దళిత, మైనారిటీలలో పేదరికం వేగంగా తగ్గుతోంది. కానీ...

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో పేదరికం రేటు 2005-06 నుంచి 2015-16 మధ్య 55 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గినట్లు ఎంపీఐ సూచీ చెప్తోంది
    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విభిన్న రూపాల్లో ఉన్న పేదరికాన్ని తగ్గించటంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించిందని, 2005-6 నుంచి 2015-16 మధ్య పదేళ్లలో పేదరికం దాదాపు సగానికి తగ్గిపోయిందని ఒక అంతర్జాతీయ నివేదిక తాజాగా వెల్లడించింది.

అయితే, ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు భారతదేశంలోనే ఉన్నారని ఆ నివేదిక చెబుతోంది. అందులోనూ, సాంప్రదాయికంగా వెనుకబడిన ఉపవర్గాల వారు, గ్రామీణ ప్రజలు, దిగువ కులాలు, తెగల వారు, ముస్లింలు ఇంకా నిరుపేదలుగా ఉన్నారని ఆ నివేదిక వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా పేదరికం తీరుతెన్నులపై బహుముఖ పేదరిక సూచీ (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ - ఎంపీఐ)ని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ (ఓపీహెచ్‌ఐ) ఇటీవల వెల్లడించాయి.

''పేదలు ఎదుర్కొనే అనేక రకాల ప్రతికూలాంశాలను, అంటే చదువుకోలేకపోవడం, పోషకాహారం లేకపోవడం, సరైన వైద్య సహాయం అందకపోవడం, సరైన ఇల్లు,, రక్షిత మంచినీరు లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించాం'' అని ఓపీహెచ్ఐ ప్రచురించిన ఈ నివేదిక పేర్కొంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 105 దేశాలలో పేదరికం తీరుతెన్నులను ఈ సూచీ వివరిస్తోంది. ఈ దేశాల్లో ప్రస్తుతం 130 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పింది. పేదరికాన్ని తగ్గించడంలో విశేష ప్రగతి సాధించిన భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇవీ ఆ నివేదికలోని ముఖ్యాంశాలు:

జిల్లాల వారీగా పేదరికం తీవ్రత

ఫొటో సోర్స్, OPHI REPORT

ఫొటో క్యాప్షన్, బహుముఖ పేదరికం సూచీలో దక్షిణ భారతదేశానికి - ఉత్తర మధ్య భారతదేశానికి మధ్య విస్పష్టమైన విభజన కనిపిస్తోంది...

పదేళ్లలో 63.5 కోట్ల నుంచి 36.4 కోట్లకు తగ్గిన పేదలు

భారతదేశంలో బహుముఖ పేదరికం రేటు 2005-06 నుంచి 2015-16 మధ్య 55 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గింది. అంటే.. 2005-06 నాటికి దేశంలో 63.5 కోట్ల మంది పేదలుగా ఉంటే.. పదేళ్లలో 27.1 కోట్ల మంది జనం పేదరికం నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా పేదల ఆర్థికాభివృద్ధి వల్ల ఇది సాధ్యమైంది.

దేశంలో పదేళ్లలో పేదరికం సగానికి తగ్గిపోయినా.. ఇంకా 36.4 కోట్ల మంది భారతీయులు పేదరికంలోనే మగ్గుతున్నారు. అందులోనూ 34.5 శాతం మంది.. అంటే 15.6 కోట్ల మంది చిన్నారులే. నిజానికి.. ఈ నిరుపేదలు ప్రతి నలుగురిలో ఒకరు పదేళ్లు కూడా నిండని పసివారు.

ఈ పదేళ్లలో, అందునా జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న కాలంలో... ఇంత వేగంగా పేదరికం తగ్గటం విశేషం. ఈ లెక్కలు 2015-16 నాటివి కనుక ప్రస్తుత లెక్కల్లో ఇంకాస్త తేడా ఉండొచ్చు. అయితే, పదేళ్లలో చాలా మార్పు తీసుకురావచ్చని ఈ పరిణామం చాటుతోంది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

విముక్తి పొందిన వారిలో ముస్లింలు, ఎస్‌టీలే మెజారిటీ...

