తెలంగాణ ఎన్నికలు: సోషల్ మీడియాలో ప్రచారం ఎలా జరుగుతోందంటే..

ఫొటో సోర్స్, iStock
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ఎన్నికల రాజకీయ వేడి మొత్తం సామజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. పంచ్‌లు, కార్టూన్లు, స్పూఫ్ వీడియోలు, సర్వేలు, సవాళ్లు.. ఇలా ఎంతో సృజన నిండిన కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేస్తారు. ప్రధానంగా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే దీని లక్ష్యమని సామాజిక మాధ్యమాల వ్యూహకర్తలు(సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్స్) అంటున్నారు.
ఈ ఎన్నికల్లో కొందరు నేతలు, రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని నమ్ముకుని సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు, కన్సల్లెంట్లను రంగంలోకి దించారు.
అలాంటి కొందరు వ్యూహకర్తలను కలిసి వారి పని ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకు 'బీబీసీ తెలుగు' ప్రయత్నించింది.
పార్టీలు, బడా నేతలు కొందరు వ్యవస్థీకృతంగా పనిచేసే సోషల్ మీడియా కన్సల్టెంట్లను నియమించుకున్నారు. అలాంటి అవకాశం, స్తోమత లేని నేతలు ఒకరిద్దరు కన్సల్టెంట్లను నియమించుకుంటున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న చిన్నచిన్న కన్సల్టెన్సీలు ఒకరిద్దరు నేతలకు సర్వీసు అందించడానికే పరిమితం అవుతుండగా.. పెద్ద కన్సల్టెన్సీలు మాత్రం ఏకకాలంలో ఎక్కువ సంఖ్యలో నేతలకు సర్వీస్ అందిస్తున్నాయి. పార్టీల సోషల్ మీడియా బాధ్యతలు మొత్తం చూస్తున్న కన్సల్టెన్సీలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకింత ప్రాధాన్యం?
మొబైల్ ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. పైగా మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగాక యూజర్లు సోషల్ మీడియాలో గడిపే సమయం కూడా పెరుగుతూవస్తోంది.
దీంతో పార్టీలు, నేతలకు సామాజిక మాధ్యమాల గురించి ప్రత్యేక ప్రచార వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడింది.
"గ్రామీణ ప్రాంతాలలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి రావడం. అలాగే ప్రతి ఒకరు స్మార్ట్ ఫోన్లు వాడటం.." అని పొలిటికల్ కన్సల్టెన్సీ 'సోషల్ పోస్ట్' సీఈఓ రజనీకాంత్ ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సామజిక మాధ్యమాలు రణభూమిలా మారుతున్నాయి. ఇటీవలి సోషల్ మీడియాలో #IAmDishwasher పేరుతో ఒక ప్రచారం సాగింది.
తెరాస నేత కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వందలాదిమంది కేటీఆర్ అభిమానులు అంట్లు కడుగుతూ.. ఆ వీడియోలను ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టారు. దీనిపై రెండు పార్టీల, ఇద్దరు నేతల అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన రభస జరిగింది.
మూడంచెల వ్యూహం
బీబీసీ తెలుగు న్యూస్.. సామాజిక మాధ్యమాల వ్యూహకర్తలతో మాట్లాడి తెలుసుకున్న ప్రకారం.. అత్యధిక సందర్భాల్లో ఈ సోషల్ మీడియా ప్రచారం మూడు అంచెల్లో జరుగుతుంది.
అందులో మొదటిది రాజకీయ పార్టీ లేదా నాయకులకు చెందిన సోషల్ మీడియా సెల్.
రెండో అంచెలో అభిమానులు ఉంటారు. మూడో అంచెలో సానుభూతిపరులు ఈ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా సెల్ ఏం చేస్తుంది?
ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా సెల్ ఉంది. ఈ విభాగం పని వారి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన కార్యక్రమాలు, వారి వాగ్దానాలు, సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా అనేక అంశాలపై పోస్టర్లు, అందరికీ అర్ధమయ్యేలా ఆసక్తికరమైన ఫోటోలను సిద్ధం చేసి, వాటిని వారివారి అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచారం చేస్తుంది.
