ఆధార్‌పై సుప్రీం కోర్టు తీర్పు: బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం వద్దు.. మొబైల్స్‌తో అనుసంధానం రాజ్యాంగ విరుద్ధం

ఫొటో సోర్స్, Getty Images
ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార ధ్రువీకరణ కోసం ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను న్యాయస్థానం రద్దు చేసింది.
ఆధార్ చట్టబద్ధతపై గత కొన్నాళ్లుగా వాదనలు వింటున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ ఫార్ములాతో ఏకీభవించింది.
అయితే, మొబైల్ ఫోన్ నంబర్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం సబబు కాదని తెలిపింది. పాన్ కార్డుల విషయంలో మాత్రం అనుమతించింది.
దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు జారీ చేసిన ఆధార్ సంఖ్యతో పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతకు భంగం కలుగుతోందంటూ పలు పిటిషన్లు దాఖలు కాగా...దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా ఈ తీర్పును రిజర్వులో ఉంచింది.

ఫొటో సోర్స్, Getty Images
తాజా తీర్పులో ముఖ్యంశాలు
* ఆధార్‌తో వ్యక్తిగత స్వేచ్చకు ఇబ్బంది లేదు.
* ఆధార్ కోసం సేకరించిన వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి
* ప్రభుత్వ సంస్థలు ఆధార్ డేటా షేర్ చేస్తే ఆరు నెలల్లోగా దాన్ని మళ్లీ తొలగించాలి.
* ప్రైవేట్ సంస్థలు తమ ఖాతాదారుల ఆధార్ డేటా సేకరించరాదు.
* సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి
* ఆధార్ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలి
* టెలికాం కంపెనీల సేవలకు, బ్యాంక్ సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు
* స్కూల్ అడ్మినిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదు
* పాన్ కార్డు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులకు ఆధార్ అవసరమే.

ఫొటో సోర్స్, Getty Images
చదువు సంతకం నేర్పితే.. టెక్నాలజీ వేలిముద్ర వేయిస్తోంది
సుదీర్ఘ విచారణ అనంతరం ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు ఆధార్ రాజ్యాంగబద్ధమైనదేనని అభిప్రాయపడ్డారు.
''అట్టడుగువర్గాలకు ఆధార్ ఒక గుర్తింపు. మిగతా అన్ని గుర్తింపు కార్డుల కంటే ఇది విశిష్టమైనది. ప్రజలకు దీనివల్ల ప్రయోజనాలున్నాయి. కేవలం 0.232 శాతం సందర్భాల్లోనే విఫలమవుతుంది, ఆ కారణంగా దీన్ని రద్దు చేస్తే ఇప్పటికే నమోదు చేసుకున్న 99 శాతం జనాభాకు ఇబ్బంది కలుగుతుంది'' అని తీర్పు చదివిన జస్టిస్ సిక్రీ అన్నారు.
ఆధార్‌తో నకిలీల బెడద తగ్గిందని.. రెండు ఆధార్‌లు పొందడం అసాధ్యమని, ఇదే ఆధార్ ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు. ఆధార్ నమోదుకు ప్రజల నుంచి కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులందరికీ గుర్తింపు కార్డుగా మారిందని సిక్రి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన 'విద్య మనల్ని వేలిముద్ర నుంచి సంతకం వరకు తీసుకొచ్చింది. సాంకేతికత ఇప్పుడు మనల్ని సంతకాల నుంచి మళ్లీ వేలిముద్రల వాడకానికి తీసుకెళ్తోంది' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
కాగా ధర్మాసనంలో సీజేఐ దీపక్ మిశ్రా, ఎ.కె.సిక్రి, ఎ.ఎం.ఖాన్‌విల్కర్, డి.వై.చంద్రచూడ్, అశోక్ భూషణ్ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తింపు కార్డుగా..
ఆధార్‌ను గుర్తింపు కార్డుగా వినియోగించుకోవడం అనేది పౌరుల ఇష్టమని, గుర్తింపు కార్డుగా అది చెల్లుబాటవుతుందని సిక్రీ తన తీర్పులో చెప్పారు.
విద్యార్థుల ప్రవేశాల సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలని పాఠశాలలు అడగడానికి వీల్లేదన్నారు.
ఆధార్ మెటాడేటా ఆరు నెలలకు మించి ఉంచరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆధార్ చట్టం ప్రకారం మెటాడేటాను అయిదేళ్ల వరకు ఉంచే వీలుంది. న్యాయస్థానం దాన్ని 6 నెలలకు తగ్గించింది.

ఆధార్ సంబంధిత కథనాలు..
- మీ ఆధార్‌కి తాళం వేశారా?
- #AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?
- ఆధార్ లింక్ లేక.. కూలీ డబ్బులు రాక..
- #AadhaarFacts: తల్లీబిడ్డలను కలిపిన ఆధార్
- #AadhaarFacts: ఆధార్ అంత మంచిదైతే ఇన్ని సమస్యలెందుకు?
- లబ్‌డబ్బు: మీ ఆధార్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా?
- BBCExclusive నమో, కాంగ్రెస్, ఆధార్ యాప్‌లపై హ్యాకర్ విశ్లేషణ
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..
- సుప్రీంకోర్టు: ‘ఆధార్ లింకింగ్ తప్పనిసరికాదు’.. మార్చి 31 డెడ్‌లైన్ కాదు
- మీ ఫోన్లో మీకు తెలీకుండానే ఆధార్ ఫోన్ నంబర్ సేవ్ అయి ఉందా... ఒక్కసారి చూసుకోండి
- మీ వేలిముద్రలు ఎవరూ దొంగిలించకుండా కాపాడుకోండి


