చార్లీ చాప్లిన్: కష్టాలను దిగమింగి.. ప్రపంచాన్ని నవ్వించాడు

ఫొటో సోర్స్, Getty Images
చార్లీచాప్లిన్.. నవ్వుకు శాశ్వత చిరునామా ఆయన. హాస్యానికి రూపం ఆయన. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నడక.. అల్లరి, అమాయక చేష్టలతో కడుపుబ్బ నవ్వించే చాప్లిన్ జీవితం మాత్రం నవ్వులుపువ్వులుగా ఏమీ సాగలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు. చాప్లిన్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..
- చార్లీ చాప్లిన్ 1889లో లండన్‌లో జన్మించారు. దాదాపు పది సంవత్సరాలు లాంబెత్ వర్క్ హౌస్‌లో నివసించారు. తర్వాత 1910లో అమెరికా వెళ్లారు.
- చార్లీచాప్లిన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బందిపడ్డారు. దీంతో పరిచయస్థులు, బంధువుల ఇళ్లకు సరిగ్గా భోజనం సమయానికి వెళ్లేవారట. అలాంటి సమయంలో వచ్చే అతిథిని ఎలాగూ భోజనం చేసి వెళ్లమంటారు కదా. అదే ఆయన కడుపు నింపేది.
- టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రంపై కనిపించిన తొలి నటుడు చార్లీ చాప్లిన్.
- చార్లీ తన జీవితంలో మొత్తం నలుగురు అమ్మాయిలను వివాహమాడాడు.
- ఉక్రెయిన్‌కు చెందిన ఖగోళ పరిశోధకురాలు ఒకరు తాను కనుగొన్న గ్రహశకలానికి చాప్లిన్3623 అని పేరు పెట్టారు.
- చార్లీ నటించిన తొలి సినిమా 'మేకింగ్ ఏ లవ్' ఆయనకే నచ్చలేదట.
- చాప్లిన్ కేవలం హాస్య నటుడే కాదు మంచి రచయిత, దర్శకుడు కూడా.
- టాకీ సినిమాలు వచ్చాక కూడా చాప్లిన్ మూకీలే తీశారు.
- చాప్లిన్ హాలీవుడ్‌ను వీడిన తరువాత స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నివసించారు. ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది.
- చాప్లిన్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో స్కాట్లాండ్‌లోని నేర్న్ ఒకటి. ఇక్కడికి ప్రతి సంవత్సరం వెళ్లేవారు. "ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు లభించే ప్రశాంతత వెలకట్టలేనిది" అని చాప్లిన్ తన సన్నిహితులతో చెప్పేవారు. బహుశా అక్కడి ప్రజలకు చాప్లిన్ ఎవరో పెద్దగా తెలియకపోవడం కూడా ఆయనకు ఇక్కడ అభిమానుల తాకిడి లేకుండా చేసి ఉండవచ్చు. అదే ఆయనకు బాగా సంతోషాన్నిచ్చేది.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




