చైనా - స్వీడన్ మాటల యుద్ధం: ఏమిటి అసలు కారణం?

ఫొటో సోర్స్, SVT
చైనా - స్వీడన్‌ల మధ్య అకస్మాత్తుగా దౌత్య వాగ్యుద్ధం మొదలైంది. ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి.
సెప్టెంబర్‌లో స్వీడన్‌లో ఒక హోటల్ నుంచి చైనా పర్యటకులను స్వీడిష్ పోలీసులు బలవంతంగా గెంటివేయటంతో ఈ గొడవ మొదలైంది. ఆ ఘటనను చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
అయితే, చైనా ప్రజలు కుక్కలను తింటారని, బహిరంగంగా మలవిసర్జన చేస్తారని ఒక స్వీడిష్ టెలివిజన్ వ్యంగ్యంగా పరిహాసం చేయటంతో పరిస్థితులు దిగజారాయి.
ఆ టీవీ షోలో ‘‘అసభ్య పదజాలం’’ ఉపయోగించారని, చైనాకు వ్యతిరేకంగా వివక్ష, పక్షపాతం, రెచ్చగొట్టే మాటలతో ఆ షో నిండివుందని చైనా ఆరోపించింది.
కాన,. అది కామెడీ షో అని, అందులోని ‘హాస్యం’ స్వీడన్ భాష మాట్లాడేవారికి ‘అర్థమవుతుంద’ని సదరు స్వీడిష్ టెలివిజన్ వ్యాఖ్యానించింది.
రెండు దేశాల మధ్య ఈ వివాదానికి ఇది కాకుండా మరో కారణమేదైనా ఉందా?

ఫొటో సోర్స్, BTV
అసలు ఎలా మొదలైంది?
ఈ నెల మొదట్లో, స్టాక్‌హోం లోని ఒక హోటల్ నుంచి చైనా పర్యటకులను స్వీడన్ పోలీసులు బయటకి నెట్టివేస్తున్నట్లు చెప్తున్న ఒక వీడియా వెలుగులోకి వచ్చింది.
ఒక చైనా వ్యక్తి, ఆయన తల్లిదండ్రులు ఆ హోటల్ దగ్గరకి ఆర్థరాత్రి వేళ.. వారు హోటల్‌లో దిగటానికి కొన్ని గంటల ముందుగా వచ్చినట్లు చెప్తున్నారు. వారిని లాబీలో ఉండాలని హోటల్ ప్రతినిధులు చెప్పారని, దానికి వారు తిరస్కరించారని, దీంతో వారిని పోలీసులు బలవంతంగా బటయకు గెంటేశారని కథనం.
సదరు చైనా వ్యక్తి నాటకీయంగా పడిపోతూ, ‘‘ఇది చంపేయటమే.. ఇది చంపేయటమే’’ అని ఇంగ్లిష్‌లో అరుస్తున్నట్లు కనిపిస్తోంది. అతడి తల్లి ‘సాయం’ చేయాలని కోరుతూ విలపించటం, పోలీసు అధికారులు చూస్తూ నిల్చోవటం కనిపించింది.
ఆ వీడియోను తర్వాత చైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షలాది మంది దానిని చూశారు. వేలాది కామెంట్లు వచ్చాయి. వారితో అంత కఠినంగా వ్యవహరించటం పట్ల స్వీడన్ పోలీసులను కొందరు యూజర్లు తప్పుపట్టారు. ఇంకొందరు.. ఆ కుటుంబం అనవసరంగా ‘నాటకీయంగా’ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
ఆ వీడియో విస్తృతంగా ప్రచారం కావటంతో.. ‘చైనా పౌరుల ప్రాధమిక మానవ హక్కులను పోలీసులు ఉల్లంఘించార’ని స్వీడన్ లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. స్వీడన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
అయితే, ఆ చైనా కుటుంబం తమ హోటల్ గదులను వేరే రోజుకు బుక్ చేసుకున్నారని.. ఆ విషయాన్ని వారికి చెప్పినప్పుడు వారు ‘తిరిగి వెళ్లటానికి నిరాకరించార’ని ఆ హోటల్ మేనేజర్ ఒకరు ఓ స్వీడన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదే వివాదానికి కారణమా?
