నైజీరియా పైరేట్లు: స్విస్ సరకుల ఓడలో 12 మంది సిబ్బంది అపహరణ

నైజీరియా పైరేట్లు

ఫొటో సోర్స్, Getty Images

నైజీరియా జలాల్లో ప్రయాణిస్తున్న స్విట్జర్లాండ్ సరకు రవాణా ఓడలో 12 మంది సిబ్బందిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు.

ఎం.వి.గ్లారస్ అనే తమ నౌక.. లాగోస్ నుంచి గోధుమలు తీసుకుని పోర్ట్ హార్కోర్ట్‌కు ప్రయాణిస్తుండగా శనివారం సముద్రపు దొంగలు దాడి చేశారని జెనీవాలోని మసోల్ షిప్పింగ్ సంస్థ తెలిపింది.

నైగర్ డెల్టాలోని బోనీ ఐలాండ్‌కు 45 నాటికల్ మైళ్ల దూరంలో పైరేట్లు పంజా విసిరారని ఆ నౌకా సంస్థ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పింది.

వారు పొడవాటి నిచ్చెనలు వేసి ఓడలోకి ఎక్కారని.. నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 12 మందిని అపహరించుకెళ్లారని తెలిపింది.

పైరేట్లు ఆ నౌకలోని కమ్యూనికేషన్ పరికరాలను చాలావరకూ ధ్వంసం చేసేశారని మసోల్ షిప్పింగ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆ సిబ్బంది కుటుంబాలకు తెలియజేస్తున్నామని చెప్పారు.

నైజీరియా పైరేట్లు

నౌక సిబ్బందిలో ఏడుగురు ఫిలిప్పీన్స్ వాసులు కాగా.. స్లొవేనియా, ఉక్రెయిన్, రొమేనియా, క్రొయేషియా, బోస్నియా దేశస్తులు ఒక్కొక్కరు ఉన్నారని నైజీరియా సముద్ర రవాణా సంస్థ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

బందీలను త్వరగా, క్షేమంగా విడిపించటం కోసం ప్రత్యేక నిపుణులు బయలుదేరి వెళ్లారని షిప్పింగ్ కంపెనీ వెల్లడించింది.

నైజీరియాలో బలవంతపు డబ్బు వసూళ్ల కోసం కిడ్నాప్‌లు చేయటం సర్వసాధారణంగా మారింది. విదేశీయులు, ఉన్నతస్థాయి నైజీరియన్లను కిడ్నాపర్లు తరచూ లక్ష్యంగా చేసుకుంటారు.

ఓషన్స్ బియాండ్ పైరసీ అనే సంస్థ 2017లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైజీరియా తీరంలో అపహరణలు, హింస పెరిగాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)