సాంప్రదాయికంగా అననుకూల పరిస్థితుల్లో ఉన్న గ్రామీణ ప్రజలు, దిగువ కులాలు, తెగల వారు, ముస్లింలు, చిన్నారులు.. కడు పేదరికం నుంచి గరిష్టంగా విముక్తి పొందారు.

నిజానికి, 1998-99 నుంచి 2005-06 మధ్య కాలంలో ఈ వర్గాల వారి పరిస్థితి తిరోగమనంలో ఉంది. ఆ కాలంలో నిరుపేద వర్గాల వారి పురోగతి అత్యంత మందకొడిగా ఉండింది. వారిని వెనుకనే వదిలేశారు.

2005-06 నుంచి 2015-16 మధ్య పేదరికం నుంచి బయటపడ్డ వారిలో పేదలు ఎక్కువగా ఉన్న మత, కుల వర్గాల (ముస్లింలు, షెడ్యూల్డు తెగలు) వారు అధికంగా ఉన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, తక్కువగా ఉన్న రాష్ట్రాలు రెండింటిలోనూ వీరే అధికంగా మెరుగయ్యారు.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

గ్రామీణులు, వెనుకబడిన కులాలు, ముస్లింలు... నిరుపేదలు

అయినా, దేశంలో ఇంకా అత్యధిక శాతం పేదరికం ఈ రెండు వర్గాల వారిలోనే ఉంది. ఉదాహరణకు 2005-06 లో షెడ్యూల్డు తెగల వారిలో 80 శాతం మంది పేదలు ఉంటే.. ఇప్పుడు వారిలో 50 శాతం మంది పేదరికంలో ఉన్నారు. ఇంత వేగవంతమైన అభివృద్ధి ఉన్నప్పటికీ... సంఖ్యాపరంగా పేదలు ఇప్పటికీ ఈ వర్గాల్లోనే ఉన్నారు.

అంటే, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజల్లో సగం మంది నిరుపేదలు. కాగా, అగ్ర కులాల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే పేదలు.

అలాగే, క్రైస్తవుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పేదరికంలో ఉండటంతో పోలిస్తే, ప్రతి ముగ్గురు ముస్లింలలో ఒకరు పేదరికంలో ఉన్నారు.

ఇక పదేళ్ల లోపు వయసున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు దుర్భరస్థితిలో మగ్గుతున్నారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వారిలో 24 శాతం మంది పేదలు.

ఉత్తరాది రాష్ట్రాల్లో పేదరికం భారీగా తగ్గినా...

రాష్ట్రాల వారీగా చూస్తే, జార్ఖండ్‌లో అత్యధిక ప్రగతి కనిపించింది. ఆ తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్ ఉన్నాయి. అంటే వేగంగా ప్రగతి సాధించినా ఇప్పటికీ మిగిలిన రాష్ర్టాలతో పోల్చినపుడు

దేశంలో కడుపేద రాష్ట్రం బిహార్. 2015-16 నాటికి రాష్ట్ర జనాభాలో సగానికి పైగా పేదరికంలో ఉన్నారు. దేశంలో ప్రస్తుతమున్న పేద జనాభాలో సగం మందికి పైగా పేదలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు.

అలాగని.. పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఏమీ స్తంభించిపోలేదు. వాటిలోనూ పేదరికం తగ్గింది. నిజానికి.. ఉదాహరణకు 2005-06లో పేదలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో పేదరికం పదేళ్లలో 92 శాతానికి పైగా తగ్గిపోయింది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలోని పేదల్లో దాదాపు సగం మంది, అంటే 15.6 కోట్ల మంది చిన్నారులే. ప్రపంచ వ్యాప్తంగా కూడా పేదల సంఖ్యలో సగం చిన్నారులే.

పోషకాహార లోపం... పేదరికం ప్రధాన శాపం

భారతదేశంలో పేదరికానికి సంబంధించిన ఎంపీఐ సూచీలో ప్రధానాంశం పోషకాహార లోపం. దేశంలో పేదరికానికి 28.3 శాతం ఈ అంశమే ప్రధానంగా ఉంది. ఇక ఇల్లు లేకపోవటం అనేది 16 శాతం కారణంగా ఈ సూచీలో రెండో ముఖ్యాంశంగా ఉంది.

