రాకేశ్ అస్థానా కేసు దర్యాప్తుకు అజిత్ డోభాల్ అడ్డు తగిలారు: సీబీఐ డీఐజీ

అజిత్ డోభాల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఓ కేసు విచారణలో అడ్డుతగిలారని ఆరోపిస్తూ సీబీఐ డీఐజీ ఎంకే సిన్హా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై జరుగుతున్న విచారణకు అజిత్ డోభాల్ ఆటంకం కలిగిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.

రాకేశ్ అస్థానా ఇంట్లో సోదాలు నిర్వహించకుండా డోభాల్ తనను అడ్డుకున్నారని సిన్హా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాకేశ్ అస్థానాకు వ్యతిరేకంగా నమోదైన కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల్లో సిన్హా ఒకరు. అక్టోబరులో ఇతర అధికారులతో పాటు ఆయన బదిలీకి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ అవినీతి కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు డోభాల్‌కు చాలా దగ్గరవారని సిన్హా తన పిటిషన్‌లో ఆరోపించారు.

సీబీఐ కేసు విషయంలో సహాయం కోసం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి కోట్ల రూపాయల మేర లంచం చెల్లించినట్లు అస్థానా కేసులో ఫిర్యాదుదారైన సాన సతీష్ బాబు తనకు తెలిపారని కూడా సిన్హా ఆరోపించారు.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

‘రా’ అధికారి సామంత్ గోయల్ పాల్గొన్న ఓ సంభాషణలో, ‘సీబీఐ విషయాన్ని పీఎంవో చూసుకుంటుంది’ అనే మాటలు వినిపించాయని, అదే రోజు రాత్రి అస్థానా కేసులో విచారణ చేస్తున్న మొత్తం సీబీఐ బృందాన్ని తొలగించారని పిటిషన్‌లో సిన్హా ఆరోపించారు.

మోయిన్ ఖురేషీ విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సాన సతీష్ బాబు కలిశారని, కేంద్ర న్యాయశాఖ సెక్రటరీ సురేష్ చంద్ర నవంబర్ 11న సాన సతీష్ బాబును సంప్రదించారని సిన్హా పేర్కొన్నారు.

మనోజ్ ప్రసాద్ (అస్థానా కేసులో అరెస్టయిన మధ్యవర్తి) చెప్పిన మాటల ప్రకారం... ఆయన తండ్రి దినేశ్వర్ ప్రసాద్ ‘రా’ జాయింట్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ఆయనకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటిది తనను సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఎలా తీసుకొస్తారని మనోజ్ ప్రశ్నించినట్లు సిన్హా తన పిటిషన్‌లో తెలిపారు.

అక్టోబర్ 15న అస్థానాపై ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత, సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ ఆ విషయాన్ని అక్టోబర్ 17న డోభాల్‌కు చెప్పారని సిన్హా అన్నారు.

‘అదే రోజు రాత్రి డోభాల్ ఎఫ్‌ఐఆర్ విషయాన్ని అస్థానాకు చెప్పారు. తనను అరెస్టు చేయడానికి వీల్లేదని అస్థానా పదేపదే కోరారు. ఆ కేసు విషయంలో అస్థానా ఫోనును స్వాధీనం చేసుకోవడానికి విచారణ అధికారి ఏకే బస్సీ అనుమతి కోరితే, సీబీఐ డైరెక్టర్ వెంటనే అనుమతి ఇవ్వలేదు. డోభాల్ నుంచి దానికి అనుమతి రాలేదు అని డైరెక్టర్ చెప్పారు’, అని పిటిషన్‌లో సిన్హా తెలిపారు.

అక్టోబర్ 22న ఫోన్‌ను సీజ్ చేయడానికి రాతపూర్వకంగా అనుమతి కోరినా, దాన్ని కూడా డైరెక్టర్ తిరస్కరించారని సిన్హా తెలిపారు.

రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఏంటీ రాకేష్ అస్థానా కేసు?

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీష్ బాబు ఫిర్యాదు మేరకు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనపైన దర్యాప్తును నిలిపివేయడానికి అస్థానాకు మూడు కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు సతీష్ బాబు ఆరోపించారు. దుబాయిలో ఉండే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ సాయంతో ఈ లంచం రాకేశ్ అస్థానా వరకూ చేర్చానని సతీష్ బాబు వాదిస్తున్నారు.

సతీష్ బాబుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు దానికి రాకేష్ అస్థానా నేతృత్వం వహిస్తున్నారు.

రాకేశ్ అస్థానా గుజరాత్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన చాలా కీలక కేసులు దర్యాప్తు చేశారు. వీటిలో దాణా కుంభకోణం కేసు కూడా ఉంది. గోద్రాలో రైలు దహనం కేసును కూడా అస్థానానే దర్యాప్తు చేశారు.

ప్రధాని మోదీకి అస్థానా కొత్త ముఖం కాదు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్థానాకు ఎన్నో బాధ్యతలు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)