మొదటి ప్రపంచ యుద్ధం: 'మానవాళికి స్వాతంత్ర్యం కోసం మేం భారతీయులం కరువుపాలయ్యాం, బాధలు పడ్డాం'

భారత సైనికులకు పుష్పాన్ని బహుకరిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, IWM

ఫొటో క్యాప్షన్, భారత సైనికులకు పుష్పాన్ని బహుకరిస్తున్న మహిళ

మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు 13 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధాన్ని చాలామంది 'అన్ని యుద్ధాలకూ ముగింపు పలికే యుద్ధం' అని భావించారు. కానీ ఆ యుద్ధంలో పోరాడి, ప్రాణాలు కోల్పోయిన వాళ్లు త్వరలో రెండో ప్రపంచ యుద్ధం వస్తుందని ఊహించి ఉండరు.

ఆ యుద్ధం యూరప్ యవ్వనాన్ని చిదిమేసింది. యుద్ధంలో ఒక తరానికి చెందిన కళాకారులు, కవులు, రచయితలు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధంలో యూరప్ దేశాల మధ్య సంప్రదాయంగా వస్తున్న విద్వేషాలతో ఏమాత్రం సంబంధం లేని అనేకమంది సైనికులు కూడా ప్రాణాలను కోల్పోయారు.

ఆ యుద్ధంలో పాల్గొన్న 13 లక్షల మంది భారతీయ సైనికుల గురించి మనం చాలా తక్కువగా విని ఉంటాం.

ఆ యుద్ధంలో 74,187 మంది భారతీయ సైనికులు మరణించారు. ఇక గాయపడిన వాళ్లకు లెక్కే లేదు. వాళ్ల పోరాటగాథలు ఏ చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు. ఎక్కినా అవి కేవలం ఫుట్‌నోట్స్‌కు పరిమితమయ్యాయి.

భారతీయ సైనికులు యూరప్, మధ్యధరా, మెసపటోమియా, ఉత్తర అమెరికా, తూర్పు ఆఫ్రికాలలో జరిగిన యుద్ధాలలో పాల్గొన్నారు. యూరప్‌లో జరిగిన యుద్ధాల్లో ముందు వరుసలో ఉండే భారతీయులే మొదటి బలిపశువులు.

మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా ఫ్రాన్స్‌లో బ్రిటిష్, ఇండియన్ దళాలపై దాడిపై ది ఇలస్ట్రేటెడ్ వార్ న్యూస్ 1915లో ప్రచురించిన చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా ఫ్రాన్స్‌లో బ్రిటిష్, ఇండియన్ దళాలపై జరిగిన దాడిపై ది ఇలస్ట్రేటెడ్ వార్ న్యూస్ 1915లో ప్రచురించిన చిత్రం

పట్టించుకోని జాతీయోద్యమకారులు

1914లో బ్రిటన్ అప్పుడప్పుడే తన సొంత బలగాలను రిక్రూట్ చేసుకుని, వాళ్లకు శిక్షణ ఇచ్చే పనిలో ఉంది. ఆ సమయంలో బెల్జియంలోని యీప్ర వద్ద జర్మన్ బలగాలను అడ్డుకున్నది భారతీయ జవాన్లే. అలాగే న్యు ఛపేల్ వద్ద జరిగిన పోరాటంలో వందలాది మంది భారత సైనికులు అసువులు బాసారు. గల్లిపలి వద్ద జరిగిన పోరాటంలో వేయిమందికి పైగా మరణించారు.

అయితే ఈ అనుభవాలలో అత్యంత బాధాకరమైనవి యూరప్ ట్రెంచ్‌లలో పోరాడిన భారత సైనికులవి.

ఫ్రాన్స్, బెల్జియంలలో ఉన్న భారతీయ సైనికులు స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు రాసిన లేఖలు వారి బాధను, ఆవేదనను వెల్లడిస్తాయి. తమకు ఏ మాత్రం తెలియని నేల మీద, తమకు అలవాటు లేని పరిస్థితుల మధ్య, తీవ్రవాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, తమకు అసలు పరిచయమే లేని శత్రువుతో పోరాడుతూ నిత్యం ప్రాణాలను పణంగా పెట్టిన భారతీయ సైనికులను అటు బ్రిటిష్ ప్రభుత్వమూ, ఇటు స్వదేశంలోని స్వాతంత్ర్యపోరాటయోధులూ పట్టించుకోలేదు.

దీనికి కారణం వాళ్లు తమ స్వదేశం కోసం పోరాడ్డం లేదని స్వాతంత్ర్యపోరాటయోధులు భావించడమే.

గల్లిపలి యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్లిపలి యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులు

'మా భాషలో 'నేషన్' అన్న పదమే లేదు'

యుద్ధానికి అవసరమైన మానవ వనరులను, ఆహారాన్ని, నగదును, మందుగుండును బ్రిటిష్ భారతదేశం నుంచే పన్నుల ద్వారా, సంస్థానాధీశుల ద్వారా సమకూర్చుకుంది. యుద్ధంలో తమ తరపున పోరాడితే స్వయం పాలన ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చింది.

