వాణిజ్య ప్రకటనల్లో పురుషుల ధోరణి మారుతోందా?

దీపికా పదుకోణ్

ఫొటో సోర్స్, AFP/getty images

ఫొటో క్యాప్షన్, దీపికా పదుకోణ్
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్‌కు ఒక శుభలేఖ అందింది. ఆ పెళ్లికి హాజరుకావాలని నిశ్చయించుకున్న ఆమె అందుకోసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్లింది.

అక్కడ నచ్చిన డ్రెస్ కొనుక్కుంది కానీ, అది ఆమెకు చిన్నదైపోయింది.

అప్పుడామె ఏం చేసిందో తెలుసా..?

ఏం చేస్తుంది..? కొత్త డ్రెస్ చిన్నదైపోతే వెంటనే షాప్‌కి వెళ్లి దాన్ని ఎక్స్చేంజి చేస్తాం కదా అనుకోవద్దు. దీపికా అలా చేయలేదు. కేవలం రెండు వారాల పాటు 'కెలాగ్స్ కార్న్ ఫ్లేక్స్' తింటుంది అంతే. స్లిమ్‌గా మారిపోయి ఆ డ్రెస్ ఆమెకు సరిపోతుంది.

ఇదంతా ఎక్కడో చూసినట్లుగా ఉంది కదా. అవును, టీవీలో కనిపించే వాణిజ్య ప్రకటన ఇది.

కెలాగ్స్ కార్న్ ఫ్లేక్స్ తిని సన్నగా మారాక ఆమె నాజూకైన నడుమును కెమేరా క్లోజప్‌లో చూపిస్తుంది.. అప్పుడామె, 'ఇది పెళ్లిళ్ల సీజన్. తగ్గించుకోవాల్సింది మీ బరువును, ఆత్మవిశ్వాసాన్ని కాదు' అంటూ సందేశం కూడా ఇస్తుంది.

మహిళలు నాజూగ్గా ఉంటేనే అందంగా ఉన్నట్లని, సన్నగా లేని ఆడవాళ్లకు ఆత్మవిశ్వాసం ఉండదని ఈ ప్రకటనలో ధ్వనిస్తోంది.

దశాబ్దాలుగా వాణిజ్య ప్రకటనలు మహిళలను ఇలాగే చూపిస్తున్నాయి. ఆడవాళ్లంటే అందంగా, సన్నగా ఉండేవారుగా, ఇంటిపనులను చక్కగా చక్కబెట్టే గృహిణులుగా, ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధుల బాగోగులు చూసుకునేవారుగానే చూపిస్తున్నారు.

ఇంటి పనుల్లో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా దేశాల్లోని వాణిజ్య ప్రకటనల్లో పురుషుల పాత్రలూ మూస ధోరణిలోనే ఉంటున్నాయని అంతర్జాతీయ మీడియా సలహా సంస్థ 'ఎబిక్విటీ', బహుళజాతి సంస్థ యూనిలీవర్‌లు జరిపిన తాజా అధ్యయనం వెల్లడించింది.

ఆసియా దేశాల్లో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల్లో కేవలం 9 శాతమే పురుషులను పిల్లల సంరక్షణ, ఇతర ఇంటిపనులు చేసేవారిగానూ చూపిస్తున్నాయట.

ఇక మగవాళ్లను మంచి నాన్నలుగా చూపించే వాణిజ్య ప్రకటనలు 3 శాతం మాత్రమేనని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో చైనా, భారత్, ఇండోనేసియాల్లో ప్రసారమైన 500 వాణిజ్య ప్రకటనలను లోతుగా పరిశీలించి ఈ అధ్యయన నివేదిక రూపొందించారు.

కేవలం 2 శాతం ప్రకటనల్లోనే 40 ఏళ్లకు పైబడిన పురుష పాత్రలున్నాయని.. 1 శాతం ప్రకటనల్లో మాత్రమే అందంతో సంబంధం లేకుండా పురుష నటులను ఎంచుకున్నారని ఈ అధ్యయనం తెలిపింది.

ఏరియల్ ప్రకటనలో సన్నివేశం

ఫొటో సోర్స్, facebook/ArielIndia

మూసకు భిన్నం.. మగువకు పట్టం

ఫ్యాన్లు తయారుచేసి విక్రయించే సంస్థ హావెల్స్ 'గాలి మారుతుంది' అంటూ ఇస్తున్న వాణిజ్య ప్రకటనలో ఒక యువ జంట తమ వివాహాన్ని రిజిష్టర్ చేయించడానికి వెళ్తుంది.

అక్కడా పెళ్లికొడుకు ఈ పెళ్లి తరువాత తన భార్య ఇంటిపేరేమీ మార్చాల్సిన అవసరం లేదని చెప్తాడు. అంతేకాదు, తాను తన భార్య ఇంటిపేరును స్వీకరించి తన పేరు ముందు జోడిస్తాడు.

