Dissociative Amnesia: ‘32 ఏళ్ల వయసులో పడుకుంటే, 15 ఏళ్ల వయసులో మెలకువ వచ్చింది’... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Zurijeta
- రచయిత, మిరియం మారూఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక ఉదయం నయోమీ జాకబ్స్ పడకపై నుంచి లేచారు. తనెవరో ఆమెకు గుర్తు రావడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంలో ఉన్న ఒక చిన్న ఇంట్లో మెలకువ వచ్చింది. తనెవరో, అక్కడ ఎందుకున్నానో తెలీక ఆమె కంగారు పడిపోయారు.
మెలకువ రాగానే, తను ఒక 15 ఏళ్ల అమ్మాయినని ఆమె అనుకున్నారు. కానీ నిజానికి ఆమె వయసు 32 ఏళ్లు. ఆమెకు మెలకువ వచ్చింది 2008లో, కానీ నయోమీ తన లెక్క ప్రకారం 1992లో ఉన్నానని అనుకున్నారు.
"మొదట కొన్ని సెకన్ల వరకూ నాకు ఏదో కల కంటున్నట్టు అనిపించింది. కానీ అదొక పీడకల. నాకు మెలకువ వచ్చిన గది కూడా నాకు గుర్తుకు రావడం లేదు" అన్నారు నయోమీ.
నాకు ఆరోజు గుర్తుంది, నేను మొదట పరదాలు చూశాను. వాటిని గుర్తు పట్టలేకపోయాను. అల్మారా, నేను పడుకున్న పడక.. గదిలో ఉన్న అన్నీ వింతగా ఉన్నాయి. నా శరీరం వైపు చూసుకున్నా. ఒక పైజామాలో ఉన్నా. అసలు అలాంటి బట్టలు నేనెప్పుడూ వేసుకోలేదు" అని నయోమీ చెప్పారు.
"నన్ను నేను అద్దంలో చూసుకున్నా. నా ముఖం బాగా మారిపోయి ఉంది. తెల్లగా, వయసుపెరిగినట్టు అనిపిస్తోంది. గట్టిగా మాట్లాడుతుంటే నా గొంతు నాకే వేరేలా అనిపిస్తోంది"

ఫొటో సోర్స్, AFP
కానీ అక్కడ ఏం జరిగింది?
భవిష్యత్తులోకి చేరిన నయోమీ
నా వయసు 15 ఏళ్లు అనిపించింది. నాలో భావనలన్నీ 15 ఏళ్ల అమ్మాయి లాగే ఉన్నాయి. నాకు అది 1992వ సంవత్సరం అనిపించింది.
కానీ అది 1992 కాదు, నయోమీ 15 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి కాదు. అది 2008, అప్పుడామె వయసు 32 సంవత్సరాలు.
నయోమీ 15 ఏళ్ల జ్ఞాపకాలను పూర్తిగా కోల్పోయారు.
ఆమె ఇప్పుడు 21వ శతాబ్దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 21వ శతాబ్దంలో జీవనశైలి, టెక్నాలజీ, సంస్కృతి, వార్తలు అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది.
నయోమీ తను ఏ సంవత్సరంలో ఉన్నానని అనుకుంటోందో అప్పుడు ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియాగానీ, స్మార్ట్ ఫోన్ కానీ అందుబాటులో లేవు.
అంతే కాదు. ఆమెకు దక్షిణాఫ్రికాలో జాత్యహంకార రాజకీయ, సామాజిక వ్యవస్థ ఇప్పుడూ ఉందని. నెల్సన్ మండేలా స్వాతంత్ర్య ఉద్యమం ఇంకా కొనసాగుతోందని, ఇంకా చాలా అనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒబామానా, ఆయనెవరు?
నయోమీ ఆ రోజును గుర్తు చేసుకున్నారు "వావ్, నేను నమ్మలేకపోతున్నాను, నా జీవితంలో ఇలాంటి రోజును చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొదట ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. ఈ ఒబామా ఎవరు, అలాంటి మనిషి నిజంగా ఉన్నాడా అనిపించింది".
కానీ తను ఒక పదేళ్ల బిడ్డకు తల్లి కూడా, అనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఆమెకు అన్నిటికంటే కష్టంగా మారింది.
