ఆంధ్రప్రదేశ్: భయం భయంగా బడికి!
- రచయిత, రిపోర్టింగ్: బళ్ళ సతీష్, ప్రొడ్యూసర్, షూట్ & ఎడిటింగ్: సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మీరు బడికి ఎలా వెళ్లేవారు? నడుచుకుంటూనో.. సైకిల్‌పైనో.. ఆటో లేదా స్కూల్ బస్సులోనో వెళ్లి ఉంటారు.
కానీ, ఈ పిల్లల కష్టాలు చూడండి.
వీళ్లు బడికి వెళ్లాలంటే 5 నుంచి 10 నిమిషాలు నడకతో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ తరువాత గంటపాటు పడవ ప్రయాణం. అవును.. 8 కిలోమీటర్ల దూరం నీటి మీదే ప్రయాణించాలి.
పడవ దిగాక ఓ 5 నిమిషాలు బురద నీటిలో నడక. ఆ తరువాత స్కూల్ బస్‌లో మరో 5 నిమిషాలు ప్రయాణించాలి. అప్పటికి కానీ బడికి చేరుకోలేరు.
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుకు సమీపంలో నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న ఇరుక్కం అనే ఊరి విద్యార్థుల కష్టాలివి.

ఏ పనికైనా పులికాట్ దాటాల్సిందే..
ఇరుక్కం గ్రామం పులికాట్ సరస్సులోని ఒక దీవి.
13 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఆ దీవిలో(ఇరుక్కం గ్రామ పంచాయతీ పరిధిలో) రెండు పెద్ద ఊళ్లున్నాయి. దాదాపు 2 వేల జనాభా అక్కడ నివసిస్తున్నారు.
ఇక్కడి నుంచి ఏ పనికైనా పులికాట్ సరస్సు దాటి బయటకు వెళ్లాల్సిందే.
ఇరుక్కం నుంచి బయటకు వస్తే దగ్గర్లో రెండు రేవులున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని భీమునివారి పాలెం. రెండోది తమిళనాడు పరిధిలోని సున్నంబుకులం(స్థానిక తెలుగువాళ్లు దీన్ని సున్నంకుంట అని పిలుస్తారు).
ఈ గ్రామంలో తమిళం మాట్లాడే వారే ఎక్కువ. కొద్దిమందే తెలుగులో మాట్లాడతారు.

ఏ మీడియం కావాలంటే ఆ రాష్ట్రానికి..
ఇక్కడి పిల్లలు చదువు కోసం సరస్సు దాటి బయటకు రావల్సిందే.
తెలుగు మీడియం కావాలనుకున్న వారు ఆంధ్రకు, తమిళ మీడియం కావాలనుకున్న వారు తమిళనాడుకు వెళ్తారు.

అలాగని ఈ ఊరిలో బడి లేదు అనుకోవద్దు. రెండు స్కూళ్లు ఉన్నాయి. ఒకటి ఇటీవలే నిర్మించగా, మరొకటి 1913 నుంచి ఉంది!
కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. గత అయిదేళ్లుగా ఇక్కడ పనిచేసేందుకు ఉపాధ్యాయులెవరూ ముందుకురాలేదు.
"మేం వెళ్లాలంటేనే(పడవలో) చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకు ఇంకెంత కష్టమో? హోరున గాలి వీస్తుంటుంది. పిల్లలు ఎలా తిరిగివస్తారో అని భయం. ఇక్కడ బడి ఉన్నా టీచర్లు రావడం లేదు. అందుకే బోటులో పంపిస్తున్నాం. టీచర్లు వస్తే మా పిల్లలు ఇక్కడే చదువుకుంటారు" అని బీబీసీతో లావణ్య అనే గ్రామస్తురాలు చెప్పారు.
"మా ఊరిలో బడి ఉంది. కానీ టీచర్లు, సార్లు ఎవరూ రారు. అందుకే సున్నాంబకులం బడికి వస్తున్నాం" అని చెప్పింది అభి అనే విద్యార్థిని.

