లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?

అలా కూర్చుని ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు, ఐడియాలు వచ్చేస్తుంటాయి. ఇలాంటి ఐడియాలే ఎన్నో స్టార్టప్‌లకు జన్మనిస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న లీడింగ్ కంపెనీలు ఇలా ఒక చిన్న ఐడియాతోనే మొదలయ్యాయి. ప్రపంచంలో ఒక సెకండుకు ఒకటి నుంచి మూడు వరకు స్టార్టప్ కంపెనీలు తెరమీదకి వస్తున్నాయన్న విషయం మీకు తెలుసా..
అయితే ఒక రీసెర్చ్ ప్రకారం ప్రతి పది స్టార్టప్ కంపెనీలలో ఒకటో రెండో మాత్రమే ఎక్కువకాలం కొనసాగగలుగుతున్నాయి. అయితే ఎందుకు కొన్ని విజయం సాధిస్తున్నాయి ఎందుకు కొన్ని ఫెయిల్ అవుతున్నాయో ఇపుడు చూద్దాం.
- మొట్టమొదటగా మీ ఐడియా మంచిది, సరైనది అయి ఉండాలి.
- ఐడియా అనగానే ఏదో కొత్తదై ఉండాలని ఏం రూల్ లేదు.
- ఆల్రెడీ మనకున్న సర్వీస్‌లు, మౌలిక అంశాలనే సరికొత్తగా ఆవిష్కరించగలిగేలా కూడా మీ ఐడియా ఉండచ్చు.
ఉదాహరణకు టాక్సీలు, కార్లు మొదటి నుంచి ఉన్నవే కానీ ఒక కొత్త ఐడియా ఈ టాక్సీలను మన మొబైల్ నుంచే పిలుచుకునే విధంగా మార్చేశాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టాక్సీ సర్వీస్‌ను నడిపే సంస్థకు తమకంటూ సొంత కార్లు ఏమీ లేవు. అదే ఉన్న సర్వీస్ లను సరికొత్తగా ఆవిష్కరించడమంటే.
అలాగే తరచు కొత్త కొత్త ప్రదేశాలకు టూర్లకు వెళ్లే వారికీ Air BNB గురించి చెప్పకర్లేదు. టూరిస్టులకు వసతులు కల్పించే ఈ Air BNB కి తమకంటూ సొంత ప్రాపర్టీ లేదు.
హోమ్ డెలివరీ, రెస్టారెంట్‌లు ఇదివరకు కూడా ఉన్నాయి. కానీ మొబైల్ యాప్‌లు ఆ రెండిటిని ఒకేవేదిక పైకి తీసుకొచ్చాయి. ఇవే పాత సర్వీస్‌లకు కొత్త ఐడియాలు జోడించడమంటే
కొంతమంది తమ తొలి స్టార్టప్ ఐడియాతోనే మిలియన్ డాలర్ మార్క్‌ను చేరుకుంటే కొంతమంది రెండో ప్రయత్నంలోనో మూడో ప్రయత్నం లోనో ఆ స్థాయికి చేరుకుంటారు.
ఈ సంవత్సరంలోనే ఎక్కువ యునికార్న్ స్టేటస్ ఉన్న స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. వందకోట్లకంటే ఎక్కువ మార్క్ ను దాటగలిగిన స్టార్టప్ కంపెనీలకు ఇచ్చే స్థాయి యునికార్న్ స్టేటస్.
భారత్, అమెరికా, చైనా, యూకే, ఇండోనేషియా లాంటి దేశాలలో ఎక్కువ స్టార్టప్‌లు తెరమీదకొస్తున్నాయి.
స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం కొంతకాలం కిందట "స్టార్టప్ ఇండియా" అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా కొత్తగా కంపెనీ పెట్టాలనుకునే వారికీ ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఇప్పటికే స్టార్టప్ ఇండియా హబ్‌లో ముప్పై వేలకు పైగా దరఖాస్తలు అందాయి. అయితే ఇప్పడిదాకా 99 స్టార్టప్ కంపెనీలకే ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించగలిగిందనుకోండి అది వేరే విషయం.

స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
ముందుగా మీ ఐడియా చాలా బలమైనదయి ఉండాలి. ప్రజలకు ఉన్న సవాళ్ళను, సమస్యలను తీర్చే విధంగా ఉండాలి ఆ ఐడియా...అలాగే ఇప్పటికే ఉన్న సర్వీస్‌లు, ప్రాడక్టులతో పోల్చి చుస్తే మీ ఐడియా ఎంత వైవిధ్యంగా ఉంది, ఎంత వరకు ఇది ప్రజలకు ఉపయోగపడుతుందనే దాని మీద మీ స్టార్టప్ ఐడియా విజయావకాశాలు ఆధారపడుంటాయి.
ముందర మీరనుకుంటున్న సర్వీస్ లేదా ప్రాడక్ట్‌కు సంబంధించి మార్కెట్‌లో ఎటువంటి డిమాండ్ ఉందన్నదాని మీద రీసెర్చ్ చేయండి. ఒక వేళ ఐడియా అదిరిపోయిందనుకోండి నిధులు మీకు ఎక్కడినుంచైనా వస్తాయి. ఈరోజుల్లో ధాన్యమమ్మే కంపెనీలు కూడా స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నాయి
మీ స్టార్టప్ కంపెనీ ఎన్ని రోజులు నిలబడుతుంది అన్న విషయం మీ ఐడియాలో ఎంత దమ్ముంది అన్నదాని మీద ఆధారపడుతుంది. అలాగే మీ టీం ఎలా ఉంది, మీ బిజినెస్ మోడల్ ఎంత శక్తిమంతంగా ఉంది, అన్నిటికి మించి మీలో ఎంత అంకితభావం ఉందన్న దాని మీద విజయం ఆధారపడి ఉంటుంది.
హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అందిస్తున్న డేటా ప్రకారం ఇప్పటికే ఏదో ఒక కంపెనీ లో జాబ్ చేసుకుంటున్న వారే 70% స్టార్టప్ ఐడియాలతో ముందుకొస్తున్నారు.
సో ఇంకెందుకు ఆలస్యం!! బుర్రకు పదును పెట్టండి తదుపరి విజయవంతమైన స్టార్టప్ మీదే కావచ్చు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









