అయోధ్య వివాదం: 1994 తీర్పును సమీక్షించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
మసీదులో నమాజ్ చేయడం అనేది ఇస్లాం మతంలో అంతర్భాగం కాదంటూ 1994లో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సమీక్ష కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.
1994 ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పులో "ప్రార్థనలు ఎక్కడైనా చేసుకోవచ్చు, నమాజ్ మసీదులోనే చేయాలనేమీ లేదు" అని సుప్రీం కోర్టు చెప్పింది.
ఆ తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం తీర్పు ఇచ్చింది.
జడ్జిమెంట్‌ను ధర్మాసనానికి చదివి వినిపించిన జస్టిస్ అశోక్ భూషణ్, 1994లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందన్నారు.
అయితే, జస్టిస్ అశోక్ భూషణ్, చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రాలతో జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విభేదించారు. మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగమా? కాదా అన్నది తేల్చేందుకు మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంలో విస్తృత పరిశీలన జరగాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య భూ వివాదం కేసు
అక్టోబర్ 29న అయోధ్య భూమి వివాదం కేసు విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అక్టోబర్ 2న ప్రస్తుత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ పొందుతున్నందున, ఆయన కొత్తగా వచ్చే న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పడే త్రిసభ్య ధర్మాసనం ఆ విచారణ చేపడుతుందని తెలిపింది.
అయోధ్యలోని వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా? కాదా అన్న అంశం తెరపైకి వచ్చింది.
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేసి వాటి యాజమాన్య హక్కులను సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లాలాకు అప్పగిస్తూ 2010లో 2:1 మెజార్టీతో ముుగ్గురు సభ్యుల అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఆ తీర్పును సవాల్ చేస్తూ హిందూ, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