పరిశుభ్రమైన తాగునీరు అందకపోవటం (2.8 శాతం), శిశుమరణాలు (3.3 శాతం) ఈ సూచీలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అయితే, పాఠశాలకు వెళ్లలేకపోవటం అనే సమస్య పేదల్లో తగ్గిపోయి ఏదోలా పిల్లలను బడికి పంపించే పరిస్థితి రావడం మెరుగుదలకు సంకేతం.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపీఐ సూచీ ప్రకారం ప్రతి ముగ్గురు ముస్లింలో ఒకరు పేదరికంలో ఉన్నారు

ఏపీ, తెలంగాణల్లో పేదరికం ఎలా ఉంది?

ఈ పేదరిక సూచీ నివేదికలో భాగంగా భారతదేశంలో జిల్లాల వారీగా పేదరికం వివరాలను కూడా వెల్లడించారు. దాని ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో పేదల సంఖ్య స్వల్పంగా ఉంది. అత్యధిక సంఖ్యలో పేదలు కర్నూలు (23.9 శాతం), విజయనగరం (22.7 శాతం) జిల్లాల్లో ఉన్నారు.

తెలంగాణ జిల్లాల్లో పేదరికం ఇలా...

తెలంగాణలోని 10 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదరికం 10 శాతం కన్నా తక్కువగా.. ఐదారు శాతం మేరకే ఉంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 12 శాతం నుంచి 17 శాతం వరకూ జనాభా పేదలుగా ఉంటే.. ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాల్లో 20 శాతం నుంచి 30 శాతం మంది పేదలు ఉన్నారు. ఆదిలాబాద్ జనాభాలో దాదాపు 35 శాతం మంది పేదలున్నారు.

దేశంలో 19 జిల్లాల్లో పేదలు 1 శాతం కన్నా తక్కువ...

దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా అత్యంత పేద జిల్లా. ఇక్కడ 76.5 శాతం మంది జనాభా పేదరికంలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని మరో నాలుగు జిల్లాల్లో 70 శాతం కన్నా ఎక్కువ మంది జనాభా పేదలు. అలాగే.. దేశంలో 27 జిల్లాల్లో 60 నుంచి 70 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు.

ఇక పేద జనాభా ఒక్క శాతం కన్నా తక్కువున్నఅంటే దాదాపుగా పేదరికాన్ని పూర్తిగా దాటేసిన జిల్లాలు 19 ఉన్నాయి. మరో 42 జిల్లాల్లో పేదల శాతం రెండు నుంచి ఐదు శాతం లోపే అంటే అత్యంత స్పల్పంగా ఉంది.

పేదరికంలో ఉత్తర - దక్షిణాలు...

పేదరికం విషయంలో దక్షిణ భారతదేశానికి - ఉత్తర మధ్య భారతదేశానికి మధ్య విస్పష్టమైన విభజన కనిపిస్తోంది.

ఉదాహరణకు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 134 జిల్లాల్లో పేదరికం రేటు 40 శాతానికి పైగా ఉన్న జిల్లాలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అవి మహారాష్ట్రలోని నందూర్బర్, ఉత్తర కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలు.

ఇక తమిళనాడు, కేరళల్లోని చాలా జిల్లాల్లో పేదల సంఖ్య 10 శాతం కన్నా తక్కువగా ఉంది. ఇది చాలా తూర్పు యూరప్, దక్షిణ అమెరికా ప్రాంతాలతో సమానం. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించటం గమనార్హం.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో పేదరికం పూర్తిగా అంతం కావాలంటే.. ఈ వేగాన్ని మరో పదిహేనేళ్లు స్థిరంగా కొనసాగించాల్సి ఉంటుంది.

అయితే, ఇండో-గంగా మైదానం వెంట వాయువ్య ఉత్తర ప్రదేశ్ నుంచి తూర్పు బిహార్ వరకూ.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్, ఛత్తీసగ్‌ఢ్‌ల మీదుగా ఒడిశా వరకూ విస్తరించి ఉన్న జిల్లాల్లో ముఖ్యమైన వైరుధ్యం కనిపిస్తుంది.