"మొదట 24 గంటల వరకూ నాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడనే విషయం కూడా తెలీలేదు. చాలా కంగారుగా అనిపించింది. నా కొడుకు నవ్వుతూ క్లాస్ నుంచి బయటికి వస్తుంటే, తనను అలా చూస్తూ ఉండిపోయా" అన్నారు నయోమీ
నయోమీ 15 ఏళ్ల వయసులో విలేఖరి లేదా రచయిత్రి కావాలనుకునే వారు. ప్రపంచమంతా తిరగాలని, ఒక పెద్ద ఇంట్లో ఉండాలని అనుకునేవారు.
కానీ, తనొక సింగిల్ పేరెంట్ అని, ఖర్చుల కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్నానని ఆమెకు తర్వాత తెలిసింది.
"నాకు ఈ వయసులో నయోమీ నచ్చడం లేదు, నేనిక్కడికి ఎలా వచ్చానో కూడా తెలీడం లేదు. అదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కన్‌ఫ్యూజ్ చేస్తోంది. నాకీ పరిస్థితిలో ఉండాలని అనిపించడం లేదు. ఈ ఇంట్లో, ఈ జీవితంలో ఉండాలని నేను అసలు కోరుకోవడం లేదు.
కానీ, వర్తమానంలో నివసించడం కోసం తన గతాన్ని మార్చుకోవల్సి ఉంటుందని ఆమెకు అర్థమయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
సమాధానం... పడక కింద దొరికింది
నయోమీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి తన సమస్య చెప్పుకుంది. ఆయన సాయం చేయకపోగా, ఆమెను కనీసం నమ్మలేదు. దాంతో ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడే దారిని ఆమె స్వయంగా వెతుక్కున్నారు.
"నేను నా జ్ఞాపకాలను వెతుక్కుంటూనే ఉన్నా, అన్నిటికంటే ముందు నాకొక విషయం తెలియాలి? అసలు ఇలా ఎలా జరిగింది? నేను ఇలాంటి స్థితిలో ఎందుకున్నాను?"
నయోమీకి మొదటి నుంచీ ఆమె సోదరి సిమోన్, ఆమె బెస్ట్ ఫ్రెండ్ కేటీ సాయం చేస్తూ వచ్చారు. టీనేజిలో ఉన్నప్పుడే నువ్వు వార్తా పత్రికలకు చాలా బాగా రాసేదానివని చెప్పారు. ఆ పేపర్లు ఇంట్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూడమని చెప్పారు.
కాసేపు వెతికిన తర్వాత నయోమీకి తన పడక కింద వార్తాపత్రికలు ఉన్న ఒక పెట్టె కనిపించింది. అందులో ఆమె పోగొట్టుకున్న 16 ఏళ్ల జ్ఞాపకాలు ఉన్నాయి, ఆమె ప్రశ్నలకు జవాబులు కూడా దొరికాయి.
వార్తా పత్రికల్లో చాలా వార్తలు ఆమె మనసు ముక్కలు చేశాయి. ఆమెకు డ్రగ్స్ వ్యసనం ఉన్నట్టు తెలిసింది. డ్రగ్స్ వల్ల ఇల్లు లేకుండా పోయిందనే విషయం అర్థమైంది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రగ్స్ వ్యసనంతో దివాలా
ఒకప్పుడు నా బిజినెస్ బాగుండేది. సొంత ఇల్లు కూడా ఉండేది. తర్వాత కొన్ని సమస్యలతో వెళ్లకూడని దారిలో వెళ్లా. నా వ్యాపారం అంతా నాశనం చేసుకున్నా. ఇల్లు పోగొట్టుకున్నా. డ్రగ్స్ వ్యసనం నాకు పెద్ద సమస్యగా మారింది.
దివాలా తీసిన సమయంలో నాకు 'బైపోలార్ డిజార్డర్' ఉన్న విషయం తెలిసింది. కానీ వాటిలో వేరే విషయం కూడా ఉంది.
వార్తా పత్రికల్లో చిన్న పిల్లగా ఉన్నప్పుడు నాపై లైంగిక వేధింపులు జరిగాయనే వార్తను చదివాను. ఆరేళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వరకూ ఆ జ్ఞాపకాలను నాలోనే అణచుకున్నట్టు గుర్తించాను.
