తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'.. ‘జెయింట్‌కిల్లర్’ చిత్తరంజన్ దాస్ చెప్పిన ఆనాటి సంగతులు

ఫొటో సోర్స్, Tdp/facebook, chitharanjan das
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ఎన్టీఆర్ నా చేతిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ అడ్డుకోలేదు'' అని ఆయనపై గెలిచిన చిత్తరంజన్ దాస్ బీబీసీతో అన్నారు.
జెయింట్ కిల్లర్...చిత్తరంజన్ దాస్
ఎన్టీఆర్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై కథానాయకుడిగా... రాజకీయాల్లో ప్రజానాయకుడిగా తనదైన ముద్రవేశారు.
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారు.
అయితే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. ఆయనను ఓడించి జాయింట్ కిల్లర్‌గా తెలుగు రాజకీయాల్లో నిలిచిన వ్యక్తి జక్కుల చిత్తరంజన్‌దాస్.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ఓబీసీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌పై కల్వకుర్తిలో పోటీ చేసినప్పటి విషయాలను బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Tdp/facebook
'జైపాల్ రెడ్డి సూచన.. ఎన్టీఆర్ ఆమోదం'
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో ఎన్నికలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావించారు.
ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించేలా తనకు అచ్చొచ్చిన హిందూపురంను ఎంచుకున్నారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే సమస్య వచ్చింది.
జైపాల్ రెడ్డి సూచన మేరకే కల్వకుర్తి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని చిత్తరంజన్ దాస్ చెప్పారు.
''అప్పుడు జైపాల్ రెడ్డి జనతా పార్టీలో ఉండేవారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జనతా పార్టీ, టీడీపీ కలిసి పోటీలోకి దిగాయి. జైపాల్ సూచన మేరకే ఎన్టీఆర్ మా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు'' అని చిత్తరంజన్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు బరిలోకి దిగడంతో కల్వకుర్తి నియోజకవర్గం ఆ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించించుకుంది.

ఫొటో సోర్స్, chitharanjan das
కాంగ్రెస్ నుంచి ఎవరు?
కల్వకుర్తి నియోజక వర్గంలో ఎన్టీఆర్‌కు పోటీగా చిత్తరంజన్ దాస్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అప్పటికి ఆయనకు ఒక్క ఎన్నికల్లో గెలిచిన అనుభవం మాత్రమే ఉంది.
''1985లో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడే తొలిసారిగా నాకు కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. వారి నమ్మకాన్ని నిలబెట్టాను. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై గెలిచాను. అందుకే 1989 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నావైపే మొగ్గు చూపింది'' అని చిత్తరంజన్ చెప్పారు.
విద్యార్థి దశ నుంచే తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘కచ్చితంగా గెలుస్తాననుకున్నా’
'నాకు వ్యతిరేకంగా బరిలో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పటికే ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లోనూ ప్రముఖంగా ఉన్నారు. కానీ, ఆయనపై కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉండేది' అని చిత్తరంజన్ పేర్కొన్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత అనంతరాములు అన్ని విధాలుగా సహకరించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
''ఎన్టీఆర్‌పై నేను పోటీకి రాలేదు. ఆయనే నాతో పోటీకి వచ్చారు. అప్పటికే కల్వకుర్తిలో బాగా పనిచేశా. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలుపిస్తుందని నమ్మా'' అని చిత్తరంజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, chitharanjan das
అటు రాజీవ్... ఇటు ఎన్టీఆర్
ఎన్టీఆర్ పోటీకి దిగడంతో కల్వకుర్తి నియోజకవర్గం ప్రాధాన్యం సంతరించుకుంది.
అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ.. చిత్తరంజన్ తరఫున ప్రచారం చేసేందుకు కల్వకుర్తికి వచ్చారు. స్వయంగా తానే పోటీ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఆ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టారు.
''నేనే కాదు నా చెప్పును నిలబెట్టినా ప్రజలు గెలిపిస్తారని ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ చెప్పేవారు. ఆయన ప్రచారానికి జనాలు విపరీతంగా వచ్చేవారు. నాకున్న వనరులతో నేను ప్రచారం చేసుకున్నాను'' అని చిత్తరంజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Tdp/facebook
ఎన్టీఆర్ ఓటమి... అధికారంలోకి కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 287 సీట్లలో పోటీ చేసి 181 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 74 సీట్లకే పరిమితిమైంది. కమ్యూనిస్టు పార్టీలు 14 సీట్లు, బీజేపీ 5 సీట్లు గెలుచుకున్నాయి.
ఎన్టీఆర్ హిందూపురంలో గెలిచినప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఓడిపోయారు. కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్‌కు 54,354 ఓట్లు వస్తే ఎన్టీఆర్‌కు 50,786 ఓట్లు వచ్చాయి.
ఎన్టీఆర్‌పై 3,568 ఓట్ల మెజార్టీతో చిత్తరంజన్ గెలిచి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, chitharanjan das
'చరిత్రకెక్కింది... మంత్రి పదవి దక్కింది'
'నా గెలుపుతో సీఎంను ఓడించిన రికార్డు దక్కింది. మొదటి నుంచి గెలుస్తాననే అనుకున్నా. నా నమ్మకాన్ని ఓటర్లు వమ్ముచేయలేదు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. నిజాయితీగా పనిచేశా. పైగా మా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కాంగ్రెస్ కూడా కల్వకుర్తిలో బలంగా ఉండేది. స్థానికుడ్ని గెలిపిస్తేనే అందుబాటులో ఉండి పనులు చేస్తారని ఓటర్లు భావించారు. అందుకే వారు ఎన్టీఆర్‌ను కాదని నన్ను ఎన్నుకున్నారు ' అని తన విజయానికి గల కారణాలను చిత్తరంజన్ వివరించారు.
గెలిచాక దిల్లీకి వెళ్లి రాజీవ్ గాంధీని కలిస్తే ఆయన అభినందించారని చెప్పారు.
''నాతో పాటు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ ఎన్నికల్లో గెలిచారు. మా ప్రభుత్వమే ఏర్పాటైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేబినెట్‌లో నాకు మంత్రి పదవి దక్కింది'' అని చిత్తరంజన్ తెలిపారు.
‘కల్వకుర్తి ప్రజల విజయం’
ఎన్టీఆర్ నా చేతిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని చిత్తరంజన్ పేర్కొన్నారు.
'రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ ఇద్దరూ గొప్ప నేతలు. వ్యక్తిగత విమర్శలు పెద్దగా చేసుకునేవారు కాదు. పార్టీల నిర్ణయాలు, పాలన వైఫల్యాలపైనే అప్పుడు విమర్శలుండేవి' అని తెలిపారు.
మనం నిజాయితీగా పనిచేస్తే మన ప్రత్యర్థి ఎంత పెద్దవారైనా ప్రజలు మనల్నే గెలిపిస్తారని చెప్పడానికి కల్వకుర్తి విజయం ఒక ఉదాహరణ అని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి.
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








