ఈవిడ లక్షా యాభై వేల రకాల విస్కీ రుచి చూశారట!

ఫొటో సోర్స్, PETER MCNALLY
- రచయిత, మాగ్నస్ బెన్నెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి, స్కాట్లాండ్
స్కాట్లాండ్‌కు చెందిన రాచెల్ బార్రీ అతికొద్ది మంది మహిళా బ్లెండర్ మాస్టర్లలో ఒకరు. ఈమె చేసే పని, మద్యం తయారీ సంస్థలో విస్కీ రుచి, వాసన చూడటమే.
26 ఏళ్లుగా ఈమె చేసే పని అదే. ఇప్పటి వరకు తాను లక్షా యాభై వేల రకాల విస్కీ వాసన, రుచి చూశానని రాచెల్ చెబుతున్నారు.
హోటళ్లలో వంటకాలను మాస్టర్ షెఫ్ ఎలా రుచి చూస్తారో.. అలాగే విస్కీ తయారీ సంస్థల్లో 'మాస్టర్ బ్లెండర్' ఉంటారు.
బ్లెండెడ్ విస్కీ తయారీ ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. ఐదు నుంచి 50 రకాల తృణధాన్యాలను, గింజలను నానబెట్టి, బట్టీలలో పులియబెట్టి దాని నుంచి మద్యం తయారు చేస్తారు.
ఏ ఫ్లేవర్ కోసం ఏ ధాన్యం ఎంత మోతాదులో తీసుకోవాలి? అన్న విషయాలను కూడా ఈ మాస్టర్లే చూస్తారు.

ఫొటో సోర్స్, PETER MCNALLY
కంపెనీలు వేరు వేరు ఫ్లేవర్లను తీసుకొస్తుంటాయి. అప్పుడు ఈ మాస్టర్ బ్లెండర్ల పాత్ర చాలా కీలకం.
అలాగే పాత రకాల్లోనూ రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? లేదా? అని ప్రతి బ్యాచ్‌లోనూ పరిశీలించాల్సి ఉంటుంది.
వాసనలో, రుచిలో కొద్దిపాటి తేడాలు వచ్చినా గుర్తించాల్సి ఉంటుందని రాచెల్ చెబుతున్నారు.
అలా ఏడాదిలో కొన్ని వేల రకాల విస్కీ రుచి చూస్తాననని ఆమె తెలిపారు.
'స్కాచ్ విస్కీ మాస్టర్ బ్లెండర్'గా రాచెల్ గుర్తింపు పొందారు.

ఫొటో సోర్స్, VISITSCOTLAND
"ఒక మాస్టర్ బ్లెండర్‌గా విస్కీ నాణ్యతను చూడాల్సిన బాధ్యత నాదే. అందులో వాడే తృణధాన్యాల ఎంపిక నుంచి విస్కీ నింపేందుకు సీసాల వరకూ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి"
"ఆ ధాన్యాల గురించి, వాటిని నానబెట్టి, పులియబెట్టడం, తర్వాత దాని నుంచి మద్యాన్ని తీయడం గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. శాంపిళ్లను రుచి చూడాలి"
"బ్లెండెడ్ విస్కీలో దాదాపు 150 నుంచి 200 రకాల వాసనలు ఉంటాయి. వాటిలో తేడాలను పసిగట్టగలగాలి" అని రాచెల్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"నా ముక్కు, నాలుక చాలా సున్నితంగా ఉన్నాయి కాబట్టే నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాను. ఘాటు తక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తింటాను. వాసన వెదజల్లే సుగంధ లేపనాలు, అత్తర్లు వాడను. పచ్చి ఉల్లిగడ్డలను తీసుకోను" అని ఆమె తెలిపారు.
"నేను ఈ ఉద్యోగంలో చేరినప్పుడు 1980ల్లో రెండు, మూడు ఫ్లేవర్లలోనే విస్కీ ఎక్కువగా దొరికేది. కానీ, ఇప్పుడు ఎన్నో రకాల రుచులు దొరుకుతున్నాయి. ఒక్కో వ్యక్తి ఒక్కో ఫ్లేవర్ ఇష్టపడుతున్నారు" అని రాచెల్ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, BENRIACH
"నేను ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో విస్కీ రుచి చూశాను. నాకు జలుబు చేస్తే మా అమ్మమ్మ వేడి నీళ్లు, తేనె, నిమ్మరసం, కొంచెం విస్కీ ఇచ్చింది. దాంతో జలుబు తగ్గిపోయింది" అని ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