ఫొటో సోర్స్, Getty Images
ఆరు నెలల కిందటే..
కాగా, ఇంతకుముందు ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆధార్ విషయంలో కీలక తీర్పు చెప్పింది. ఆధార్ అనుసంధానానికి అప్పట్లో విధించిన మార్చి 31 గడువును సుప్రీంకోర్టు పొడిగించడంతో పాటు తుది తీర్పు ఇచ్చే వరకూ అనుసంధానం తప్పనిసరి కాదని ఈ కేసుపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆధార్ అనుసంధానాన్ని, చట్టాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించారు.
పిటిషనర్లలో ఒకరి తరపున కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది పి చిదంబరం వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో.. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించే వరకూ బ్యాంకింగ్, మొబైల్ సేవలు సహా పలు సేవలకు ఆధార్‌ను అనుసంధానించటం తప్పనిసరి కాదని ధర్మాసనం తెలిపింది.
అయితే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ఇందులో మార్పు లేదని కూడా సుప్రీంకోర్టు వివరించింది.
మరోవైపు తత్కాల్ పాస్‌పోర్టు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై విచారణ జరుగుతుండగా.. మార్చి 31 డెడ్‌లైన్‌ను పొడిగించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి సూచించారు. అయితే, ప్రభుత్వ రాయితీలు పొందే పథకాలకు మాత్రం ఆధార్ అనుసంధానాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భద్రమేనా?
ఇక ఆధార్ సమాచారం ఎంతవరకు భద్రమన్న విషయంలోనూ ఈ ఏడాది సంచలనాలు నమోదయ్యాయి. ఏకంగా భారత టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్.ఎస్.శర్మ వ్యక్తిగత వివరాలే లీక్ అయ్యాయి.
ట్విటర్‌లో తన ఆధార్ కార్డును పోస్ట్ చేసిన శర్మ తన వివరాలను హ్యాక్ చేయాలంటూ సవాల్ విసరగా హ్యాకర్లు నిమిషాల వ్యవధిలోనే శర్మ వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు.
కాగా.. భారత్‌లో దాదాపు 100 కోట్ల మందికి ఆధార్ ఉంది. నగదు లావాదేవీలకు కూడా దీన్ని తప్పనిసరి చేయడంతో ఆధార్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. పేదలకు అందాల్సిన పథకాలు, ప్రయోజనాలు వారికే చేరాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఆధార్ అంటే ఏంటి?
ఆధార్ నెంబర్ జారీ చేసే ముందర మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. దీంట్లో మీ వయస్సు, అడ్రస్, వేలిముద్రలు, ఫొటో, మీ కనుపాపల ఫొటో ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలు తీసుకుంటారు. ఆరంభంలో, ఏ రకమైన గుర్తింపు కార్డు లేని వారి కోసం ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేందుకూ.. అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరచేందుకు అని చెప్పి ఈ ఆధార్‌ను ప్రవేశపెట్టారు.
భారత్ ప్రభుత్వం 2016 జులై 12న విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ని ప్రారంభించింది. ఆధార్ చట్టం 2016 లోని నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ అంతకు ముందరే మొదలయింది. 2009 లోనే ఆధార్ విభాగాన్ని అప్పటి ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించింది.
2010 సెప్టెంబరు 29న ఆధార్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి టెంబ్లీ గ్రామానికి చెందిన రాంజనా సొనావ్నే. ఆధార్‌ను సపోర్ట్ చేసే వారు చాలా గర్వంగా చెప్పే మాట - మా దగ్గర ఆధార్ ఉందని. అయితే ఆధార్ కోసం సేకరించిన మన వ్యక్తిగత వివరాలు ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా! UIDAI ఈ సమాచారాన్ని మొత్తం హర్యానాలోని మానెస్సర్ సెంటర్ లో భద్రపరుస్తుంది. అలాగే బెంగళూరు లో కూడా మన డేటా స్టోర్ అవుతుంది. మొత్తం 7000 సర్వర్లను ఈ డేటా భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు.
ఇక ఆధార్ లాంటి బయోమెట్రిక్ డేటా సిస్టం ఇతర దేశాలలో ఎప్పటి నుంచో అమలులో ఉంది. : చాలామంది ఆధార్ ను అమెరికా సంయుక్త రాష్ట్రాల తొమ్మిది అంకెల సామాజిక భద్రత సంఖ్య SSNతో పోల్చుతారు కానీ వీటి మద్య చాలా తేడా ఉంది. SSN ద్వారా జనాభా వివరాలు మాత్రమే సేకరిస్తారు. ఎస్ ఎస్ ఎన్ పొందడానికి ఏజ్ ప్రూఫ్, గుర్తింపు కార్డ్, యూఎస్ సిటిజన్‌షిప్ గుర్తింపు వివరాలు అందించాలి. ఈ ఎస్ఎస్ఎన్ నంబర్ ఫొటో గుర్తింపు లేకుండా ఒక పేపర్ మీద మాత్రమే ప్రింట్ అయి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
- లబ్‌డబ్బు: బ్యాంకులపై మొండి బకాయిల ప్రభావం ఎలా ఉండబోతోంది?
- లబ్ డబ్బు: జాబు వస్తుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
- లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
- ఆవాసం కోసం ఆరాటం: ఏపీలో పులులు.. గుజరాత్లో సింహాలు
- ఈ మహిళలు బతకడానికి.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెడతారు
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