తమిళనాడు ప్రభుత్వం లైఫ్‌జాకెట్లు ఇచ్చింది.. ఏపీ?
సరస్సులో ప్రయాణం ప్రమాదకరంగా ఉండడంతో తమ పరిధిలోని పాఠశాలలకు వచ్చే పిల్లలకు లైఫ్ జాకెట్లు ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ అలాంటిదేమీ చేయలేదు.
ఎక్కువ మంది పిల్లలు లైఫ్ జాకెట్లతోనే వెళతారు. కొందరు మాత్రం ఏ జాగ్రత్తలూ లేకుండానే మామూలుగా పడవలో వెళ్లిపోతుంటారు.
అయితే లైఫ్ జాకెట్లు ఇచ్చిన వారికి కూడా ఒక సమస్య ఉంది. "పడవలో కూర్చోవడానికి స్థలం లేదు. అందుకని (లైఫ్ జాకెట్) తీసేస్తాం. ఎవరూ వేసుకోరు" అని చెప్పింది అభి.
ఇక వర్షాకాలంలో బోటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉంటుంది. దాంతో స్కూలుకు వెళ్లడమే కష్టం.
దాంతో కొందరు తడ, అరంబాక్కం ప్రాంతాల్లో తమ బంధువుల ఇళ్ల దగ్గర ఉంచి పిల్లల్ని చదివిస్తారు.

‘ఇక్కడ పనిచేయమంటే సెలవు పెట్టేస్తున్నారు’
పర్యావరణ, ఆర్థిక, సాంకేతిక కారణాలతో అక్కడ వంతెన నిర్మించేందుకు అవకాశం చాలా తక్కువ. దీంతో బోటు ప్రయాణం తప్పనిసరి.
రోజూ ఇరుక్కం వెళ్లివచ్చేలా లేదంటే ఇరుక్కంలోనే నివాసం ఉండేలా ఉపాధ్యాయులను నియమిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
అయిదారేళ్ల క్రితం ఇద్దరు ఉపాధ్యాయులు తమ గ్రామంలోనే నివాసం ఉండి చదువు చెప్పేవారని గ్రామస్తులు తెలిపారు.
"ఇదివరకు అయ్యోర్లు ఇక్కడే కాపురం ఉండే వారు. ఇప్పుడు పదో తరగతి చదివిన అమ్మాయితో పాఠాలు చెప్పిస్తున్నారు. మేం ఇక్కడ చదువుకున్నప్పుడే బడిలో 50-60 మంది పిల్లకాయలుండేవారు. ఇప్పుడు పదిలోపే ఉన్నారు. ఆఫీసర్లు వస్తారంటే పది మంది వస్తారు. ఇక్కడే టీచర్ను పెడితే కనీసం 30-40 మంది పిల్లలొస్తారు. బోటులో పంపాలంటే వానాకాలం ఇబ్బంది. ఓసారి పడవ మునిగింది కూడా" అని వివరించారు ధన శేఖర్ అనే గ్రామస్తుడు.
"ఇక్కడ టీచర్లను నియమిస్తే ఎవరూ వెళ్లడం లేదు. సెలవు పెట్టేస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తున్నాం. కానీ అక్కడ పనిచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మూడు నెలల క్రితం కూడా నేను ఒకరిని నియమిస్తే, వారు సెలవు పెట్టేశారు. అక్కడ టీచర్‌ని నియమించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం" అని నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్యూల్ బీబీసీకి చెప్పారు.

మీడియం సమస్య
ఇరుక్కంలో ఎక్కువ మంది తమిళం మాట్లాడే వారే ఉన్నారు. వారికి తెలుగు రాదు. కానీ తెలుగు వారికి మాత్రం తమిళం వచ్చు.
అన్ని కులాల వారికీ రెండు రాష్ట్రాలతోనూ సంబంధాలు ఉన్నాయి. మత్స్యకారులు తమ గ్రామంలో తమిళ మీడియం పాఠశాల పెట్టాలని కోరుతున్నారు.
దళితులు మాత్రం తెలుగు మీడియం ఉంటే మంచిదంటున్నారు.
గ్రామస్తులు కొందరు రెండు మీడియం స్కూళ్లు లేదా రెండు భాషల ఆప్షన్లతో ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉండాలంటున్నారు.
ఈ గ్రామంలో ఉన్న రెండు స్కూలు భవనాలు ఒకటి తెలుగు చదవాలనుకునే వారి ప్రాంతంలో, మరొకటి తమిళం చదవాలనుకునే వారి ప్రాంతంలో ఉన్నాయి.
దీనివల్ల ఒకే భవనంలో రెండు మీడియంలు పెట్టాల్సిన అవసరం కూడా లేదని వివరించారు గ్రామస్తులు.
అలాగే గ్రామంలోని రెండు ప్రాంతాలకు మధ్యలో హైస్కూలు ఏర్పాటు చేసి, అన్నింటిలోనూ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









