అభిప్రాయం: "పేర్ల మార్పును ఒకప్పుడు బీజేపీనే వ్యతిరేకించింది"

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శరత్ ప్రధాన్
- హోదా, బీబీసీ కోసం
దీపావళికి ఒక రోజు ముందు నవంబర్ 6న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించలేదు. మూడువారాల క్రితం అలహాబాద్ పేరును ప్రయాగ్‌గా మార్చిన నాటి నుంచి ఇది జరుగుతుందని అందరూ అనుకుంటూనే ఉన్నారు.
ఎందుకంటే మతాలను విడదీసి, మత చిహ్నాల చుట్టూ ఆధారపడిన రాజకీయాలు చేసే యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యతా క్రమంలో నగరాలు, ప్రాంతాల పేర్లను మార్చడమన్నది మొదటి నుంచి ప్రధానంగా ఉంది.
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించక ముందు నుంచీ యోగి ఆధిత్యనాథ్‌కు తన స్వస్థలం, రాజకీయంగా పట్టు ఉన్న గోరఖ్‌పూర్‌లో ప్రాంతాల పేర్లు మార్చే అలవాటు ఉంది.
ఆయన గోరఖ్‌ఫూర్ ఎంపీగా ఉన్న కాలంలో అక్కడ మియా బజార్‌ను మాయా బజార్‌గా, హుమయూన్‌పూర్‌ను హునుమాన్‌పూర్‌గా మార్చారు.
ఇలా నగరాలు, ప్రాంతాల పేర్లను మార్చడం వల్ల ఏం మేలు జరుగుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కొంతమంది మధ్యయుగపు పాలకులు మతపరమైన అసహనం చూపారన్న ఆరోపణలు ఉన్నా, నేటి 21వ శతాబ్దపు పాలకులతో పోలిస్తే వాళ్లు చాలా సహనవంతులని మనకు చరిత్ర చెబుతోంది.

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra/BBC
నవాబు ఖజానా నుంచి నిధులు
ప్రయాగ్, అయోధ్య పేర్లు ఎంతో పురాతన కాలం నుంచి ఉన్నాయని, అయితే ఏ పాలకుడూ ఆ పేర్లను మార్చడానికి ప్రయత్నించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
పదహారవ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి అక్బర్ 'ఇలాహాబాస్' నగరాన్ని నిర్మించారు.
అది బ్రిటిష్ పాలకుల సమయంలో 'అలహాబాద్'గా మారింది. అయితే దానిని ఎన్నడూ ప్రయాగ్‌గా మార్చే ప్రయత్నాలు జరగలేదు.
అదే విధంగా 1730లో ఘాగ్రా నది ఒడ్డున ఫైజాబాద్‌ను నిర్మించిన అవధ్ మొదటి నవాబు సాదత్ అలీ ఖాన్, రాముని జన్మభూమిగా భావించే అయోధ్యకు ఎలాంటి కొత్త పేరూ పెట్టడానికి ప్రయత్నించలేదు. ఆలయం ఉన్న ఆ పురాతన నగరం చివరికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఫైజాబాద్ జిల్లాలో భాగంగా మారింది.
ఒక ప్రముఖ హిందూ తీర్థయాత్రా ప్రదేశంగా పేరొందిన అయోధ్యలోని ఆర్థిక కార్యకలాపాలన్నీ మతపరమైన టూరిజం చుట్టూ కేంద్రీకృతమై జరుగుతాయి.
అయోధ్యలోని ఆ పురాతన ఆలయం - హనుమాన్ గర్హి నిర్వహణకు అవసరమైన నిధులు నవాబ్ ఖజానా నుంచే అందేవని రికార్డులు చెబుతున్నాయి.
సాదత్ అలీ ఖాన్ మనవడు అలఫ్ ఉద్దౌలా అవధ్ రాజధానిని ఫైజాబాద్ నుంచి లక్నోకు మార్చినా ఆ సంప్రదాయం కొనసాగింది.

ఫొటో సోర్స్, Ankit Srinivas
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్.. మాటలకే పరిమితమా?
'ఇలాహాబాస్' అంటే దేవుని నివాసం అని, ‘ఫైజాబాద్’ అంటే అందరి మంచి కొరకు ఏర్పాటు చేసిన ప్రదేశము.
ఈ రెండూ పాలకుల మతసహనాన్ని వెల్లడిస్తున్నాయి. వారికి హిందూ ప్రజల భావాలు పట్టనట్లయితే, తమ ఇష్టానుసారం ఆ నగరాల పేరును మార్చేవారు. దానికి బదులుగా వారు పాత నగరాల చుట్టూ కొత్త నగరాలను నిర్మించాలని నిర్ణయించారు.
దానికి భిన్నంగా యూపీ ముఖ్యమంత్రి ఎవరి అభిప్రాయాన్నీ తీసుకోకుండా అలహాబాద్, ఫైజాబాద్‌ల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనిని బట్టి 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న ప్రచారం.. మాటవరసకే అని, కేవలం కొన్ని వర్గాల కోసమే ఇలా పేర్లను మారుస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వమే గనుక ఇలా పేర్లను మార్చడం వల్ల ఆ రెండు ప్రదేశాలకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని భావించినట్లయితే, సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి ప్రయాగ్, అయోధ్యలను రెండు స్వతంత్ర జిల్లాలుగా చేసేవారు.
నిజానికి కొత్త జిల్లాలను సాధారణంగా అలాగే ఏర్పాటు చేస్తారు. దాని వల్ల అలహాబాద్, ఫైజాబాద్ అన్న పేర్లను తొలగించకుండానే అయోధ్, ప్రయాగ్ అన్న పురాతన చరిత్ర ప్రాధాన్యతను కాపాడేవారు. తత్ఫలితంగా ప్రభుత్వ రికార్డులు, సంస్థలలో పేర్లను మార్చేందుకు అవసరమయ్యే కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అయ్యేది.

ఫొటో సోర్స్, Hindustan Times
దురదృష్టకరం ఏమిటంటే, సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ జిల్లాలకు మాయావతి పెట్టిన దళిత ప్రముఖుల పేర్లను మార్చాలని నిర్ణయించినపుడు ఇదే బీజేపీ దానిని తీవ్రంగా వ్యతిరేకించింది.
కొన్నాళ్ల క్రితం యోగి ఈ దీపావళికి అయోధ్య విషయంలో ఒక శుభవార్త వింటారని అన్నారు.
ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చడం వల్ల రామమందిరం నిర్మిస్తామని చేసిన హామీపై నిర్దిష్ట చర్యల కోసం వేచి చూస్తున్న వాళ్లనేమీ సంతృప్తి పరచదు.
అయోధ్యలోని రామ్‌కథా పార్కులో శ్రీరాముని భారీ విగ్రహాన్ని నిర్మిస్తామన్న ప్రకటన కూడా వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు ప్రదేశం వద్ద ఆలయ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వర్గాలకు ఊరట కలిగించబోదు.
ఈ పేర్ల మార్పు వల్ల కలిగే ఒకే ఒక్క లాభం ఓట్లను చీల్చడం. దానిని ఎలా సాధిస్తే ఏం?
ఇవి కూడా చదవండి
- వీళ్లిద్దరూ ఒకప్పుడు శరణార్థులు.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళలు
- నోట్ల రద్దుకు రెండేళ్లు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'
- అమెరికా అటార్నీ జనరల్‌ను తొలగించిన డోనల్డ్ ట్రంప్
- జపాన్ పిల్లల ఆత్మహత్యలు: ఏడాదిలో 250 మంది మృతి – 30 ఏళ్లలో ఇదే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