ఈ అధికారిక పేజీలు, వ్యక్తులు కాకుండా అభిమానులు నిర్వహించే పేజీలూ ఉంటాయి.
సోషల్ మీడియా ప్రచార వ్యూహంలో మూడో అంచెలో ఉండే సానుభూతిపరులు తమతమ సోషల్ మీడియా ఖాతాల్లో తాము ఇష్టపడే పార్టీ, నేతలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. వీరిలో కొందరు నేరుగా ఇందులో భాగస్వాములుగా ఉంటుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ప్రభావితమై ఇందులో పాలుపంచుకుంటుంటారు.

ఫొటో సోర్స్, trspartyonline/facebook
'ప్రచారం చేయాల్సిన కంటెంట్ పైస్థాయిలో నిర్ణయమవుతుంది'
టీఆర్ఎస్‌కు అనుబంధంగా పని చేస్తున్న ఒక సోషల్ మీడియా సానుభూతిపరుడితో బీబీసీ తెలుగు ప్రతినిధి మాట్లాడారు.
"సోషల్ మీడియా-వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఏది పోస్ట్ చేయాలి అనేది చాలా ముఖ్యమైన పని. పార్టీతో పని చేసే సోషల్ మీడియా సెల్స్ అధికారికంగా పార్టీకి సంబంధించిన ప్రచార వివరాలను తయారు చేసి వారి అఫిషియల్ పేజీలలో పెడతారు. దీన్ని.. అభిమానులు వారి పేజీలలో షేర్ చేస్తారు.
ఇదే కాకుండా, అభిమానులు సొంతంగా కొంత కంటెంట్‌ను తయారు చేస్తారు. ఈ కంటెంట్‌లో జనాలతో మాట్లాడించి, వారి పార్టీ గురించి గొప్పగా చెప్పినవారి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
అలాగే ప్రతిపక్ష నేతల పాత ప్రసంగాలు తీసి, అందులో వారికి అనుకూలంగా ఉండే మాటలను కాస్త ఎడిట్ చేసి, తమ నేతల ప్రసంగాలను జోడించి సోషల్ మీడియాలో వదులుతారు. అవి అలా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్, ట్విటర్‌లో షేర్ అవుతుంటాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్ పని వాస్తవాలను, సర్వేలను, అధ్యయనం చేసి, వారి నేతలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పోస్టులు తయారుచేయడం. అది రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కావచ్చు, నియోజక వర్గాల్లో నేతలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. ఇలా వారికి అందుబాటులో ఉన్న సమాచారానికి మిగతా సమాచారాన్ని జోడించి, కంటెంట్ తయారు చేస్తారు. ఇలా తయారైన కంటెంట్‌ను అందరూ వారి వారి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తారు" అని వివరించారు.
ఒపీనియన్ లీడర్లుగా ఎన్నారైలు
రాజకీయ పార్టీల, నేతల సోషల్ మీడియా సెల్.. ప్రతి నియోజిక వర్గంలో ఒక 'ఒపీనియన్ లీడర్'ను గుర్తిస్తుంది.
ఒపీనియన్ లీడర్ అంటే, క్షేత్ర స్థాయిలో ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని అర్థం. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ ఒపీనియన్ లీడర్లు.. నియోజకవర్గాల్లో ఉండే యువ నేతలు కానీ, అక్కడ ఉండే టీచర్లు కానీ, నియోజకవర్గంలో జన్మించి ఇతర దేశాలలో స్థిరపడ్డ వారుకానీ అయ్యుంటారని కాంగ్రెస్ సీనియర్ నేతకు చెందిన సామాజిక మాధ్యమాల ప్రచారం చూస్తున్న ఒక సోషల్ మీడియా మేనేజర్ చెప్పారు.
ఈ ఒపీనియన్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వారి నేత గురించి వారు చేయదలుచుకున్న పనుల గురించి వివరిస్తారు. ఆ తరువాత వారు సానుకూలంగా స్పందిస్తే వారికి కూడా సోషల్ మీడియా బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి, వారు పంపే కంటెంట్‌ని షేర్ చేయమంటారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే పనేనని ఆయన తెలిపారు.