లేదు - పరిస్థితులు వేగంగా దిగజారాయి. కొన్ని వారాల స్తబ్దత అనంతరం సెప్టెంబర్ 21వ తేదీన స్వీడన్ టీవీ ఎస్‌వీటీ చానల్‌లో స్వెన్స్కా నైటర్ వ్యంగ్యాత్మక టీవీ షో ప్రసారమైన తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ టీవీ షోలో మొత్తంగా చైనా పర్యాటకుల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘చారిత్రక వారసత్వ ప్రదేశాల వెలుపల’ మలవిసర్జన చేయరాదన్న ఒక చిత్రాన్ని ఆ టీవీ షోలో చూపించారు. అలాగే, ‘‘ఒక వ్యక్తి తమ కుక్కను రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళుతుంటే వాళ్లు తమ మధ్యాహ్న భోజనాన్ని అప్పుడే కొనుక్కున్నారని కాదు’’ అని షో వ్యాఖ్యాత వ్యాఖ్యానించారు.
చైనా ప్రజలు జాత్యహంకారులని.. కానీ స్వీడన్ నల్లవారిని, అరబ్బులను, యూదులను.. చివరికి ‘స్వలింగ సంపర్కులను’ కూడా ఆహ్వానింస్తుందని ఆ షోలో వ్యాఖ్యానించారు.
‘‘ఎందుకంటే స్వీడన్‌లో మేం సార్వజనీన మానవ విలువలను విశ్వసిస్తాం. ఈ సూత్రం చైనాకు వర్తించదు’’ అని వ్యాఖ్యాత పేర్కొన్నారు.
చైనా పర్యాటకులను స్వీడన్ ఆహ్వానిస్తోందని, కానీ వారు తప్పుగా ప్రవర్తిస్తే దెబ్బలు తింటారని వీడియో చివర్లో చెప్పారు.
ఈ వీడియో చైనాలో యూట్యూబ్ తరహా వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూకూలో వైరల్‌గా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ప్రజలు ఎలా స్పందించారు?
ఈ వీడియోపై చైనా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. చైనాలో ట్విటర్ తరహా వేదిక అయిన సీనా వీబోలో జనం మండిపడ్డారు.
అతి స్వల్పం కాలంలోనే #SwedishTVShowInsultsChinesePeople (స్వీడిష్ టీవీ షో చైనా ప్రజలను అవమానించింది) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌గా మారి 3.4 కోట్ల మంది దీనిని వీక్షించారు.
‘‘ఇది క్షమించరానిది. చైనా పర్యాటకులు ఇబ్బందికరంగా ప్రవర్తించారని నేను అంగీకరిస్తా. కానీ మొత్తం చైనాను వాళ్లు ఇలా అవమానించకూడదు. వాళ్లు క్షమాపణ చెప్పాలి’’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
‘‘వాళ్లు కావాలనే ఆ చిత్రాన్ని చైనా భాషలో డబ్ చేశారు... వాళ్లు మమ్మల్ని అవమానిస్తున్నారని మాకు తెలియాలనే వాళ్లు ఇలా చేశారన్నది సుస్పష్టం’’ అని మరొక యూజర్ మండిపడ్డారు.
‘‘స్వీడన్‌కు బుద్ధి చెప్పాలంటే, వారిని బహిష్కరించాలి. అక్కడికి వెళ్లొద్దు. ఐకియా, హెచ్ అండ్ ఎం, వాల్వోలను బహిష్కరించండి’’ అని మరొక యూజర్ పేర్కొన్నారు. చాలా మంది ఇదే తరహా కామెంట్లు పోస్ట్ చేశారు.
చైనా ప్రభుత్వం నుంచీ అదే ఆగ్రహం...