అయితే బ్రిటన్ ఆ హామీలను నిలబెట్టుకోలేదు. 1915 జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహాత్మా గాంధీ.. బోయర్ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించినట్లుగానే, ఈ యుద్ధంలోను వారికి సహకరించారు. ఈ విషయంలో నోబెల్ ప్రైజ్ విజేత రబీంద్రనాథ్ ఠాగూరే కొంత నయం. ఆయన ''మానవాళికి స్వాతంత్ర్యం కోసం మేం భారతీయులం కరువుపాలయ్యాం, బాధలు పడ్డాం'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''మా భాషలో 'నేషన్' అన్న పదమే లేదు'' అని యుద్ధాన్ని విమర్శించారు.

1915, జులై 28: భారత సైనికులతో కలిసి సేద తీర్చుకుంటునన్ బ్రిటన్ సైనికులు

ఫొటో సోర్స్, British Library

ఫొటో క్యాప్షన్, 1915, జులై 28: భారత సైనికులతో కలిసి సేద తీర్చుకుంటున్న బ్రిటన్ సైనికులు

జలియన్ వాలాబాగ్ దారుణం

భారత స్వాతంత్ర్య సమరయోధులు యుద్ధం ముగిసాక భారతదేశానికి 'డొమీనియన్' స్టేటస్‌ ఇస్తారని భావించారు.

కానీ అది జరగలేదు. యుద్ధం ముగిసి దానిలో బ్రిటన్ విజయం సాధించాక, భారతదేశానికి చేసిన హామీలను విస్మరించారు. స్వయం పాలనకు బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకువచ్చింది.

ఈ చట్టం కింద 'దేశద్రోహం' పేరిట బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించే వాళ్లను విచారణ లేకుండా నిర్భంధించేవారు. ప్రతికలను సెన్సార్ చేసేవాళ్లు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేవారు. దీనిపై పెల్లుబకిన ప్రజావ్యతిరేకతను కర్కశంగా అణచివేశారు. దీనిలో భాగంగా 1919, ఏప్రిల్‌లో జలియన్ వాలాబాగ్‌లో అత్యంత దారుణ సంఘటన జరిగింది.

అక్కడ సమావేశమైన సుమారు 15 వేల మంది నిరాయుధులపై జనరల్ డయ్యర్ తన బలగాలకు కాల్పులు జరుపమని ఆదేశించడంతో 1,499 మంది మరణించారు.

జనరల్ డయ్యర్‌ను బ్రిటిష్ ప్రభుత్వం కీర్తించడం అతనికి భారీ నగదు బహుమతిని ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసింది. బ్రిటన్ తీరుకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్ హుడ్‌ను తిరిగి ఇచ్చేశారు.

మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం దిల్లీలో నిర్మించిన ఇండియా గేట్

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్, మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం దిల్లీలో నిర్మించిన ఇండియా గేట్

త్యాగధనుల విస్మరణ

భారత స్వాతంత్ర్యపోరాటయోధులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికుల పట్ల ఎలాంటి విచారమూ వ్యక్తం చేయలేదు. కేవలం వాళ్లు తమ విదేశీ యజమానులకు సేవ చేయడానికి వెళ్లారని భావించారు. యుద్ధంలో పొరబాటున కాలో, చేయో కోల్పోతే దాన్ని విధి నిర్వహణలో భాగంగా జరిగిన ప్రమాదంగా పరిగణించేవారు తప్ప జాతి కోసం చేసిన త్యాగంగా గుర్తించలేదు.

బ్రిటిష్ ప్రభుత్వమే 1931లో దిల్లీలో ఇండియా గేట్ పేరుతో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికు కోసం ఒక స్మారక చిహ్మాన్ని నిర్మించింది.

1964లో మొదటి ప్రపంచ యుద్ధం 50వ వార్షికోత్సవం నిర్వహించినపుడు, భారతీయ సైనికుల త్యాగాన్ని ఎక్కడా స్మరించుకోలేదు. కనీసం భారతదేశంలో కూడా. దేశంలో ఎక్కడా వారికి స్మారక చిహ్నాలు కూడా లేవు.

మనది యుద్ధాన్ని కోరే దేశం కాకపోవచ్చు కానీ, అనేక యుద్ధాలలో పాల్గొని తమ ప్రాణాలు ధారపోసిన త్యాగధనుల కోసం ఒక స్మారకచిహ్నం లేకపోవడం దురదృష్టకరం.

విషాదకరం ఏమిటంటే.. బ్రిటిష్ తరపున పోరాడిన భారత బలగాల గురించి సాహిత్యం కూడా పెద్దగా రాలేదు. ముల్క్‌రాజ్ ఆనంద్ 'అక్రాస్ ద బ్లాక్ వాటర్స్' దీనికి మినహాయింపు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)