుమార్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
- నిందితులైన ఇద్దరు అధికారులు సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కూర్చుని దర్యాప్తు నుంచి ఊరట ఇచ్చినందుకు బదులుగా డబ్బు వసూలు చేసే ఒక రాకెట్ నడిపించారని సీబీఐ దిల్లీ హైకోర్టుకు తెలిపింది.
- కోర్టు దేవేంద్ర కుమార్‌ను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
- దిల్లీ హైకోర్టు అస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయకపోయినా, కొన్నిరోజులపాటు ఆయన అరెస్టును నిలిపివేసింది.
- రాత్రి 9 గంటలకు డైరెక్టర్ అలోక్ వర్మ ఒక ఆర్డర్ ద్వారా స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా నుంచి అన్ని బాధ్యతలు తిరిగి తీసేసుకున్నారు. ఆయన తన ఆదేశాల్లో "అవినీతి కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక అధికారికి.. కార్యాలయంలో కీలక బాధ్యతలు ఇవ్వలేం" అన్నారు.
- కాసేపటి తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనపై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో సహకరించడం లేదని సీవీసీ ఒక ఆర్డర్ జారీ చేసింది.
- భారత ప్రభుత్వ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్'(డీఓపీటీ) అర్థరాత్రి రెండు ఆదేశాలు ఇచ్చింది. రాకేశ్ అస్థానాతో పాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను కూడా సెలవుపై పంపించింది.
- సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు డీఓపీటీ క్యాబినెట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
- సీబీఐ వివరాల ప్రకారం అర్థరాత్రి సుమారు రెండు గంటల సమయంలో నాగేశ్వరరావు సీజీవో కాంప్లెక్స్‌లోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ చేరుకుని సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మ గదిని సీల్ చేయించారు.
- నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోగానే ఏజెన్సీలోని 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో అస్థానా లంచం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 24
- సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం తనను హఠాత్తుగా తొలగించడం కుదరదని చెప్పారు.
- ప్రభుత్వాన్ని సమర్థించిన ఆర్థిక మంత్రి జైట్లీ "ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం మూడో వ్యక్తి అవసరం ఉంది. దర్యాప్తు పూర్తి చేసేవరకూ అధికారులిద్దరినీ విధులకు దూరంగా ఉంచుతాం’’ అని అన్నారు.
- దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం సీబీఐ చీఫ్ అలోక్ వర్మను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపించారు. ఆయన్ను సెలవుపై పంపించడం సుప్రీంకోర్టును అవమానించడమే అన్నారు.
- అలోక్ వర్మ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 25
- సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపించినప్పుడు ఆయన దగ్గర ఏడు ముఖ్యమైన కేసులు ఉన్నాయని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక వార్తను ప్రచురించింది. వీటిలో రఫేల్ డీల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లంచం తీసుకున్న కేసులు, బొగ్గు గనుల కేటాయింపుల కేసులు ఉన్నాయని తెలిపింది.
- బీబీసీతో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి "నరేంద్ర మోదీ అందరినీ సీబీఐ కర్ర చూపించి భయపెట్టడం చాలా ఆందోళనకరమైన విషయం. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి" అని ఆరోపించారు.
- "సీబీఐ డైరెక్టర్ పదవిలోకి రావడం లేదా తొలగించడానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఉండడం తప్పనిసరి. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత అందులో ఉండాలి. రాత్రి 2 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టే" అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
- "సీబీఐ ఇమేజ్, విశ్వసనీయతకు మేం మచ్చ రానీయం. సీబీఐ ఇమేజ్ పాడైతే, చాలా ముఖ్యమైన కేసులపై దాని ప్రభావం పడుతుంది" అని సీబీఐ ప్రతినిధి అన్నారు.
అక్టోబర్ 26
- అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది.
- కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు ఈలోపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, ఆయన సాధారణ (రొటీన్) కార్యకలాపాలు మాత్రమే చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డు కవరులో తమకు అందించాలని ఆదేశించింది.
డిసెంబర్ 6
- ఈ కేసులో అన్ని పక్షాల తరపు న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
2019 జనవరి 8
- సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకాన్ని సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.
- అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన్ను సెలవులో పంపిస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
- సీబీఐ డైరెక్టర్‌గా పునః నియామకం అయినప్పటికీ అలోక్ వర్మ ప్రధాన విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోరాదని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు.. అర్హతలు ఇవీ
- అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
- రాకేశ్ అస్థానా కేసు దర్యాప్తుకు అజిత్ డోభాల్ అడ్డు తగిలారు: సీబీఐ డీఐజీ
- అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి
- సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో నో ఎంట్రీ... దీని పర్యవసానాలేమిటి?
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- అభిప్రాయం: సీబీఐలో అవినీతి నిన్న, నేడు, రేపు
- జగన్‌పై దాడి కేసు: కోడికత్తితో దాడి జరిగితే NIA ఎలా దర్యాప్తు చేస్తుంది? ఏపీ ప్రభుత్వ సహాయ నిరాకరణ కరెక్టేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




