బాలకృష్ణ ‘యుద్ధం’ ఎవరిమీద?

ఫొటో సోర్స్, facebook.com/pg/NandamuriBalakrishna
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున చేపట్టిన 'ధర్మ పోరాట దీక్ష'లో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.
విభజన హామీల కోసం సామ, దాన, బేద ఉపాయాలు అయిపోయాయినని.. ఇక మిగిలింది దండోపాయమేనని ఆయన అన్నారు.
బాలకృష్ణ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే..
"ఎందరో మహానుభావులు పుట్టిన వేద భూమి మనది. వీర వనితలను కన్న పుణ్యభూమి మనది.
సామ దాన దండోపాయాల్లో బీజేపీతో దండోపాయమే మిగులుంది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదు.. మీ ఇష్టమొచ్చినట్లు పరిపాలన కొనసాగించడానికి.
హిందీలో మాట్లాడుతూ..
తెలుగు నాట ప్రతి ఒక్కరి నరనరాల్లో ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తోంది. ముందు పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి. అది సంస్కారం. అడ్వాణీని, ఇంట్లోని భార్యను గౌరవించండి..!
మోదీకి తగిన గుణపాఠం నేర్పుతాం. ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే కాదు.. దేశం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంది. అమిత్ షా లాంటి బాజాభజంత్రీలను నమ్మకు.
పిరికివాడా.. నమ్మక ద్రోహీ! బయటకు రా. ప్రజలు నిన్ను వదలిపెట్టరు. నువ్వు ఎక్కడ దాక్కున్నా, నిన్ను భరత మాత వదిలిపెట్టదు. నిన్ను తరిమి తరిమి కొడతారు.
ఆంధ్ర రాష్ట్రంలో నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడు.

ఫొటో సోర్స్, facebook.com/tdp.ncbn.official
యుద్ధం మొదలైంది..
యుద్ధం మొదలైంది. ఇక మేం చూస్తూ కూర్చోలేం.
గతంలో రామారావు గారి చలవ వల్ల, నేడు చంద్రబాబు చలవ వల్ల రాష్ట్రంలో సీట్లు గెలిచారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ఛాలెంజ్ చేస్తున్నా.
ఎవరెవరినో వాడుకుంటూ.. వారితో కుప్పిగంతులు వేయిస్తున్నాడు. రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ల మధ్య ప్యాకేజీల అవగాహనలున్నాయని మీకు తెలుసు..
వాళ్లను అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు మోదీ. కానీ వాళ్లకూ రావు, వీళ్లకూ రావు సీట్లు.
రాజధాని భూమి పూజ కార్యక్రమంలో.. రెండు కుండలిచ్చిపోయారు. మాకు లేవా పవిత్ర నదీ జలాలు!
ఇంతవరకూ మన సహనాన్ని పరీక్షించారు. అందరూ సిద్ధంగా ఉండండి. సైనికులుగా మారండి.. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లూరి సీతారాములై, విప్లవ వీరులై, గౌతమీపుత్ర శాతకర్ణిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఈ పోరాటంలో ముందుకెళ్లాలి. దేనికైనా తెగించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా!" అని బాలకృష్ణ అన్నారు.
బాలకృష్ణవి చౌకబారు విమర్శలు: బీజేపీ
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చేసిన సహకారాన్ని మరచిపోయి బాలకృష్ణ చవకబారు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కేవీ లక్ష్మీపతి రాజా వ్యాఖ్యానించారు.
టీడీపీ అవినీతి బయట పడితే తన బావ, అల్లుడికి రాజకీయంగా పుట్టగతులుండవనే అభద్రతా భావంతో ఆయన దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