ఏరియల్ డిటర్జెండ్ పౌడర్ ప్రకటన కూడా మిగతావాటికంటే భిన్నంగా ఉంటుంది. అందులో.. బాగా సాయంత్రమయ్యాక ఆఫీసు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఫోన్లో ఇంకా ఆఫీస్ వ్యవహారాలు చక్కబెడుతూనే ఇంట్లో ఒక్కో పని చేయడం మొదలుపెడుతుంది. భర్తకు టీ ఇవ్వడం, ఇంట్లో చిందరవందరగా పడిన వస్తువులు సర్దడం, మరోవైపు వంట, ఇంకోవైపు వాషింగ్ మెషీన్లో భర్త బట్టలు ఉతకడం చేస్తుంది.

అక్కడే ఉన్న తండ్రి ఆ పరిస్థితిని చూసి బాధపడతాడు. తాను కానీ, తనలాంటి ఇతర తండ్రులు కానీ ఇంటి పనులు షేర్ చేసుకోవాలని కొడుకులకు చెప్తే ఆడపిల్లలకు ఇంత కష్టం ఉండదు కదా అనుకుంటాడు.

అప్పుడా తండ్రి ఒక ఉత్తరం రాసి టేబుల్‌పై పెట్టి వెళ్తాడు. ఆ రోజు నుంచి తాను తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తానని మాటిస్తాడు.

'ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్, డెవలప్‌మెంట్' చేసిన ఓ సర్వేలో భారతీయ పురుషులు సగటున కేవలం 19 నిమిషాలే ఇంటిపనులకు కేటాయిస్తారని.. అదేసమయంలో మహిళలు 298 నిమిషాల సమయం ఇంటిపనుల్లోనే గడుపుతారని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇంకే దేశంలోనూ పురుషులు ఇంత తక్కువ సమయం ఇంటిపనులకు కేటాయించడం లేదు.

స్కాచ్‌బ్రైట్ కంపెనీ ప్రకటనలో ఒక పురుషుడు గిన్నెలు తోముతూ కనిపిస్తాడు

ఫొటో సోర్స్, facebook/ScotchBrite

ఫొటో క్యాప్షన్, స్కాచ్‌బ్రైట్ కంపెనీ ప్రకటనలో ఒక పురుషుడు గిన్నెలు తోముతూ కనిపిస్తాడు

మార్పు రావాలి

అయితే, వాణిజ్య ప్రకటనల్లో వస్తున్న మార్పులు పురుషుల ఆలోచనల్లో మార్పు తేవొచ్చు.

స్కాచ్‌బ్రైట్ కంపెనీ ప్రకటనలో ఒక పురుషుడు గిన్నెలు తోముతూ కనిపిస్తాడు. 'ఇల్లు అందరిదీ.. పనీ అందిరిదీ' అని చెప్తాడు.

మరోవైపు, రేమండ్ సంస్థ కూడా 'ది కంప్లీట్ మేన్' అనే తమ పాత నినాదాన్ని పునర్నిర్వచించింది. ఆ సంస్థ ప్రకటనలో భర్త ఇంట్లో ఉండి తమ చిన్నారి పాప బాగోగులు చూసుకుంటాడు. భార్యేమో కాన్పు తరువాత మళ్లీ ఆఫీసులో జాయినవుతుంది.

మొబైల్ ఫోన్ల తయారీసంస్థ మైక్రోమ్యాక్స్ మరింత ప్రత్యేకంగా తన ప్రకటనను రూపొందించింది. రాఖీ పండుగ సందర్భంగా ఆ సంస్థ ప్రసారం చేసిన ప్రకటనలో ఒక అన్న తన చెల్లెలికి రాఖీ కడుతున్నట్లుగా చూపిస్తారు అందులో. సాధారణంగా ఆడవాళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, ఇందులో అందుకు భిన్నంగా చూపించారు.

దుస్తుల విక్రయ సంస్థ 'బిబా' అడ్వర్టయిజ్‌మెంట్‌లో పెళ్లి చూపుల సన్నివేశం ఉంటుంది. అక్కడ తండ్రి తన కుమారుడికి కట్నం వద్దని చెప్తాడు.

వాణిజ్య ప్రకటనల్లో ఇలాంటి ప్రగతిశీల మార్పులు కనిపిస్తున్నా ఇలాంటివి ఇంకా పెరగాల్సి ఉంది. ఇందుకోసం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టయిజర్స్‌, ప్రకటనల సంస్థలతో కలిసి ఐరాస 2017లో 'అన్‌స్టీరియోటైప్ అలయన్స్'గా ఏర్పడి మూసకు భిన్నమైన ప్రకటనల రూపకల్పన దిశగా కృషి చేస్తోంది.

సమానత్వ సాధన దిశగా ప్రకటనలు రూపొందించాలని.. ఇందుకోసం ప్రకటనల రంగం సమాజపు వాస్తవ రూపాన్ని ధైర్యంగా చూపించాలని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టయిజర్స్ అధ్యక్షుడు అన్నారు.

అన్‌స్టీరియోటైప్ అలయన్స్‌లో ఉన్న యూనిలీవర్ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి 'సిక్స్ ప్యాక్ బ్యాండ్' పేరుతో ట్రాన్స్‌జెండర్ల బ్యాండ్ ఒకటి ఏర్పాటుచేస్తోంది. 'మేం సంతోషంగా ఉన్నాం' అంటూ చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమం ట్ర్రాన్స్‌జెండర్లపై సమాజంలో ఉన్న భావనను మార్చడమే లక్ష్యంగా రూపొందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)