చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఆధునిక చరిత్రలో అతి ముఖ్యమైన యుద్ధాలలో ఒకటైన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 100 ఏళ్లైంది. అది దాదాపు ప్రపంచంలోని ప్రజలందరినీ ప్రభావితం చేసింది.
దానిని 'అన్ని యుద్ధాలకు ముగింపు పలికే యుద్ధం' అని కూడా పేర్కొన్నారు.
ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఎవ్వరూ కూడా 'యుద్ధానికి వెళ్లకూడదు' అని అనుకుంటారని భావించారు. (దురదృష్టవశాత్తూ అలా జరగలేదని మనకు తెలుసు)
ఆ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.
చాలా మంది భౌతికంగా గాయాలపాలై యుద్ధం నుంచి తిరిగి వచ్చారు. యుద్ధంలో తమ అనుభవాల కారణంగా మానసికంగా కృంగిపోయారు.
అయితే 1918, నవంబర్ 11న తుపాకులన్నీ నిశ్శబ్దం వహించినపుడు, దాని ప్రభావం చాలా మందిపై, చాలా ఏళ్ల పాటు పని చేసింది.
మొదటి ప్రపంచ యుద్ధం ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ప్రపంచాన్ని మార్చేసింది. అది ఎలాగంటే..

ఫొటో సోర్స్, Getty Images
సరికొత్త టెక్నాలజీ
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా సాంకేతిక పరిజ్ఞానంలో భారీ మార్పులు వచ్చాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయి.
యుద్ధం సందర్భంగా సరికొత్త ఆయుధాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దాని వల్ల గతంలో జరిగిన యుద్ధాలకన్నా ఎక్కువ నష్టం జరిగింది.
1914లో విమానాలు ఇంకా కొత్త. యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం 11 ఏళ్ల ముందు విమానాలు గాలిలోకి ఎగిరాయి.
అప్పటివరకు చాలా అరుదుగా, బలహీనంగా ఉండే విమానాలు.. యుద్ధం కారణంగా శక్తివంతంగా, వేగవంతంగా తయారయ్యాయి.
మొదట బాంబులను విమానాల నుంచే విసిరేశారు (వాటిని పైలెట్ చేతితో విసిరేసేవాడు). విమానాలను శతృదేశాల భూభాగంపై గూఢచర్యం చేసేందుకు ఉపయోగించేవారు. యుద్ధం ప్రారంభమైనపుడు ఫ్రాన్స్ వద్ద 140 విమానాలు ఉంటే యుద్ధం ముగిసేనాటికి వాటి సంఖ్య 4,500కు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధరంగంలో ట్యాంకుల ప్రవేశం
సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఆకాశానికే పరిమితం కాలేదు. బ్రిటన్ నేవీ 'యూ బోట్లు' అని పిలిచే జర్మన్ సబ్‌మెరైన్లను గుర్తించే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
మరోవైపు నేలపై విషపూరిత వాయువును ఒక ఆయుధంగా వాడడం మొదలైంది. దీంతో సైనికుల రక్షణ కోసం మాస్కులు వచ్చాయి.
తుపాకీ శబ్దాన్ని బట్టి శతృ సైనికుడు ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా గుర్తించే 'సౌండ్ రేంజింగ్' అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేశారు.
ట్యాంకులను కూడా మొదటిసారి ఆ యుద్ధంలోనే ఉపయోగించారు. అవి ఎలాంటి నేలపై అయినా దూసుకుపోయేవి. బ్రిటన్ మొదటిసారి 1916, సెప్టెంబర్ 15న ట్యాంకులను ఉపయోగించింది. యుద్ధ సమయంలో సుమారు 2,600 ట్యాంకులను బ్రిటన్ తయారు చేసింది.
కేవలం ఆయుధాలు మాత్రమే కాదు.. ఫొటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, సంభాషణా సాధనాలు కూడా ఆధునీకరణ చెందాయి.
ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం, యుద్ధ విధానాలు భవిష్యత్తు మిలటరీ వ్యూహాలకు, రెండో ప్రపంచ యుద్ధం ఏర్పాట్లకు చాలా ఉపయోగపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
వైద్య రంగంలో నూతన ఆవిష్కారాలు
యుద్ధంలో దెబ్బ తగిలిన సైనికులకు గతంలో ఎన్నడూ లేని విధానంలో వైద్యం చేయాల్సి వచ్చింది. దీంతో యుద్ధానికి తగిన విధంగా వైద్యరంగంలో కూడా నూతన ఆవిష్కారాలు రావాల్సిన అవసరం ఏర్పడింది.
రక్తాన్ని దానం చేయడం కూడా మొదటి ప్రపంచ యుద్ధంతోనే మొదలైంది. అమెరికాకు చెందిన కెప్టెన్ ఓస్వాల్డ్ రాబర్ట్‌సన్ రక్తాన్ని నిలువ చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఓస్వాల్డ్ 1917లో మొదటి బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు.
విరిగిన కాళ్ల కోసం థామస్ స్ల్పింట్ అనే పిలిచే ప్రత్యేక రాడ్‌ను కూడా కనుగొన్నారు. యుద్ధం ప్రారంభమైనపుడు విరిగిన కాళ్లు ఉన్న ఐదుగురు సైనికులలో నలుగురు మరణించేవారు. కానీ 1916 వారి సంఖ్యను ఒకరికి తగ్గించగలిగారు.