‘‘ఇది (టీవీ షో) చైనా మీద, చైనా ప్రజల మీద విషపూరిత దాడి.. తీవ్రంగా అవమానించటమే. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై వ్యంగ్యంగా, హాస్యపూరితంగా వ్యాఖ్యానించటమే తమ టీవీ షో ఉద్దేశమని ఎస్‌వీటీ చానల్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ థామస్ హాల్ బీబీసీకి చెప్పారు.
చైనా ప్రజల ప్రతిస్పందనల కోసం ఆ షో భాగాన్ని యూకూలో ప్రచురించామని.. అది పొరపాటని.. అలా చేయటం వల్ల తమ సందేశం, ఉద్దేశం సంపూర్ణత దెబ్బతిన్నదని ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘‘ఇది ఒక అవమానం అయివుండవచ్చు.. అందుకు మేం నిజంగా చింతిస్తున్నాం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ పర్యాటకులు, ఈ టీవీ షోలే గొడవలకు కారణమా?
అదేం కాదు. అంతర్లీనంగా ఉన్న ఇంకా పెద్ద విషయాలకు ఇవి బయటి సంకేతాలు కావచ్చు.
దలై లామా - చైనా వేర్పాటు వాద ముప్పుగా పరిగణిస్తున్న టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు - ఈ నెల ఆరంభంలో స్వీడన్‌లో పర్యటించారు.
అయితే.. దలై లామా పర్యటనకు, తాజా గొడవకు ఎటువంటి సంబంధం లేదని చైనా అధికారిక మీడియా తిరస్కరించింది.
అలాగే.. గై మిన్హాయి వివాదం కూడా కొనసాగుతోంది. హాంగ్ కాంగ్‌లో నివసిస్తున్న స్వీడన్ పౌరుడు, పుస్తక విక్రేత అయిన మిన్హాయి.. గత జనవరి నెలలో తూర్పు చైనాలోని నింగ్బో నుంచి ఒక రైలులో బీజింగ్‌కు వెళుతుండగా చైనా అధికారులు నిర్బంధించారు.
ఆయన ఇద్దరు స్వీడన్ దౌత్యాధికారులతో కలిసి ప్రయాణిస్తున్నారు. స్వీడన్ స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవటం కోసం ఆయన వెళుతున్నట్లు చెప్తున్నారు. అయితే.. ఆయనను చైనా నుంచి తరలించటానికి స్వీడన్ ప్రయత్నించిందని చైనా అధికారిక మీడియా ఆరోపించింది.
చైనా - స్వీడన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి ప్రధాన కారణంగా గై మిన్హాయి ఉదంతాన్నే చెప్పుకోవచ్చునని స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో విశ్లేషకుడైన వైకింగ్ బోమన్ అంటున్నారు.
‘‘గై మిన్హాయి చైనా నిర్బంధంలో ఉన్నంత కాలమూ అది ఘర్షణకు ప్రధాన హేతువుగా ఉంటుంది. మిన్హాయి విడుదల కోసం స్వీడన్‌లో గళం పెరిగితే.. అందుకు చైనా అంగీకరించకపోతే.. రెండు దేశాల సంబంధాలు మరింతగా దెబ్బతినే అవకాశముంది’’ అని ఆయన అంచనావేశారు.
ఇవి కూడా చదవండి:
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు.. 32 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నాను
- ఆధార్‌పై సుప్రీం కోర్టు తీర్పు: వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది లేదు.. ప్రైవేట్ సంస్థలు పౌరుల ఆధార్ సమాచారం తీసుకోరాదు
- లాల్ బహుదూర్ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా?
- 32 ఏళ్ల వయసులో పడుకుంటే, ‘15 ఏళ్ల వయసులో’ మెలకువ వచ్చింది
- అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణం చవిచూసిన 5 దేశాలు
- అగరుబత్తీ - సిగరెట్: ఏ పొగ ఎక్కువ ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








