తెలంగాణ ‘చిన్నారి పెళ్లి కూతురు’: బాల్య వివాహాన్ని ఎదిరించింది.. చదువుకు పేదరికం అడ్డు పడుతోంది

ఫొటో సోర్స్, Balla Satish/BBC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన సంధ్య ఇంటర్‌లో 86శాతం మార్కులతో పాసైంది. ఇందులో విశేషం ఏముంది? ఆ మాత్రం మార్కులు కామనే!
కానీ, ఆమె ఇంటర్ చదవడమే ఒక విశేషం. తల్లిదండ్రులు అనుకున్నట్టుగా జరిగితే సంధ్య ఈ పాటికి ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండేది.
అవును. పదో తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు ఇంట్లోవాళ్లు.
తక్కువ కట్నంతో పని అయిపోతుంది కదా అన్న చుట్టాల మాటలతో తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు.
పదో తరగతి సోషల్ పరీక్షకు ముందు రోజు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.
సంధ్య సోషల్ 1 పరీక్ష రాయకపోవడంతో, ఆరా తీసిన టీచర్లకు పెళ్లి విషయం తెలిసింది.
టీచర్లు బాలల హక్కుల సంఘానికి సమాచారం ఇచ్చారు. వారు పెళ్లిని ఆపించి, అమ్మాయిని స్టేట్ హోమ్‌కి పంపించారు.
కూతురు పెళ్ళి ఆగిపోవడం - గ్రామస్తుల సూటిపోటి మాటలతో అమ్మాయి తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఊరిలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లొచ్చి, అదే రోజు రాత్రి అతను ఆత్మహత్య చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Balla satish/BBC

ఫొటో సోర్స్, Balla satish//BBC
ఇంటర్ తర్వాత ఏంటి?
ఆ పెళ్లి కోసమని ఉన్న స్థలాన్ని కూడా అమ్మేసుకుంది ఆ కుటుంబం.
ప్రస్తుతం సంధ్య తల్లి సూరమ్మ ఇస్త్రీ పనిచేస్తూ, అదే ఊరిలో ఒక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది.
సంధ్య అన్న కూడా 10వ తరగతి వరకూ చదివి మానేసి ఇప్పుడు ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
సంధ్యకు పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో, అప్పటి రంగారెడ్డి జల్లా కలెక్టర్ రఘునందనరావు ఇంటర్‌ఫీజు కట్టారు.
ఆ సహాయంతోనే ఇంటర్ పూర్తి చేసి 86శాతం మార్కులతో పాస్ అయింది సంధ్య.
బ్యాంక్ మేనేజర్ అవ్వాలన్నది సంధ్య కల. హైదరాబాద్‌లోని కామర్స్ కాలేజీల్లో ఆమెకు సులువుగా సీటొస్తుంది.
కానీ ఏడాదికి సుమారు 30వేల వరకూ ఫీజు, 10వేల వరకూ ఇతర ఖర్చులూ ఉంటాయి.
వాటిని భరించే స్థితిలో సంధ్య లేదు.
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ర్టాల్లో ‘నో క్యాష్’ .. ఎందుకో తెలుసా!?
- అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- ‘పరిశోధన’ కలలను బతికించుకున్న గృహిణులు
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- మునివాహన సేవ: దళితుడిని పూజారి భుజాలపై ఎందుకు ఎక్కించుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