ఆర్థిక సమస్యలు
యుద్ధం చాలా ఖరీదైనది. 1918లోనే కేవలం ఒకరోజుకు రూ.36 కోట్ల విలువైన బుల్లెట్లు ఖర్చయ్యేవి. యుద్ధానికి ముందు బ్రిటన్ ప్రపంచంలోనే ఆర్థికంగా అతి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేది.
కానీ యుద్ధం ఆ దేశం మొత్తం సంపదను ఊడ్చేసింది. బ్రిటన్ ఒక్కటే కాదు, చాలా యూరోపియన్ దేశాల పరిస్థితి కూడా అదే.
మరీ ముఖ్యంగా జర్మనీ యుద్ధానికి పరిహారంగా రూ.63 వేల కోట్లు పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల పాత్ర
యుద్ధం ప్రారంభం వరకు మహిళలు సంప్రదాయంగా ఇంటి పట్టునే ఉండేవాళ్లు.
బ్రిటన్‌లాంటి దేశాలలో అప్పుడప్పుడే సమాజంలో వాళ్ల స్థితిని మెరుగుపరిచే చట్టాలు వస్తున్నాయి.
కానీ ఒక్కసారి యుద్ధం ప్రారంభమై, పురుషులంతా యుద్ధానికి వెళ్లడంతో బ్రిటన్‌లో పనులన్నీ సక్రమంగా కొనసాగడానికి మహిళలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. 1918 చివరినాటికి బ్రిటన్‌లో ప్రతి పదిమంది కార్మికులలో తొమ్మిది మంది మహిళలే.
మహిళలు ట్రాములు, బస్సుల్లో కండక్టర్లుగా, టైపిస్టులుగా, చివరికి రైతులుగా కూడా పని చేయడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం వాళ్ల వస్త్రధారణను కూడా మార్చేసింది. మహిళలు ట్రౌజర్లు వేసుకోవడం మొదలైంది. బాబ్డ్ హెయిర్‌కు ఆదరణ పెరిగింది.
యుద్ధానంతరం 1919లో ప్రీవార్ ప్రాక్టీసెస్ యాక్ట్ చట్టం అమలులోకి రావడంతో మహిళలు తిరిగి ఇంటి పనులు చేసుకోవాల్సి వచ్చింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మహిళలు మరోసారి పరిశ్రమలలో ఉద్యోగాలు చేపట్టారు.
యుద్ధంలో మహిళల పాత్ర తర్వాత కాలంలో చట్టాలలో అనేక మార్పులు తీసుకురావడానికి, వారికి సమానావకాశాలు కల్పించేందుకు దోహదపడింది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాల్లో పెనుమార్పులు
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా యూరప్ రాజకీయ ముఖచిత్రం కూడా మారిపోయింది. దేశాల సరిహద్దులు మారిపోయాయి. ఎవరు ఎక్కడి వరకు పాలించాలి అన్నదానిపై వివాదాలు ప్రారంభమయ్యాయి. వర్సైల్ ఒప్పందం ప్రకారం జర్మనీ తన భూభాగంలో పదోభాగాన్ని కోల్పోయింది. తర్వాత జరిగిన ఒప్పందాల్లో బల్గేరియా, ఆస్ట్రియా, హంగరీ కూడా తమ భూభాగాలను కోల్పోయాయి.
మొదటి ప్రపంచ యుద్ధంతో ఒట్టోమన్ టర్కిష్ సామ్రాజ్యం అంతమైంది. యుద్ధం రష్యా విప్లవానికి కూడా దోహదపడింది. దాంతో ప్రపంచంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థ - కమ్యూనిజం ఉనికిలోకి వచ్చింది.
నేడు కూడా కొన్ని ప్రాంతాలపై ఎవరి పట్టు ఉండాలన్న దానిపై వివాదం ఉన్నా, మొదటి ప్రపంచ యుద్ధం మాత్రం యూరప్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండాలన్న దానిపై చాలా ప్రభావం చూపింది.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం
రెండో ప్రపంచ యుద్ధానికి మొదటి ప్రపంచ యుద్ధమే ఖచ్చితంగా కారణమని చెప్పలేం కానీ, మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీకి వర్సైల్ ఒప్పందంలో విధించిన శిక్షలు రెండో ప్రపంచ యుద్ధానికి దోహద పడ్డాయని చెప్పవచ్చు.
1919లో ఈ ఒప్పందం కింద విధించిన జరిమానాలు జర్మనీని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అది జర్మనీకి తీరని అవమానం కలిగించింది. దాంతో చాలా మంది దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.
దేశంలో పేదరికం పెరిగిపోయి, రాజకీయంగా అస్థిరత ఏర్పడినపుడు అడాల్ఫ్ హిట్లర్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని నియంతగా మారడానికి తగిన వాతావరణం ఏర్పడింది.
దాని కారణంగా 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది.
ఇవి కూడా చదవండి
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- మూఢనమ్మకం: దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా?
- వీళ్లిద్దరూ ఒకప్పుడు శరణార్థులు.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళలు
- విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'
- నోట్ల రద్దుకు రెండేళ్లు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- Fake News -గుర్తించడం ఎలా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