15 ఏళ్లు ఉంటుందని అనుకుంటున్న ఒక అమ్మాయి చిన్నతనంలో తనపై జరిగిన ఘోరం గురించి రాసిన వార్తను, ఏళ్ల తర్వాత మళ్లీ తనే చదవడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టం.
అయితే ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఆమె దగ్గర జవాబులు లేవు.
నయోమీకి 1992, 2008 మధ్య గడిపిన జీవితం ఎందుకు గుర్తులేదు. ఆమెకు 15 ఏళ్ల వయసులో ఏం జరిగింది. అయినా ఆమెకు 15 ఏళ్లే వయసులోనే ఉన్నట్టు ఎందుకు అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
15 ఏళ్ల వయసులో నిర్ణయాలు
సమాధానంగా "ఆ వయసులో నాపై చాలా ఒత్తిడి ఉండేది, నా కుటుంబం ముక్కలైపోయింది. సవతి తండ్రి మమ్మల్ని వదిలేశాడు. మా అమ్మతో నా బంధం తెగిపోయింది" అని చెప్పారు నయోమీ.
ఆ వార్తాపత్రికల్లో ఉన్నదాని ప్రకారం నయోమీ తల్లి తాగుడు వ్యసనానికి గురైంది. వాళ్లిద్దరి మధ్యా చాలా గొడవలు జరిగేవి.
"కుటుంబ గొడవల తర్వాత అమ్మ తాగడం మొదలెట్టింది. నేను ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించాను" అని నయోమీ అన్నారు.
"15 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత నా జీవితాన్ని నిర్దేశించాయి".
జ్ఞాపకాలను పోగొట్టుకున్న తర్వాత మొదటిసారి నయోమీ తనకు ఎదురైన ప్రతి సమస్యనూ ఎదుర్కునేందుకు సిద్ధమయ్యారు.
ఒక రోజు ఉదయం, అంటే తన జ్ఞాపకాలు కోల్పోయిన దాదాపు మూడు నెలల తర్వాత నయోమీకి మెలకువ రాగానే, ఒక్కసారిగా చాలా భిన్నంగా అనిపించింది. ఆమె జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. తన వయసు 32 ఏళ్లని, అది 2008 అని ఆమెగు గుర్తొచ్చింది.

ఫొటో సోర్స్, AFP
అసలు నయోమీకి ఏమైంది?
అసలు ఏం జరిగిందో నయోమీకి మూడేళ్ల తర్వాత తెలిసింది.
"నేను ఒక మంచి సైకాలజిస్టును కలిశాను. ఆయనకు జరిగిందంతా చెప్పాను. నా జీవితం గురించి దాదాపు మొత్తం చెప్పేశాను. ఆయన నాపై చాలా రీసెర్చ్ చేశారు. తన సహచరులతో మాట్లాడారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. నాకు 'డిసోసియేటివ్ అమ్నీషియా' వచ్చిందని చెప్పారు" అన్నారు నయోమీ.
అది ఒక అరుదైన అమ్నీషియా రకం. ఆమె తన జ్ఞాపకాలు కోల్పోలేదు. తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆమె మెదడు షాక్‌కు గురైంది.
వ్యాధి గురించి తెలిసిన తర్వాత ఆమెకు కాస్త ఉపశమనం లభించింది.
నయోమీ తన వ్యాధి గురించి, తన అనుభవాల గురించి 'ద ఫర్గాటన్ గర్ల్' పేరుతో ఒక పుస్తకం రాశారు.
ఇవి కూడా చూడండి:
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ఆయుష్మాన్ భారత్: మౌలిక సమస్యలపై మోదీ కేర్ గెలుస్తుందా?
- నైజీరియా పైరేట్లు: స్విస్ సరకుల ఓడలో 12 మంది సిబ్బంది అపహరణ
- డెన్మార్క్‌లో ఐవీఎఫ్‌కు ఎందుకంత ఆదరణ?
- గూగుల్‌కు ఇరవయ్యేళ్లు: గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- భారత వాయుసేన వార్ గేమ్: ఏమిటీ ’గగన్‌శక్తి 2018‘?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దక్షిణ కొరియా జేమ్స్ బాండ్
- ఉజ్బెకిస్తాన్ స్కూళ్లలో ‘పొట్టి స్కర్ట్స్‘ వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