తటస్థ ఓటర్లే టార్గెట్‌గా..
సోషల్ మీడియాలో ప్రచారం ఒక నెలలో, వారంలో అయ్యే పని కాదు. కొంత మంది నేతలు ఏళ్ల తరబడి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అంచెలంచెలుగా వారి పరిధిని విస్తరించుకుంటూ వచ్చారు. కొందరు నేతలు తమ సోషల్ మీడియా ఖాతాలను సొంతంగానే నిర్వహిస్తుంటారు. కేటీఆర్, అసదుద్దీన్ ఒవైసి, కల్వకుంట్ల కవిత, శ్రవణ్, కిషన్ రెడ్డి వంటి నేతలంతా ఈ కోవలోనివారే.
టెక్నాలజీని అందిపుచ్చుకోలేక కొందరు, సమయం లేక మరికొందరు నేతలు నిష్ణాతులైన కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటున్నారు.
ఇలా నియమించిన వారి పని తీరును రజనీకాంత్ వివరించారు.
"మేం సాధారణంగా నేతల నియోజకవర్గంలో ఇద్దరు సభ్యులను నియమిస్తాము. వీరు ఆ రాజకీయ నేత వెన్నంటి ఉంటూ ఆయన కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తుంటారు. వీరికి సహాయంగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ టీం ఒకటి ఉంటుంది. అలాగే మరో టీం నియోజకవర్గంలో అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది. ఈ సర్వేల ఆధారంగా మా వ్యూహం మారుస్తుంటాం. ప్రతిచోట కొంతమంది తటస్థ ఓటర్లు ఉంటారు. వీరు చాలా కీలకం. వీరిని చేరుకుని మా నేతవైపు మరల్చగలిగే మేం విజయం సాధించినట్లే. ఇలాంటి ఓటర్లే గెలుపోటములను నిర్దేశిస్తారు. అలాగే ఎంత మెజారిటీతో గెలుస్తారన్నది కూడా వీరిపై ఆధారపడి ఉంటుంది" అని రజనీకాంత్ వివరించారు.

ఫొటో సోర్స్, INCTelangana/facebook
ప్రచారం.. దుష్ప్రచారం
ఇటీవల కొన్ని స్పూఫ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇవన్నీ సినిమాల్లోని సన్నివేశాల ఆధారంగా రూపొందించినవి.
ఇలాంటి ఒక వీడియోలో హీరో ప్రత్యర్థులను చితకబాదుతున్న దృశ్యాలుంటాయి. హీరో ముఖం స్థానంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ముఖాన్ని జోడించి ప్రత్యర్థుల స్థానంలో ప్రతిపక్ష నేతల ముఖాలు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరో వీడియో కూడా సినీ సన్నివేశాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నదే. ఒక నేతను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదని ప్రజలు నిలదీస్తుంటారు. సరైన సమాధానం ఇవ్వనందుకు ప్రజలు ఆ నేతను కొడతారు. ప్రతిపక్ష నేతలు ఈ దృశ్యం చూసి నవ్వుకుంటున్నారు. ఈ సన్నివేశంలో నేతలకు టీఆర్ఎస్ నాయకుల ముఖాలు పెట్టి, నవ్వుకుంటున్న నేతలకు కాంగ్రెస్ నాయకుల ముఖాలు పెట్టి రూపొందించారు. ఇవన్నీ ఎవరు రూపొందించారు.. సోషల్ మీడియాలో ఎవరు మొట్టమొదట పోస్ట్ చేశారన్నది తెలియదని చెప్పారు రజనీకాంత్.
"ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా నెగటివ్ కోణాన్ని చూపిస్తున్నాయి. వీటివల్ల ప్రయోజనం లేదు. ఇలాంటివి వ్యాప్తి చేసేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని రజనీకాంత్ అన్నారు.
ఇలాంటి వీడియోలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని బీబీసీ తెలుగుతో మాట్లాడిన సోషల్ మీడియా కన్సల్టెంట్స్ అందరూ అంగీకరించారు.
