లబ్‌డబ్బు: బ్యాంకులపై మొండి బకాయిల ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఈమధ్య కాలంలో బ్యాంకులు తరచుగా వార్తల్లోకొస్తున్నాయి. హెడ్‌లైన్స్‌గా మారుతున్నాయి. దానికి ముఖ్యమైన కారణం.. మొండి బకాయిలు. బ్యాంకింగ్ భాషలో ఎన్‌పీఏ.. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఈ వారం లబ్ డబ్బులో ఎన్‌పీఏ గురించి తెలుసుకుందాం.
బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు... ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు. వీటినే మొండి బకాయిలు అంటారు. అయితే రిజర్వు బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం బ్యాంకులకు తామిచ్చిన రుణాలకు వాయిదాలు తిరిగి రాకపోతే వాటిని ఎన్‌పీఏ అంటారు.
2008 సెప్టెంబర్‌లో భారతదేశంలో మొండి బకాయిల విలువ రూ. 53,917 కోట్లు ఉండగా పది సంవత్సరాలకు.. అంటే 2018 నాటికి రూ. 8,40,958 కోట్లకు అమాంతం పెరిగిపోయింది.
31 డిసెంబర్ 2017 వరకు మొండి బకాయిలు
- యూకో బ్యాంక్ : 23.29%
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 22.74%
- దేనా బ్యాంక్: 19.56%
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: 13%
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 11.8%
ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇదీ పరిస్థితి. ఇంత డబ్బు ఉంటే దేశంలో ఉన్న రైతులకు చాలా వరకు రుణ మాఫీ చేసేయొచ్చు. తాగునీటికి కటకటా అంటున్న ప్రజలకు ప్రతి రోజూ మంచి నీరు సరఫరా చేయొచ్చు.
సామాన్యుల ఊహకు కూడా అందనంత అప్పులు తీసుకుని వాటిని ఎగ్గొట్టేసి ఏ విదేశాలకో వెళ్లి సెటిల్ అయిపోతే బ్యాంకులు మాత్రం ఏం చేస్తాయి లెండి! ఎవరైనా ఏ లక్ష రూపాయలో లోన్ తీసుకుని నిజంగానే డబ్బు లేక వాయిదాలు కట్టలేకపోతే వాళ్ల మీద మాత్రం బ్యాంకులు తమ ప్రతాపం చూపిస్తాయి!!
బ్యాంకుల మొండి బకాయిలకు ముఖ్య కారణం పరిశ్రమలు. ఇంతకుముందు నేను చెప్పినట్టు కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని తుర్రుమన్నారు. ఇక స్టీల్ కంపెనీలు నష్టాల్లో ఉండడంతో వారి నుంచి కూడా తిరిగి ఆ డబ్బు రావట్లేదు. వ్యవసాయ రంగం, సేవల రంగం కూడా బ్యాంకులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి.

ఈ మొండి బకాయిల ప్రభావం ఎలా ఉండబోతోంది?
- జాతీయ ఆర్ధిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
- రుణదాతలు తమ లాభాలను తగ్గించుకోవాలి.
- అలాగే బ్యాంకుల వడ్డీ రేట్ల పెరుగుదల ఉండచ్చు.
- ఇవన్నీ జరిగితే అది నిరుద్యోగానికి బాటలు వేస్తుంది.
- బ్యాంకులపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదముంది.
అసలు బ్యాంకులను ఎంత వరకు నమ్మాలి, అసలు నమ్మొచ్చా లేదా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది.
అయితే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం, ఆర్బీఐ రంగంలోకి దిగాయి. ఎటువంటి రుణం భవిష్యత్తులో ఎన్‌పీఏగా మారే అవకాశముందో తెలుసుకోవడానికి కొన్ని నిబంధనలు విధించింది ఆర్బీఐ. ఆ నిబంధనల్లోని ‘స్పెషల్ మెన్షన్ అకౌంట్’ ప్రకారం బ్యాంకులు.. రుణాలు చెల్లించని వారి అకౌంట్లను మార్క్ చేయాలి.

స్పెషల్ మెన్షన్ అకౌంట్ (ఎస్ఎంఏ)
రుణ వాయిదా చెల్లింపు గడువు నుంచి..
- 30 రోజుల లోపు వాయిదా చెల్లించకపోతే ఎస్ఎంఏ-0
- 31-60 రోజుల లోపు వాయిదా చెల్లించకపోతే ఎస్ఎంఏ-1
- 61 రోజుల పైగా వాయిదా చెల్లించకపోతే ఎస్ఎంఏ-2
ఇక ప్రభుత్వం ఈ మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్-2017 ప్రకారం ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కట్టబెట్టి బ్యాంకింగ్ వ్యవస్థను ఇంకా శక్తిమంతం చేసింది.
రుణాలు చెల్లించలేకపోతే దివాళా తీసినట్టు బ్యాంకులను ప్రకటించమనే హక్కు ఆర్బీఐకి ఉంటుంది. మొండి బకాయిలకు సంబంధించి బ్యాంకులకు సలహాలిచ్చేందుకు ఒక కమిటీని నియమించే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.

ఎన్‌పీఏలంటే.. డబ్బు పోయినట్టేనా!?
అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎన్‌పీఏ అనగానే ఇంక ఆ డబ్బు పోయింది.. బ్యాంకులకు తిరిగి రాదు అని అనుకోకూడదు. ఎందుకంటే రుణాలిచ్చిన మొత్తాన్ని బ్యాంకింగ్ సిస్టంలో కలపరు. ఇలా రుణాలిచ్చిన మొత్తానికి సంబంధించి ఒక వ్యవస్థను బ్యాంకులు తయారు చేస్తాయి.. దాన్నే ప్రొవిజనింగ్ అంటారు.
వంద రూపాయలు మన జేబులోంచి పోతేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిది అన్ని లక్షల కోట్ల రూపాయలు పోతే.. కష్టంగానే ఉంటుంది. చూద్దాం ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో. ఎందుకంటే ఈ సమస్య పరిష్కారమైతే భవిష్యత్తు తరానికి ఇదొక కేస్ స్టడీగా మారుతుంది.
ఇవి కూడా చూడండి:
- లబ్ డబ్బు : కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కీలక మార్పులు
- లబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?
- లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
- లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- లబ్‌డబ్బు: రుణం తీసుకోవాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
- #BBCSpecial : పీఎన్బీ స్కామ్ ఎలా జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