ఈ రాష్ట్రాల్లో పేదరికం రికార్డు వేగంతో తగ్గుతున్నా ఇప్పటికీ అవే దారిద్ర్యానికి నెలవులు. అంటే అంత దుర్భరమైన దారిద్ర్యం తాండవిస్తోంది అక్కడ. ఈ జిల్లాలు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.

ముఖ్యంగా బిహార్‌లోని 38 జిల్లాల్లో 11 జిల్లాల్లో ప్రతి పది మందిలో ఆరుగురు ఇంకా పేదలుగానే ఉన్నాయి. మధేపురా, అరారియా జిల్లాల్లో అయితే 70 శాతం మంది నిరుపేదలే.

దేశంలో అంతర్గతంగా 4.04 కోట్ల మంది జనాభా గల జిల్లాల్లో 60 శాతం మంది పేదలున్నారు. వారిలో 2.08 కోట్ల మంది బిహార్‌లోని పేద జిల్లాల్లో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని పేద జిల్లల్లో 1.06 కోట్ల మంది ఉన్నారు. మిగతావారు ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నారు.

ప్రపంచంలో పేదరికం

ఫొటో సోర్స్, OPHI REPORT

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో పేదరికం సగానికి తగ్గిపోవటం ప్రపంచ పేదరిక చిత్రపటాన్ని పునర్లిఖించింది. గతంలో ప్రపంచ పేదల్లో అత్యధిక భాగం దక్షిణాసియా ప్రాంతంలో ఉండేవారు. ఇప్పుడు సబ్-సహారన్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉంది...

ప్రపంచంలో పేదలు 130 కోట్లు మంది...

అభివృద్ధి చెందుతున్న 105 దేశాల్లో పేదరికం మీద ఈ ఎంపీఐ సూచీని తయారు చేశారు. ఈ దేశాలన్నిటి జనాభా 570 కోట్లు (మొత్తం ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం మంది) కాగా.. వారిలో దాదాపు నాలుగో వంతు మంది (23.3 శాతం).. అంటే 134 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు.

వీరిలోనూ 61.2 కోట్ల మంది (మొత్తం పేదల్లో 46 శాతం మంది) కడు దారిద్ర్యంలో బతుకీడుస్తున్నారు.

ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలతో పాటు.. తాగునీరు, పారిశుధ్యం, తగినంత పోషకాహారం, ప్రాధమిక విద్య తదితర పది కనీస అవసరాల్లో కనీసం మూడు అవసరాలు తీరని వారిని పేదలుగానూ.. కనీసం ఐదు అవసరాలు తీరని వారిని నిరుపేదలుగానూ ఈ సూచీ పరిగణిస్తోంది.

పేద జనం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ (36.4 కోట్ల మంది) అగ్రస్థానంలో ఉంటే, ఆ తరువాతి స్థానాల్లో వరసగా నైజీరియా (9.7 కోట్లు), ఇథియోపియా (8.6 కోట్లు), పాకిస్తాన్ (8.5 కోట్లు), బంగ్లాదేశ్ (6.7 కోట్లు) ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశాల్లో, దక్షిణాసియా దేశాల్లోనే పేదరికం చాలా తీవ్రంగా ఉంది. మొత్తం ప్రపంచ పేదల్లో 83 శాతం మంది.. అంటే 110 కోట్ల మందికి పైగా పేదలు ఈ రెండు ప్రాంతాల్లోనే ఉన్నారు. సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల్లో 34.2 కోట్ల మంది జనం తీవ్ర పేదరికంలో ఉన్నారు. ఇది ప్రపంచంలోని నిరుపేదల్లో 56 శాతం.

ఇక ప్రపంచ పేదల్లో సగం మంది.. 66.6 కోట్ల మంది చిన్నారులే కావటం గమనార్హం. సౌత్ సూడాన్, నైగర్ దేశాల్లో 90 శాతం మందికి పైగా చిన్నారులు దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది పేదలు (మొత్తం పేదల్లో 84 శాతం) గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 20 కోట్ల మంది పేదలు నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)