నకిలీ ప్రొఫైల్స్‌తో చేటు
సోషల్ మీడియా ప్రచారంలో మరో అంశం ఫేక్ (నకిలీ) ప్రొఫైల్స్. ఫేక్ ప్రొఫైల్స్‌ను గుర్తించటం కష్టమైన పని కానప్పటికీ సమయం వృథా అవుతుందని చెప్పారు ఓ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్.
నిజానికి సరైన పద్దతిలో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే ఇలా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేయవలసిన అవసరం రాదు అంటున్నారు.

ఫొటో సోర్స్, telanganastateceo/facebook
నిఘా పెట్టాం: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్
ఎన్నికల సంఘం అధికారులు సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచారం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలే సోషల్ మీడియాకు కూడా వర్తిస్తాయని ఎన్నికల సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు.
"వెబ్ ట్రోలింగ్ విషయంలో ఇప్పటికే అనేక సోషల్ మీడియా పేజీలపై నిఘా పెట్టాం. ముఖ్యంగా కులం, జాతి, మతం పేరుతో దూషించే, రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచాం" అని రజత్ కుమార్ అన్నారు.
దీని కోసం ఒక థర్డ్ పార్టీ యాప్‌ను ఉపయోగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. @telanganastateceo పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక పేజీని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పేజీకి 9.5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ పేజ్ ఫాలోయర్స్‌లో 90% మంది 34 సంవత్సరాలకంటే తక్కవ వయసున్నవారే. వీరిలో కూడా 24 ఏళ్లు కంటే తక్కువ వయసున్నవారే ఎక్కువ అని రజత్ కుమార్ వివరించారు.
ఈసారి ఎన్నికల్లో నిలబడే ప్రతీ నేత తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ప్రకటించాలని, అలాగే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా తెలియ చేయాలని అధికారులు ఆదేశించారు.
అయితే సోషల్ మీడియాలో ప్రచారానికి అయ్యే ఖర్చు, ఒక బహిరంగ సభకు అయ్యే ఖర్చులో నాలుగో వంతు కూడా ఉండదని చెబుతున్నారు సోషల్ మీడియా నిపుణులు.
"రూ.వెయ్యి ఖర్చుతో ఒక వీడియోను తమకు కావాల్సిన ప్రాంతానికి, కావాల్సిన ఏజ్ గ్రూప్ వారికి చేరేలా చేయొచ్చు. ఒక వార్తాపత్రికలో ఇచ్చే ప్రకటన, లేక హోర్డింగ్‌ను ఎంత మంది చూశారన్నది కచ్చితంగా చెప్పలేం. కానీ సోషల్ మీడియాలోని ప్రకటనలను లేక ప్రచారాన్ని ఎంతమంది చూశారు, ఎంతమంది షేర్ చేశారన్నది కచ్చితంగా చెప్పొచ్చు. కానీ, ఈ ప్రచారాన్ని కేవలం తమ అధికారిక పేజీలలోనే చేయాల్సిన అవసరం లేదు. ఒక అభిమాని తన పేజీలో అతనికి నచ్చిన నేతల ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెడితే దాన్ని ఎలా చూపిస్తారు?" అని రజనీకాంత్ అన్నారు.
ఏది ఏమైనా, సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న వినూత్న రాజకీయ వీడియోలు, ప్రకటనల భారం ఓటర్లపై పడుతోంది. ఈ ప్రచార ఫలితాలు ఎలా ఉండబోతాయో ఎన్నికల ఫలితాలే చెబుతాయి. సామాజిక మాధ్యమాలు రాజకీయ ప్రచార మాధ్యమాల్లాగ మారిపోయాయి. సోషల్ మీడియా వ్యూహకర్తలు చేతిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తినీ లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మొదటి ప్రపంచ యుద్ధం: భారత సైన్యం అక్కడికి చేరుకోకపోతే.. చరిత్ర మరోలా ఉండేది
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేని 5 పనులు
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడండి ఇలా..
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- ఫేక్‌న్యూస్‌కు వ్యతిరేకంగా బీబీసీ సరికొత్త భారీ అంతర్జాతీయ కార్యక్రమం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








